ఐఏఎస్‌లకు అందలం.. ఎవరికి మూడుతుందో.. వైసీపీలో చర్చ..!
నిజానికి ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు రాజకీయాల్లోకి రావడం కొత్తకాదు. ఇప్పటికే ఒక మాజీ ఐఏఎస్ వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న విషయం తెలిసిందే.
ఏపీ అధికార పార్టీ వైసీపీలో ఆసక్తికర చర్చ తెరమీదికి వచ్చింది. ఏ ఇద్దరు కలిసినా.. తమ స్థానాలు సేఫేనా అని చర్చించుకుం టున్నారు. అంతేకాదు.. పార్టీ అధినేత మనసు ఇలా మారిందేంటా? అని కూడా చర్చించుకుంటున్నారు. దీనికి కారణం.. తాజా గా ఇద్దరి నుంచి నలుగురు వరకు ఐఏఎస్‌లను వచ్చే ఎన్నికల్లో రంగంలోకి దింపే అవకాశం ఉందని పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. నిజానికి ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు రాజకీయాల్లోకి రావడం కొత్తకాదు. ఇప్పటికే ఒక మాజీ ఐఏఎస్ వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న విషయం తెలిసిందే. గతంలో ఆయన తిరుపతి పార్లమెంటు సభ్యుడిగా కూడా పనిచేశారు.
ఈ పరంపరలో గతంలో జనసేన కూడా అప్పటికప్పుడు రిజైన్ చేసిన మాజీ ఐపీఎస్ వీవీ లక్ష్మీనారాయణకు విశాఖ ఎంపీగా టికెట్ ఇచ్చింది. ఇక, టీడీపీ తరఫున పోటీ చేస్తారని అనుకున్న మాజీ ఐఏఎస్ రామాంజనేయులు తృటిలో ఎందుకో తప్పుకొ న్నారు.
ఇక, అప్పట్లో డీజీపీగా చేసి రిటైరైన రాముడు కూడా రాజకీయాల్లోకి వచ్చేందుకు ప్రయత్నించారు.కానీ, అప్పట్లో ఆయనకు కూడా బ్రేకులు పడ్డాయి. అంటే.. మొత్తంగా రాజకీయాల్లో ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు కొత్తకాదు. వారికి అనుకూలంగా ఉంటే.. పార్టీల తరఫున వారు పోటీ చేసేందుకు అదృష్టం పరిశీలించుకునేందుకు వెనుకాడరు.
ఈ క్రమంలోనే వైసీపీ తరఫున పోటీ చేసేందుకు పొరుగు రాష్ట్రానికి చెందిన ఒకరు, ఏపీకే చెందిన ఒక ఐఏఎస్ దూకుడుగా ఉన్నారని చర్చసాగుతోంది. మరోవైపు.. ఇద్దరు ఐపీఎస్‌ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. చంద్రబాబు హయాంలో డీజీపీగా పనిచేసి.. రిటైరైన ఒకకీలక సామాజిక వర్గానికి చెందిన ఐపీఎస్ అధికారి.. తాజాగా గుట్టు చప్పుడు కాకుండా.. తాడేపల్లికి వచ్చివెళ్లడం.. పార్టీ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. బీసీ రిజర్వేషన్ కోసం పోరాడుతున్న కీలక సామాజిక వర్గం బలం ఎక్కువగా ఉన్న చోట నుంచి ఎంపీ టికెట్‌ను ఆయన ఆశిస్తున్నారనే చర్చ సాగుతోంది.
ఇక, ఈ పరంపరలోనే ప్రస్తుత ఐఏఎస్ అధికారిగా ఉన్న ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అధికారి కూడా జగన్ ఊ అంటే.. రిజైన్ లెటర్ సబ్మిట్ చేసేందుకు రెడీ అంటున్నారట. అంతేకాదు.. వచ్చే ఎన్నికల్లో తన గెలుపు ఖాయమని కూడా తన కింది స్థాయి అధికారులకు కూడా ఆయన చెబుతున్నారని వైసీపీ నాయకలుఉ అంటున్నారు.
అయితే.. ఈయన కూడా సీఎం జగన్‌ను కలిసేందుకు రెడీగానే ఉన్నా.. ప్రస్తుతం ఢిల్లీ పరిణామాలు.. పొత్తుల పరిణామాలు తేలితే.. ఇలాంటి వారికి అవకాశం ఉంటుందని సీనియర్ల మధ్య జరుగుతున్న చర్చను బట్టి తెలుస్తోందని అంటున్నారు. మొత్తంగా.. వీరిని కనుక రాజకీయాల్లోకి తీసుకుంటే.. అధినేతకు, పార్టీకి ఎలాంటి ప్రయోజనం ఉన్నా.. కీలక నాయకులకు మాత్రం ప్లేట్ ఎగిరిపోయే ప్రమాదంఉందనేది నాయకుల భయం. ఇదీ.. సంగతి!