వైసీపీ ఎమ్మెల్యేల తీరు... విమర్శల పాలు
ప్రతీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యేలకు బహుమతులు ఇవ్వడం ఒక ఆనవాయితీగా వస్తోంది.;
ప్రతీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఎమ్మెల్యేలకు బహుమతులు ఇవ్వడం ఒక ఆనవాయితీగా వస్తోంది. ఈసారి కూడా ఏపీ అసెంబ్లీలో అదే ఆనవాయితీని కొనసాగించారు. అయితే ఈసారి ఐపాడ్స్ తో పాటు గిఫ్ట్ హ్యాంపర్ ని ఇచ్చారు. అలాగే జీసీసీ వారి అరకు కాఫీ సామగ్రిని అందచేశారు.
సరే ఇవన్నీ ఎందుకు ఈ ప్రస్తావన ఎందుకు అంటే వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరు కాలేదు. కానీ వారు కూడా ఈ బహుమతులు అన్నీ పుచ్చుకున్నారు అని అంటున్నారు. ఎమ్మెల్యే ఎవరైనా అరవై రోజులకు మించి వరసగా గైర్ హాజరు అయితే ఆయన సభ్యత్వం ఆటోమేటిక్ గా రద్దు అవుతుందని రాజ్యాంగంలోని ఆర్టికల్ 190(4) ప్రకారం స్పష్టంగా ఉంది. దానినే బేస్ చేసుకుని అసెంబ్లీ నిబంధనలను రూపొందించారు. అయితే ఈ నిబంధన వల్ల సభ్యత్వాలు పోకుండా బడ్జెట్ సెషన్ కి ముందు గవర్నర్ ప్రసంగానికి జగన్ సహా పది మంది వైసీపీ ఎమ్మెల్యేలు సభకు వచ్చారు.
కానీ గవర్నర్ ప్రసంగానికి హాజరైతే అది సభకు హాజరుగా పరిగణింపబడదని స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. దాంతో వైసీపీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు సభలోకి అడుగు పెట్టకుండానే సభ వెలుపల రిజిష్టర్ లో సంతకాలు చేశారు. దీనిని కూడా స్పీకర్ తప్పుపట్టడమే కాకుండా గట్టిగానే విమర్శించారు. ప్రజల సమస్యల కోసం సభలోకి వచ్చి మాట్లాడకుండా ఇదేమి విధానం అని ఆయన అన్నారు.
ఇలా టెక్నికల్ గా తాము సభకు వచ్చామని చెప్పుకోవడానికి వైసీపీ ఎమ్మెల్యేలు కొందరు రిజిష్టర్ లో సంతకాలు చేశారు అన్నది పెద్ద ఎత్తున ప్రచారంలోకి రావడమే కాకుండా విమర్శల పాలు కూడా అయింది. ఇవన్నీ ఇలా ఉంటే తాము సభలో ప్రశ్నలు వేయడానికి సంతకం ఉంటేనే తప్ప కుదరదు అన్న అసెంబ్లీ సిబ్బంది సూచనల మేరకే అలా సంతకాలు చేశామని వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ వివరణ ఇచ్చారు.
అలా తమ నియోజకవర్గాల ప్రజల కోసమే ఈ విధంగా చేశామని ఆయన చెప్పుకున్నారు. మరో వైపు చూస్తే జగన్ తప్ప వైసీపీ ఎమ్మెల్యేలు అంతా జీతాలు తీసుకుంటున్నారు అని స్పీకర్ సభలో ప్రకటించారు. ఇలా ప్రభుత్వం ఇచ్చే జీతాలు తీసుకుంటే వారి తరఫున ప్రజా సమస్యలు సభలోకి వచ్చి ప్రస్తావించకపోవడమేంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే బడ్జెట్ సెషన్ లో ఇచ్చే బహుమతులు కూడా వైసీపీ ఎమ్మెల్యేలు కొందరు అందుకున్నారు అన్న వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అలా ఐ ప్యాడ్స్ గిఫ్ట్ హ్యాంపర్లు తీసుకున్నారని కూడా అంటున్నారు. అంతే కాదు తమ కార్లకు ఎమ్మెలుయే స్టిక్కర్లు కూడా తగిలించేందుకు తీసుకున్నారని కూడా ప్రచారం సాగుతోంది.
ఇదంతా చూసిన వారు అంటున్నది ఏంటి అంటే హాయిగా దర్జాగా సభలోకే రావచ్చు కదా అని. ప్రజా సమస్యల మీద ప్రస్తావన చేసి మంచి పేరు తెచ్చుకోవచ్చు కదా అని. ఇలా ఎందుకు చేస్తున్నారు అన్నదే అంతా చర్చించుకుంటున్నారు. జగన్ తమ పార్టీకి అసెంబ్లీలో విపక్ష హోదా కావాలని పట్టుబడుతున్నారు. అంతవరకూ సభకు పోరాదని ఆయన ఒక డెసిషన్ తీసుకున్నారు.
అయితే ఆయన నిర్ణయాన్ని వైసీపీ ఎమ్మెల్యేలు కొందరు పూర్తి స్థాయిలో పాటించడం లేదు. అలాగని స్పీకర్ పిలుపు మేరకు సభలోకి వచ్చి ప్రజా సమస్యలను కూడా ప్రస్తావించడం లేదు. అటూ ఇటూ కాకుండా వ్యవహరించడమే చర్చకు తావిస్తోంది. రిజిష్టర్ లో సంతకాలు చేయడం అంటే అనర్హత వేటు పడకుండా చూసుకోవడమే అని అంటున్నారు.
ఇక బడ్జెట్ బహుమతులు తీసుకోవడం కార్లకు స్టిక్కర్లు తగిలించడానికి స్టిక్కర్లు తీసుకుని వెళ్ళడం ఇవన్నీ చూసిన వారు తమను గెలిపించిన ప్రజల గురించి ఆలోచించకుండా ఎందుకు ఈ విన్యాసాలు అని కామెంట్స్ చేస్తున్నారు. జగన్ విషయమే తీసుకుంటే ఆయన పట్టిన వ్రతం చెడగొడుతున్నారు. అలాగని సభకు రాకుండానూ ఉండలేకపోతున్నారని అంటున్నారు. దీని మీద వైసీపీ అధినాయకత్వమే ఏదో కీలక నిర్ణయం తీసుకోకపోతే వచ్చే సమావేశాల నాటికి మరింత ఇబ్బందులు ఎదురవుతాయని అంటున్నారు.