అవంతి సారూ...ఎక్కడ ఉన్నారో ?

ఇక గంటా బలమైన నేత అని వేరేగా చెప్పాల్సింది లేదు. ఆయన తన వారసుడిగా కుమారుడు గంటా రవితేజాను తెచ్చే ప్రయత్నంలో ఉన్నారని అంటున్నారు

Update: 2024-10-27 08:30 GMT

వైసీపీలో మూడేళ్ళ పాటు మంత్రిగా పనిచేసి కీలక నేతగా విశాఖ జిల్లా వైసీపీ ప్రెసిడెంట్ గా పనిచేసిన అవంతి శ్రీనివాసరావు ఇటీవల ఎన్నికల్లో ఓటమి తరువాత పెద్దగా కనిపించడం లేదు. ఆ మధ్యన జగన్ విశాఖ జిల్లా సమావేశం నిర్వహిస్తే ఆయన కనిపించారు.

అయితే జగన్ విజయనగరం గుర్ల మండలంలో అతిసార బాధితులను పరామర్శించడానికి వచ్చి వెళ్తునప్పుడు విశాఖలో చాలా మంది వైసీపీ నేతలు ఆయనను కలిసారు. అయితే ఎక్కడా అవంతి శ్రీనివాసరావు అయితే కనిపించడం లేదు అని అంటున్నారు.

ఆయన మీడియా ముందుకు కూడా పెద్దగా రావడం లేదు. ఏపీలోనే ఆయన మీద పోటీ చేసి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన గంటా శ్రీనివాసరావుది అత్యధిక మెజారిటీగా ఉంది. అంతలా భీమిలీలో వైసీపీ ఓటమి పాలు అయింది. ఇక గంటా బలమైన నేత అని వేరేగా చెప్పాల్సింది లేదు. ఆయన తన వారసుడిగా కుమారుడు గంటా రవితేజాను తెచ్చే ప్రయత్నంలో ఉన్నారని అంటున్నారు.

మరో వైపు చూస్తే జనసేన కూడా భీమిలీలో గట్టిగా ఉంది. ఆ పార్టీ నుంచి 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన పంచకర్ల సందీప్ కి పాతిక వేల దాకా ఓట్లు వచ్చాయి. ఇపుడు జనసేనకు మరింత ఆదరణ పెరిగింది. ఈ రెండు పార్టీలూ కూటమి ప్రభుత్వంలోనే ఉన్నాయి. దాంతో అత్యంత పటిష్టంగా భీమిలీలో కూటమి ఉంది. మరో వైపు వైసీపీలో నేతలు కూడా సైలెంట్ అయిపోయారు. అవంతి సైతం తమ విద్యా సంస్థలు వ్యాపారాల మీదనే ఫోకస్ పెడుతున్నారు అని అంటున్నారు.

మరో వైపు చూస్తే ఆయనకు వైసీపీ జిల్లా అధ్యక్ష పదవిని ఇస్తారని అనుకున్నా అది కాస్తా మరో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కి వెళ్ళిందని అంటున్నారు. దాంతో దాని మీద కూడా ఆయన అసంతృప్తిగా ఉన్నారా అన్న చర్చ ఉంది. అంతే కాదు గతంలో విజయసాయిరెడ్డి రీజనల్ కో ఆర్డినేటర్ గా ఉన్నపుడు ఇద్దరి మధ్యన గ్యాప్ వచ్చి రాజకీయంగా అవంతి ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఇపుడు మళ్లీ విజయసాయిరెడ్డిని రీజనల్ ఓ ఆర్డినేటర్ గా ప్రకటించడంతో కూడా ఆయన లూప్ లైన్ లోకి వెళ్ళిపోయారు అని అంటున్నారు. మొత్తం మీద బలమైన సామాజిక వర్గానికి చెందిన వారు అయిన ఈ మాజీ మంత్రి వైసీపీలో ఉన్నట్లా లేనట్లా అన్నట్లుగా ఉన్నారని అంటున్నారు.

ఆయనకు టీడీపీలో కానీ జనసేనలో కానీ వెళ్లేందుకు ఆస్కారం లేకపోవడం కూడా ఇబ్బందే అని అంటున్నారు. ఇక ఆయనకు ఉన్న ఆప్షన్ బీజేపీ. అందులోకి వెళ్లలేకపోతే వైసీపీలోనే ఇలా సైలెంట్ గా ఉండాల్సిందే అంటున్నారు. మరి విజయసాయిరెడ్డి రాకతో అటు విజయనగరం జిల్లాలో బొత్స వర్గం కూడా గుర్రుమంటోంది అన్న ప్రచారం ఉంది. మొత్తానికి విజయసాయిరెడ్డి ఈ సమస్యలను ఎలా సర్దుబాటు చేస్తారో చూడాల్సిందే అంటున్నారు.

Tags:    

Similar News