వైఎస్ విజయమ్మ దగ్గరకు జగన్ దూత...!?

ఈ పరిణామాల క్రమంలో జగన్ దూతగా పార్టీలో కీలకంగా ఉన్న ఒక పెద్దాయన విజయమ్మ వద్దకు ఆదివారం వెళ్లారని అంటున్నారు.

Update: 2024-01-29 12:15 GMT

వైఎస్ విజయమ్మ ఇపుడు వైఎస్సార్ ఫ్యామిలీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. ఆమె దివంగత నేత అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకుడు డాక్టర్ వైఎస్సార్ లోని సగభాగం. ధర్మపత్నిగా ఉన్నారు. ఆమె ఇపుడు తరచూ ఏపీ రాజకీయాల్లో చర్చకు వస్తున్నారు. అలా ఆమెను చర్చకు వచ్చేలా వైఎస్సార్ కుమార్తె కాంగ్రెస్ ఏపీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల చేస్తున్నారు.

పదే పదే ఆమె మాట్లాడుతూ మా అమ్మ విజయమ్మ సాక్ష్యం అని అంటున్నారు. దాంతో విజయమ్మ కేంద్ర బిందువుగా మారుతున్నారు ఇవన్నీ ఇలా ఉంటే అటు అన్నా ఇటు చెల్లెలు రాజకీయంగా వేరు పడి పోరాటానికి దిగుతున్నారు. దాంతో తల్లి ఎటు వైపు అన్నది సహజంగా ప్రశ్నగా వస్తుంది. విజయమ్మ తన పక్షం అన్నట్లుగానే షర్మిల మాటలు ఇస్తున్న ప్రకటనలు బట్టి జనాలు అర్ధం చేసుకునేలా ఉంది.

మా అమ్మ సాక్ష్యం అంటే ఆమె కూడా తన వైపే అన్న అర్ధం అందులో ధ్వనిస్తోంది. ఇవన్నీ పక్కన పెడితే అసలు విజయమ్మ కదా వైఎస్సార్ కి అసలు సిసలు వారసురాలు. ఆమె బయటకు వచ్చి ఏదైనా చెబితే దానికి ఎంతో విలువు ఉంటుంది కదా అన్న చర్చ కూడా వస్తోంది. ఇంకో వైపు పదవీ బాధ్యతలు స్వీకరించి వారం దాటిన తరువాత కూడా షర్మిల ధాటి ఎక్కడా తగ్గడంలేదు.

ఆమె అన్న జగన్ మీద విమర్శల దాడిని మరింతగా పెంచేస్తున్నారు దాంతో ఆమెకు కౌంటర్లు ఇవ్వడం వైసీపీకి కష్టతరం అయిపోతోంది. ఎవరు అయినా ఒక పరిమితి పరిధికి పెట్టుకునే మాట్లాడుతారు. ఎందుకంటే ఆమె వైఎస్సార్ తనయ, అలాగే వైఎస్ జగన్ సోదరి. ఎప్పటికైనా ఆ ఇద్దరూ ఒక్కటి అవుతారేమో. మధ్యలో మనకెందుకు ఇరుక్కుంటామని ఆచీ తూచీ రెస్పాండ్ అవుతున్నారు చాలా మంది వైసీపీ నేతలు

దాంతో షర్మిలకు సరైన కౌంటర్లు ఇచ్చే పరిస్థితి అయితే వైసీపీలో లేకుండా పోయింది అని అంటున్నారు. దీంతో ఆమె మరింతగా జోరు పెంచుతున్నారు. మరి షర్మిలకు కౌంటర్ ఇవ్వాలంటే అన్న జగన్ కే సాధ్యం.కానీ ఆయన ఎక్కడా పెదవి విప్పరు. ఆయన సీఎం గా ఉన్నారు. దాంతో ఆయన కనుక ఈ కామెంట్స్ కి జవాబు ఇస్తూ పోతే రాజకీయంగా కూడా అది లెక్క సరిపోయేది కాదు.

అందుకే వైఎస్ విజయమ్మను తెచ్చి తమ పార్టీ ముందు పెట్టి కౌంటర్లు ఇప్పించాలన్న ఆలోచన అయితే వైసీపీ పెద్దలలో ఉందని అంటున్నారు. ఈ పరిణామాల క్రమంలో జగన్ దూతగా పార్టీలో కీలకంగా ఉన్న ఒక పెద్దాయన విజయమ్మ వద్దకు ఆదివారం వెళ్లారని అంటున్నారు. హైదరాబాద్ లో ఉన్న విజయమ్మ వద్దకు ఆయన వెళ్ళి అనేక విషయాలను చర్చించారు అని అంటున్నారు.

ఏపీలో షర్మిల కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించి జగన్ ప్రభుత్వాన్ని ముప్పతిప్పలు పెడుతూండడం వంటివి కూడా ప్రస్తావనకు వచ్చి ఉంటాయని అంటున్నారు. ఇది సొంత ప్రభుత్వానికి వైఎస్సార్ కీర్తికి కూడా అపఖ్యాతి అని కూడా పేర్కొన్నట్లుగా చెబుతున్నారు.

అంతే కాదు ఏపీలో ఇపుడున్న పరిస్థితుల్లో విజయమ్మ వైసీపీ తరఫున ప్రచారం చేయాలని కూడా ఆయన విజయమ్మను కోరినట్లుగా ప్రచారం సాగుతోంది. ఏపీలో ఇపుడున్న పరిస్థితులలో వైసీపీ ఒంటరి పోరాటం చేస్తున్న సంగతి విధితమే. సొంత చెల్లెలే అన్న ప్రభుత్వాన్ని దుయ్యబెడుతోంది. మిగిలిన పార్టీల ప్రచారం కానీ వారి విమర్శలు కానీ పెద్దగా ఎక్కక పోయినా షర్మిల స్పీచ్ మాత్రం జనంలోకి బాగా వెళ్తుందని భావిస్తున్నారు.

అందుకే దాన్ని కౌంటర్ చేస్తూ విజయమ్మను రంగంలోకి దింపాలని వైసీపీ చూస్తోంది అని అంటున్నారు అయితే అంతా విన్న విజయమ్మ ఏదీ తన నిర్ణయం ప్రకటించలేదు అని అంటున్నారు. ఆమెకు జగన్ అంటే ప్రేమాభిమానాలు ఉన్నా అదే సమయంలో అవతల వైపు కుమార్తె షర్మిల ఉన్నారు. దాంతో ఆమె ఎటూ చెప్పలేరు అని అంటున్నారు. ఒక విధంగా ఆమె ఎవరి పక్షం అంటే చెప్పడమూ కష్టమే.

అందుకే ఆమె మానసికంగా ఇబ్బంది పడుతున్నారు అని అంటున్నారు. అలా జగన్ దూతగా వచ్చిన పెద్దాయనకు కూడా ఆమె ఏమీ గట్టిగా చెప్పలేని పరిస్థితి ఉందని అంటున్నారు. మరి విజయమ్మ జగన్ తరఫున ఎన్నికల ప్రచారం చేస్తారా 2019లో మాదిరిగానే వైసీపీకి ఆమె స్టార్ క్యాంపెయినర్ అవుతారా అన్నది చూడాల్సి ఉంది. విజయమ్మ కనుక వైసీపీ వైపు వెళ్తే షర్మిల చూస్తూ ఊరుకుంటారా అపుడు కుటుంబ రాజకీయ చిత్రం కొత్త మలుపు తిరిగే అవకాశాలు కూడా ఉంటాయని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.


Tags:    

Similar News