వైసీపీ నుంచి జంపింగులు ఖాయం.. కానీ, ఆషాఢమే అడ్డట!
ఇక, జంప్ చేయాలని భావిస్తున్న నాయకుల జాబితా చూస్తే.. పెద్దదిగానే ఉందని అంటున్నారు పరిశీలకులు.
ఏపీలో అధికారం కోల్పోయిన వైసీపీలో ఇంకా చైతన్యం కలగడం లేదు. ప్రజలను కలుసుకునేందుకు,పార్టీని గాడిలో పెట్టేందుకు పార్టీ అధినేత జగన్ ఎలాంటి ప్రయత్నాలూ చేయడం లేదనే టాక్ వినిపిస్తోంది. దీంతో ఇక, పార్టీలో ఉండి ప్రయోజనం లేదని భావిస్తున్నచాలా మంది నాయకులు పార్టీ మారేందుకు రెడీ అవుతున్నారు. అయితే.. వీరికిఇప్పుడు కనిపిస్తున్న ఆల్టర్నేట్ పార్టీ జనసేన. ఉభయకుశలోపరిగా ఈ పార్టీ తమకు ప్రయోజనం కల్పిస్తుందని అంటున్నారు. జనసేనకు నాయకుల అవసరం ఉంది. వైసీపీలో ఉన్న నాయకులకు షెల్టర్ అవసరం ఉంది. దీంతో ఈ పార్టీ వైపు నుంచి నాయకులు జంప్ చేసేందుకు రెడీ అవుతున్నారు.
అయితే.. రాజకీయాల్లో సెంటిమెంట్లకు పెద్దపీట వేస్తారనే చర్చ ఉన్న నేపథ్యంలో జంపింగ్ నాయకులు కూడా ఇప్పుడు ముహూర్తాలు చూసుకుంటున్నారు. ప్రస్తుతం ఆషాఢం నడుస్తుండడంతో చేరికలకు ముహూర్తాలు లేవని తెలుస్తోంది. దీంతో నాయ కులు వెనుకంజ వేస్తున్నారు. మరోవైపు.. వైసీపీ నాయకులు చాలా వ్యూహాత్మకంగా కూడా వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీ విషయంలో ఎలాంటి విమర్శలు చేయకుండా చాలా మౌనంగా ఉంటున్నారు.
ఇదంతా గమనిస్తున్నవారు..పాపం వారింకా ఓటమి నుంచి కోలుకున్నట్టు లేదనే వ్యాఖ్యలు చేస్తున్నా.. అసలు వాస్తవం అది కాదని.. రేపో మాపో పార్టీ మారేందుకు రెడీ అయిన నేపథ్యంలో ఇప్పుడు వైసీపీని వెనుకేసుకు రావడం ఎందుకున్న ఉద్దేశంతోనే వారు అలా సైలెంట్‌గా ఉంటున్నారని సమాచారం.
ఎక్కడెక్కడ?
ఇక, జంప్ చేయాలని భావిస్తున్న నాయకుల జాబితా చూస్తే.. పెద్దదిగానే ఉందని అంటున్నారు పరిశీలకులు. విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీ ఖాళీ అయినా ఆశ్చర్యం లేదనే టాక్ జోరుగానే వినిపిస్తోంది. అదేసమయంలో ఏలూరు, చిత్తూ రుల నుంచి కూడా పెద్ద ఎత్తున చేరికలు ఉండే అవకాశం కనిపిస్తోంది.
వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో సీట్ల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో జనసేనకు అభ్యర్థుల కొరత వెంటాడుతోంది. దీనిని అందిపుచ్చుకునేందుకు ఇప్పటికే సభ్యత్వ నమోదుప్రక్రియ ప్రారంభించారు. దీనిని మరింత పుంజుకునేలా చేయడంతోపాటు.. వచ్చేవారిని వచ్చినట్టు పార్టీలో చేర్చుకునేందుకు జనసేన సిద్ధంగానే ఉంది. ఈ ఏడాది ఎన్నికలకు ముందు కూడాకొందరిని తీసుకున్న విషయం తెలిసిందే. సో.. ఎలా చూసుకున్నా.. వైసీపీ నుంచి జంపింగుల పర్వం కేవలం ముహూర్తం కోసమే వేచి చూస్తోందన్న వాదన వినిపిస్తోంది. శ్రావణ మాసం ఎంట్రీతో నేతలు జంప్ చేయడం ఖాయమని చెబుతున్నారు.