ఇలా అయితే చేనేతల కోట వైసీపీకి దక్కేనా?

ప్రకాశం జిల్లా చీరాల అసెంబ్లీ నియోజకవర్గంలో అధికార పార్టీ వైసీపీలో లుకలుకలు ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారాయని అంటున్నారు.

Update: 2023-09-03 09:10 GMT

ప్రకాశం జిల్లా చీరాల అసెంబ్లీ నియోజకవర్గంలో అధికార పార్టీ వైసీపీలో లుకలుకలు ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారాయని అంటున్నారు. ఇప్పటివరకు వైసీపీ బోణీకొట్టని నియోజకవర్గాల్లో చీరాల ఒకటి. ఇక్కడ నుంచి 2009, 2014ల్లో కాపు సామాజికవర్గానికి చెందిన ఆమంచి కృష్ణమోహన్‌ గెలుపొందారు.

దివంగత గవర్నర్‌ రోశయ్య ప్రియ శిష్యుడిగా రంగ ప్రవేశం చేసిన ఆమంచి కృష్ణమోహన్‌ 2009లో కాంగ్రెస్‌ తరఫున విజయం సాధించారు. 2004లో ఇక్కడ నుంచి గెలిచిన రోశయ్య 2009లో ఎమ్మెల్సీగా ఎన్నికై తన శిష్యుడు ఆమంచికి సీటు కేటాయించారు.

ఇక 2014లో రాష్ట్ర విభజనతో కాంగ్రెస్‌ పరిస్థితి దీనంగా మారడంతో ఆమంచి ఇండిపెండెంట్‌ గా (కొత్తగా నవోదయం పార్టీ ఏర్పాటు చేసుకుని) విజయం సాధించారు. ఆ తర్వాత అధికార టీడీపీలో చేరారు. మళ్లీ 2019 ఎన్నికల ముందు వైసీపీలోకి వచ్చారు. ఆ ఏడాది ఎన్నికల్లో చీరాల నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.

మరోవైపు 2019లో టీడీపీ అభ్యర్థి కరణం బలరాం చీరాల నుంచి గెలిచారు. కరణం కమ్మ సామాజికవర్గానికి చెందినవారు. గతంలో పలుమార్లు ఎమ్మెల్యేగా, 1999లో ఒంగోలు ఎంపీగా కరణం విజయం సాధించారు. అయితే 2019లో గెలిచాక కొన్నాళ్లకు కరణం బలరాం తన కుమారుడు వెంకటేశ్‌ తో కలిసి వైసీపీలో చేరారు.

దీంతో కరణం బలరాం, చీరాల వైసీపీ నియోజకవర్గ ఇంచార్జిగా ఉన్న ఆమంచి మధ్య ఆధిపత్య పోరు చోటు చేసుకుంది. నియోజకవర్గంపై పట్టుకు వీరిద్దరూ ప్రయత్నించారు. ఇంకోవైపు చీరాలలో చేనేత సామాజికవర్గం ఎక్కువ. ఈ సామాజికవర్గానికి చెందిన పోతుల సునీత టీడీపీలో ఎమ్మెల్సీగా ఉండేవారు. ఆ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరి మళ్లీ ఎమ్మెల్సీ అయ్యారు. ఆమె కూడా చీరాలపై పట్టుకు ప్రయత్నించడంతో చీరాల అధికార పార్టీలో ముగ్గురు నేతల మధ్య మూడు ముక్కలాట మొదలైంది.

దీంతో వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌.. పోతుల సునీతను ఎమ్మెల్సీని చేశారు. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన కరణం బలరాంకే వచ్చే ఎన్నికల్లో టికెట్‌ అని తేల్చిచెప్పారు. ఆమంచి కృష్ణమోహన్‌ ను పొరుగు నియోజకవర్గం పర్చూరు నియోజకవర్గ ఇంచార్జిగా పంపారు.

ఈ నేపథ్యంలో ఇటీవల ఖాళీ అయిన పంచాయతీ వార్డు ఉప ఎన్నికల సందర్భంగా కరణం, ఆమంచి అనుచరుల మధ్య జరిగిన గొడవ కాకరేపింది. ఈ క్రమంలో కరణం సామాజికవర్గాన్ని ఉద్దేశించి ఆమంచి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌ గా మారాయి.

ఈ నేపథ్యంలో తాజాగా కరణం బలరాం తనయుడు కరణం వెంకటేశ్‌ హాట్‌ కామెంట్స్‌ చేశారు. ఆమంచి పేరు ఎత్తకుండా పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. ఎక్కడో కూర్చుని వ్యాఖ్యలు చేయడం కాదని దమ్ముంటే తమ ముందుకి వచ్చి మాట్లాడాలని సవాల్‌ విసిరారు. తన కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేది లేదని తరిమి తరిమి కొడతానని హెచ్చరించారు.

ఇటీవల ఆమంచి కృష్ణమోహన్‌ సోదరుడు ఆమంచి స్వాములు జనసేన పార్టీలో చేరారు. వచ్చే ఎన్నికల్లో ఆయన చీరాల నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కరణం వెంకటేశ్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒకడేమో సొంత పార్టీలోనే ఉండి పక్క నియోజకవర్గంలో నుంచి, ఇంకొకడు వేరే పార్టీలో ఉండి ఇక్కడ రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

ప్రకాశం జిల్లాలో ఉన్న 12 నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో టీడీపీ నాలుగు చోట్ల విజయం సాధించింది. వచ్చే ఎన్నికలకు ఇంకా ఆరేడు నెలల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో చీరాలలో అధికార పార్టీ నేతల మధ్య పోరు హాట్‌ టాపిక్‌ గా మారింది. ఇలా అయితే పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Tags:    

Similar News