"సిద్ధం"... బెజవాడలో వైసీపీ - జనసేన ఫ్లెక్సీ వార్!
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైసీపీ "సిద్ధం" అంటూ సమర శంఖారావం పూర్తించిన సంగతి తెలిసిందే.
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైసీపీ "సిద్ధం" అంటూ సమర శంఖారావం పూర్తించిన సంగతి తెలిసిందే. ఈ నెల 27న భీమిలి నియోజకవర్గంలో జరిగిన ఈ భారీ బహిరంగ సభకు జనం ఏస్థాయిలో వచ్చారనేది తెలిసిన విషయమే. ఈ విషయంపై రాజకీయ ప్రత్యర్థులు సైతం కామెంట్ చేయడానికి వీలైనంత దూరాన్ని పాటించారన్నా అతిసయోక్తి కాదేమో! ఇదే సమయంలో చంద్రబాబు "రా.. కదలిరా" సభలూ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి.
ఈ సమయంలో... "సిద్ధం" వర్సెస్ "రా.. కదలిరా" సభలకు వచ్చిన స్పందన, ఆదరణం, నేతలు చేసిన ప్రసంగాలు, ఇచ్చిన హామీలు, గతంలో చెప్పిన మాటలు, చేసిన పనులు మొదలైన విషయాలను భేరీజు వేసుకుంటూ ప్రజానికం ఒక క్లారిటీకి వస్తున్నారని అంటున్నారు. ఈ సమయంలో... త్వరలో జనసేన అధినేత పవన్ కూడా ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల శంఖారావం మొదలుపెట్టబోతున్నారని అంటున్నారు. దీనికి ఏప్రిల్ 4న ముహూర్తం అని కథనాలొస్తున్నాయి.
ఆ సంగతి అలా ఉంటే... వైసీపీ చేపట్టిన "సిద్ధం" కార్యక్రమాలను ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ప్రతీ సభకూ మినిమం మూడు లక్షల మంది హాజరయ్యేలా చూడాలని.. ఒక బలమైన సంకేతాన్ని సమాజంలోకి పంపాలని ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. ఈ విషయంలో భీమిలిలో జరిగిన మొదటి "సిద్ధం" సభ భారీస్థాయిలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వైసీపీ "సిద్ధం" అంటుంటే... జనసేన "మేము సిద్ధమే" అంటుంది.
అవును... ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రచార కార్యక్రమాన్ని మొదలుపెట్టిన వైసీపీ "సిద్ధం" అంటూ రీజనల్ మీటింగ్స్ కండక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఫ్లెక్సీలు రాష్ట్ర వ్యాప్తంగా హల్ చల్ చేస్తున్నాయి. ఈ సమయంలో విజయవాడలో భారీ ఎత్తున ఈ ఫ్లెక్సీలు వెలిశాయి. దీంతో... వీటికి పక్కనే కౌంటర్ ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి. ఈ మేరకు జనసేన నేతలు, కార్యకర్తలు ఈ ఫ్లెస్కీలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో... "మేము సిద్ధమే" అని రాసి ఉండటం గమనార్హం.
ప్రస్తుతం విజయవాడలో ఉన్న "సిద్ధం" ఫ్లెక్సీ పక్కన పవన్ కల్యాణ్ ఫోటోలతో ఉన్న "మేము సిద్ధమే" అనే ఫ్లెక్సీ దర్శనమిస్తున్నాయి. వీటిని రాష్ట్ర వ్యాప్తంగా ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. ఈ ఫ్లెక్సీలలో పవన్ కల్యాణ్ ఫోటోతో పాటు వంగవీటి మోహన్ రంగ ఫోటోలను కూడా ప్రింట్ చేయడం గమనార్హం!!
కాగా... జనసేన ఎన్నికల ప్రచారం ఉత్తరాంధ్ర నుంచి మొదలు పెట్టాలని పవన్ భావిస్తున్నారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... తొలిసభను ఫిబ్రవరి 4న అనకాపల్లిలో ప్లాన్ చేశారని తెలుస్తుంది. అదే విధంగా ఉత్తరాంధ్ర సభ తర్వాత డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురంలో రెండో సభ, మచిలీపట్నంలో మూడో సభ, నాదెండ్ల మనోహర్ పోటీ చేస్తారని చెబుతున్న తెనాలిలో నాలుగోసభ, తిరుపతిలో ఐదోసభ ఉంటుందని అంటున్నారు.