మరో వివాదం: బిడ్డ బొడ్డుతాడు కట్ చేసిన యూట్యూబర్!

కొందరికి సాఫీగా నడవటం అస్సలు ఇష్టం ఉండదు. వివాదాలతో సహవాసం చేయటం ద్వారా తరచూ వార్తల్లోకి ఎక్కే తీరు ఒకప్పుడు కొందరు సెలబ్రిటీలు.

Update: 2024-10-22 04:52 GMT

కొందరికి సాఫీగా నడవటం అస్సలు ఇష్టం ఉండదు. వివాదాలతో సహవాసం చేయటం ద్వారా తరచూ వార్తల్లోకి ఎక్కే తీరు ఒకప్పుడు కొందరు సెలబ్రిటీలు.. రాజకీయ నేతలు చేసేవారు. ఇప్పుడా పనిని యూట్యూబర్లు కొందరు చేస్తున్నారు. తాము చేసే పనులను వీడియోల ద్వారా ప్రచారం చేసుకునే వీరికి.. సోషల్ మీడియా ఫుణ్యమా అని పేరు.. ఫేం వచ్చేశాయి. వీటితో మరింత బాధ్యతగా వ్యవహరించటానికి బదులుగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తీరు వివాదాల్లోకి నెట్టేస్తుంది.

అలాంటి తీరును ప్రదర్శించే యూట్యూబర్లలో ఇర్ఫాన్ ఒకరు. తరచూ ఏదో ఒక ఎదవ పని చేయటం.. వివాదంలోకి చిక్కుకోవటం ఇతగాడి హాబీ. ఇర్ఫాన్ వ్యూస్ పేరుతో హోటళ్లలో పుడ్ గురించి.. వాటి టేస్టు గురించి ఇంటర్వ్యూలు చేయటం.. సెలబ్రిటీలతో ఇంటర్వ్యూ చేసే ఇతడికి గత ఏడాది పెళ్లైంది.

భార్య గర్భవతి అయినప్పుడు దుబాయ్ లోని తీసిన స్కాన్ లో ఆడబిడ్డ పుట్టబోతునట్లుగా ప్రకటించి వివాదంలోకి చిక్కుకున్నాడు. లింగనిర్దారణ చేయటం చట్టప్రకారం నేరమన్న విషయం కాస్త చదువుకున్న అందరికి తెలిసిందే. అయినప్పటికీ వాటిని పట్టించుకోకుండా స్కానింగ్ రిపోర్టు ఆధారంగా తనకు ఆడపిల్ల పుట్టనుందన్న విషయాన్ని ప్రకటించటంతో అతడిపై కేసు నమోదు చేశాడు. దీంతో దిగి వచ్చిన అతను.. తాను చేసిన పనికి సారీ చెప్పి వేడుకోవటంతో అతడిపై చర్యలు నిలిపేశారు.

ఇదిలా ఉంటే.. తాజాగా భార్యకు నెలలు నిండి ప్రసవ సమయంలో ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్లి.. బిడ్డ బొడ్డు తాడును ఇర్ఫాన్ కట్ చేయటం.. దీనికి సంబంధించిన వీడియోను విడుదల చేయటంతో అతడు మరోసారి వివాదానికి కేరాఫ్ అడ్రస్ అయ్యాడు. అయినా.. ఇలాంటి పనులను ఎంకరేజ్ చేయకూడని వైద్యులు.. అతడికి అనుమతి ఎలా ఇచ్చారన్నది ఒక ప్రశ్న.

ఇతగాడి వీడియోతో రేగిన దుమారంతో.. దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలంటూ ఇర్పాన్ కు తమిళనాడు రాష్ట్ర గ్రామీణ సంక్షేమ పనుల శాఖ డైరెక్టర్ నోటీసులు జారీ చేశారు. తమిళనాడు చట్టాల ప్రకారం అతగాడు చేసిన పని తప్పుగా వైద్యులు చెబుతున్నారు. ఎంత యూట్యూబర్ అయితే మాత్రం.. వీడియోలు పోస్టు చేయటం కోసం.. ఇలాంటి పనులు ఎలా చేస్తారన్నది ప్రశ్న. అదే సమయంలో అతడ్ని ఎలా ఎంకరేజ్ చేస్తారని ప్రశ్నిస్తున్నారు. యూట్యూబర్ ఇర్ఫాన్ తో పాటు.. అతడికి ఆ అవకాశం ఇచ్చిన ఆసుపత్రి.. వైద్యులకు నోటీసులు ఇవ్వటం మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News