వివేకా హత్యకు రషీద్ హత్యకు లింక్ చెప్పిన చంద్రబాబు

కక్ష సాధింపులు, కక్షా రాజకీయాలు తాను కూడా చేయగలనని, కానీ, రాజకీయ ప్రతీకారాలకు వెళ్ళొద్దని చంద్రబాబు హితవు పలికారు.

Update: 2024-07-22 11:25 GMT

సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రస్తావనకు రావాల్సిన అంశాలపై జనసేన, బిజెపి, టిడిపి ఎమ్మెల్యేలు అంతా కలిసి చర్చించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరు వ్యవహరించొద్దని అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు చంద్రబాబు సూచించారు. ఒకవేళ అలా విఘాతం కలిగిస్తే తన మన అని కూడా చూడనని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కక్ష సాధింపులు, కక్షా రాజకీయాలు తాను కూడా చేయగలనని, కానీ, రాజకీయ ప్రతీకారాలకు వెళ్ళొద్దని చంద్రబాబు హితవు పలికారు.

వివేకా హత్యను ఇతరుల మీద నెట్టే ప్రయత్నం చేశారని, వినుకొండ హత్య ఘటన విషయంలో కూడా ఇదే జరుగుతోందని చంద్రబాబు చెప్పారు. ఇక మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అర్థరాత్రి అగ్నిప్రమాదం జరగడం, మరుసటి రోజు ఉదయం వరకు రెవెన్యూ అధికారులు, పోలీసులు పట్టించుకోకపోవడం వంటి ఘటనలపై కూడా చంద్రబాబు స్పందించారు. గత ప్రభుత్వంలో ప్రభుత్వ వ్యవస్థలు పనిచేయడం మానేశాయనేందుకు ఈ ఘటన ఉదాహరణ అని అన్నారు. మూడు పార్టీల మధ్య మంచి సమన్వయం ఉండాలన్న విషయాన్ని నాదెండ్ల మనోహర్ ప్రస్తావించారు. ఇక చంద్రబాబు తీసుకున్న ప్రతి నిర్ణయానికి జనసేన ఎమ్మెల్యేలందరూ తనతో పాటు పూర్తి మద్దతిస్తారని పవన్ చెప్పారు.

కాగా, గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం ముగిసిన తర్వాత ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీడీపీ తరపున సీఎం చంద్రబాబు, పయ్యావుల కేశవ్ హాజరయ్యారు. జనసేన తరపున నాదెండ్ల మనోహర్, బీజేపీ తరపున విష్ణుకుమార్ రాజు హాజరయ్యారు. కానీ, బీఏసీ సమావేశానికి వైసీపీ తరఫున ఎవరూ హాజరు కాలేదు. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, చేపట్టాల్సిన అంశాలపై చర్చించారు. 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. సభలో శ్వేతపత్రాలను విడుదల చేయాలని అధికార పక్షం ప్రతిపాదించింది.

ఊహించినట్లుగానే అసెంబ్లీ సమావేశాలను వైసీపీ నేతలు బాయ్ కాట్ చేశారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించి ఆ తర్వాత కాసేపటికి సభ నుంచి వైసీపీ సభ్యులంతా సభ నుంచి బయటకు వెళ్లిపోయారు.

Tags:    

Similar News