ఎస్సీ సీట్లపై ప్రత్యేక ఫోకస్
రాబోయే ఎన్నికల్లో ఎస్సీ సీట్లన్నింటినీ క్లీన్ స్వీప్ చేయాలని జగన్మోహన్ రెడ్డి టార్గెట్ పెట్టుకున్నారు
రాబోయే ఎన్నికల్లో ఎస్సీ సీట్లన్నింటినీ క్లీన్ స్వీప్ చేయాలని జగన్మోహన్ రెడ్డి టార్గెట్ పెట్టుకున్నారు. అందుకు వీలుగా యాక్షన్ ప్లాన్ అమలుచేస్తున్నారు. రాష్ట్రంలో 27 ఎస్సీ సీట్లున్నాయి. 2019 ఎన్నికల్లో వైసీపీ 25 సీట్లను గెలుచుకున్నది. తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలులో జనసేన, ప్రకాశంజిల్లాలోని కొండెపి స్ధానంలో టీడీపీ గెలిచింది. అందుకనే రాబోయే ఎన్నికల్లో మొత్తం 27కి 27 సీట్లను వైసీపీనే గెలుచుచోవాలన్నది జగన్ టార్గెట్. అంటే 175కి 175 సీట్లు గెలవాలన్న టార్గెట్ లో ఎస్సీ సీట్లలో నూరుశాతం గెలుపు ఒక భాగమన్నమాట.
పోయిన ఎన్నికల్లో రాజోలులో జనసేన అభ్యర్ధిగా రాపాక వరప్రసాద్ గెలిచినా నిజానికి తాను వైసీపీ నేత. వైసీపీలో టికెట్ రాకపోవటంతో జనసేనలో చేరి టికెట్ తెచ్చుకుని గెలిచారు. ఇక కొండెపిలో టీడీపీ తరపున బాలవీరాంజనేయస్వామి గెలిచారు. రాబోయే ఎన్నికల్లో స్వామిని ఓడించాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకనే యర్రగొండపాలెంలో మూడుసార్లు గెలిచిన మంత్రి ఆదిమూలపు సురేష్ ను జగన్ కొండెపికి మార్చారు. యర్రగొండపాలెంలో కొత్త అభ్యర్ధిని గెలిపించటంతో పాటు కొండెపిలో కూడా గెలవాలని సురేష్ కు జగన్ స్పష్టంగా చెప్పారు.
అలాగే మిగిలిన 25 నియోజకవర్గాల్లో కూడా గెలుపుకు అభ్యర్ధులను జగన్ ఆచితూచి ఎంపికచేస్తున్నారు. ఇపుడు సమస్వయకర్తలుగా నియమించిన వారి పనితీరు ఆధారంగా అవసరమైతే కొత్తవారిని పోటీలోకి దింపేందుకు వెనకాడటంలేదు. అందుకనే ఇపుడు నియమితులైన నేతలు, సిట్టింగ్ ఎంఎల్ఏలు కష్టపడిపనిచేస్తున్నారు. 27 నియోజకవర్గాల్లో గెలుపుకు స్పష్టమైన ప్లాన్ చేశారు. అన్నింటిలోను ఎస్సీ నేతలతో పాటు ఇతర సామాజికవర్గం నేతలను బృందాలుగా ఏర్పాటుచేసి ప్రచారం చేయిస్తున్నారు.
గడచిన ఐదేళ్ళల్లో తమ ప్రభుత్వంలో ఎస్సీలకు జరిగిన మేళ్ళు, అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమకార్యక్రమాలను ఈ బృందాలు వివరిస్తున్నాయి. ఒక్కసీటు కూడా ఓడేందుకు లేదని జగన్ ఎస్సీ సామాజికవర్గం నేతలతో జరిగిన సమావేశాల్లో పదేపదే చెబుతున్నారు. ఇదే సమయంలో ఎస్సీ నియోజకవర్గాల్లో వీలైనన్ని చోట్ల గెలవాలని టీడీపీ కూటమి కూడా ప్రయత్నాలు మొదలుపెట్టింది. జనసేన మద్దతు, బీజేపీ కూడా కలిసొస్తే కూటమి అభ్యర్ధుల గెలుపు ఖాయమని టీడీపీ భావిస్తోంది. మరి ఎవరి ప్రయత్నాలు సక్సెస్ అవుతాయో చూడాల్సిందే.