వైసీపీని పంచుకుంటున్న జనసేన బీజేపీ !
ఒకనాడు గట్టి పార్టీగా ఉన్న వైసీపీకి ఎంత కష్టం వచ్చింది అన్న చర్చ సాగుతోంది. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వైసీపీ గతంలో ఎన్నడూ చూడని గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది.
ఒకనాడు గట్టి పార్టీగా ఉన్న వైసీపీకి ఎంత కష్టం వచ్చింది అన్న చర్చ సాగుతోంది. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వైసీపీ గతంలో ఎన్నడూ చూడని గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఆ పార్టీ క్యాడర్ లీడర్లు అందరూ జారిపోయిన నేపథ్యం కనిపిస్తోంది. ఇక మిగిలిన వారిని కూడా జనసేన బీజేపీ పంచుకోవాలని చూస్తున్నాయి. దాంతో ఫ్యాన్ రెక్కలు అక్కడ విరిగిపోతున్నాయా అన్న చర్చ అయితే సాగుతోంది.
ఇదిలా ఉంటే ఒకనాడు దాదాపుగా బడా నాయకులు అంతా వైసీపీలోనే ఉండేవారు. అలాగే వైసీపీకి అధిక బలం కూడా ఆనాడు ఉంది. 2014లో ఆ పార్టీ పోటీ చేసిన వైసీపీ 48,370 ఓట్లను సాధించింది. ఇక 2019లో చూస్తే వైసీపీకి 48,443 ఓట్లు దక్కాయి. ఇక 2024 ఎన్నికలకు వచ్చేసరికి అవి కాస్తా బాగా తగ్గాయి. ఈసారి అయితే 33,274 ఓట్లు వచ్చాయి. అంటే 15 వేల ఓట్లు ఒక్కసారిగా తగ్గాయన్నమాట.
ఇక విశాఖ సౌత్ నుంచి ఒకనాడు పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న నాయకులు అంతా జారుకుంటున్నారు. ఆ పార్టీలోని సీనియర్ నేత 2014లో పోటీ చేసిన కోలా గురువులు తనకు వైసీపీ జిల్లా అధ్యక్ష పదవిని తీసేశారు అని అలిగి పార్టీకి దూరం అయ్యారు మరో సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే ఎస్ ఏ రహమాన్ పార్టీని వీడిపోయారు.
ఇక 2024 లో వైసీపీ నుంచి పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కూడా పక్క చూపులు చూస్తున్నారు అని ప్రచారం సాగుతోంది. ఆయన బీజేపీలోకి వెళ్తారు అని అంటున్నారు. ఆయన టీడీపీ నుంచి 2014, 2019లలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన ఆ పార్టీలోకి వచ్చారు. 2024 లో టికెట్ సాధించారు. కానీ గెలవలేకపోయారు.
ఈ నేపధ్యంలో ఆయన తిరిగి టీడీపీలో చేరాలని చూసినా కుదరడం లేదు అంటున్నారు. దాంతో ఆయన వయా మీడియాగా బీజేపీలో చేరి కూటమిలో ఉండాలని ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. దానికి బీజేపీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఎందుకంటే బీజేపీకి కూడా దక్షిణంలో బలం ఒక మాదిరిగా ఉన్నా సరైన నాయకత్వం లేదు. దాంతో బలమైన సామాజిక వర్గానికి చెందిన వాసుపల్లిని తమతో కలుపుకోవాలని చూడవచ్చు అని అంటున్నారు.
ఇక వాసుపల్లి తీరు ఇలా అనుమానాస్పదంగా ఉంటే వైసీపీ హయాంలో కార్పోరేటర్లుగా గెలిచిన వారు కీలక నామినేటెడ్ పదవులు అందుకున్న వారు కూడా జనసేనలో చేరిపోతున్నారు. తాజాగా ప్రఖ్యాత కనకమహాలక్ష్మి దేవాలయం చైర్ పర్సన్ గా చేసిన సీనియర్ నాయకురాలు ఒకరు జనసేన కండువా కప్పుకున్నారు. ఆలాగే కార్పోరేటర్లు కొందరు పార్టీ మారారు.
వీరికి వచ్చే ఏడాది జరిగే లోకల్ బాడీ ఎన్నికల్లో కార్పోరేటర్ టికెట్లు ఇచ్చేందుకు కూడా అంగీకారం కుదిరింది అని అంటున్నారు. ఎన్నికలకు ముందే వైసీపీ నుంచి కీలక నేత ఒకరు టీడీపీలోకి మారిపోయారు. ఇలా వైసీపీ నుంచి ఈ రోజు విశాఖ సౌత్ లో చూస్తే చెప్పుకోదగిన నాయకుడు లేరని అంటున్నారు. పార్టీ జిల్లా బాధ్యతలు చూస్తున్న వారు కూడా పట్టించుకోకపోవడం ఎక్కడ చూసినా వర్గ విభేదాలు భవిష్యత్తు మీద బెంగ వంటి కారణాలతో దక్షిణ నియోజకవర్గం నుంచి నేతలు కూటమి వైపుగా పోతున్నారు అని అంటున్నారు.