అప్పటి వరకు వైసీపీ ఎదురు చూపులే.. ఇదీ రీజన్...!
అందుకే కీలక నాయకులు మౌనంగా ఉన్నారని తెలుస్తోంది.
ఎదురు దాడి చేయాలి. చంద్రబాబు సర్కారుపై విమర్శల పర్వం ప్రారంభించాలి.. ఈ సర్కారు ప్రజలకు ఏమీ చేయలేదని చెప్పాలి.. ఇదీ.. ఇప్పుడు వైసీపీలోకి కొందరు నాయకుల భావన. కానీ, ఇది సాధ్యమయ్యే లా కనిపించడం లేదు. ఎందుకంటే.. కూటమి ప్రభుత్వం పగ్గాలు తీసుకుని కేవలం రెండు మాసాలే అయింది. అందునా.. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టి ఇంకా రెండు మాసాలు కూడా కాలేదు. ఈ నేపథ్యంలో ఇప్పటికిప్పుడు విమర్శలు చేస్తే తాము బద్నాం అవుతామన్న భావన వైసీపీలో ఉంది.
అందుకే కీలక నాయకులు మౌనంగా ఉన్నారని తెలుస్తోంది. అయినప్పటికీ పార్టీ కార్యకర్తలు, మీడియా నుంచి మాత్రం వారిపై తీవ్ర ఒత్తిడి అయితే కనిపిస్తోంది. అనుకూల మీడియా వర్గాలు వైసీపీ నాయకుల ఇళ్ల ముందు పడిగాపులు కాస్తున్నారు. ఇంకా సూపర్ సిక్స్ అమలు చేయలేదని.. ప్రజలను పట్టించుకోవ డం లేదని.. స్పందించాలని కోరుతున్నారు. ఇదేసమయంలో జగన్ తీసుకువచ్చిన పథకాలను కూడా అమలు చేయడం లేదని అంటున్నారు. దీనిపై రియాక్ట్ కావాలని ఒత్తిడి చేస్తున్నారు.
కానీ, నాయకులు మాత్రం ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. ఒకరిద్దరు అంబటి రాంబాబు, గుడివాడ అమ ర్నాథ్ వంటివారు స్పందిస్తున్నా.. అధిష్టానం నుంచి వద్దన్న సంకేతాలు వస్తున్నాయి. ఇంకా వెయిట్ చేయాలని జగన్ నుంచి సూచనలు అందుతున్నాయి. కనీసం ఆరు మాసాలైనా ఆగకపోతే.. మనమే ఇబ్బంది పడతామని జగన్ చెబుతున్నట్టు తెలుస్తోంది. అందుకే నాయకులు మౌనంగా ఉంటున్నారు. కొందరు తమ సొంత వ్యవహారాల్లో మునిగిపోతే.. మరికొందరు మాత్రం పొరుగు రాష్ట్రాల్లో ఉంటున్నారు.
కొడాలి నాని తన వైద్యం కోసం హైదరాబాద్‌లో ఉంటున్నారు. మాజీ మంత్రి రోజా పొరుగు రాష్ట్రాల్లోని ఆలయాల చుట్టూ తిరుగుతున్నారు. గెలిచిన ఎమ్మెల్యేలు.. ప్రజలను కలుస్తున్నారు. వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. అయితే.. ఎవరూ ఎలాంటి హామీలు ఇవ్వడం లేదు. సర్కారుపై విమర్శలు కూడా చేయడం లేదు. అలాగని వారిసొంత పనులు మానుకోవడం లేదు. మొత్తంగా చూస్తే.. మరో ఆరు మాసాల వరకు వైసీపీ నుంచి పెద్దగా దూకుడు అయితే కనిపించేలా లేదని అంటున్నారు పరిశీలకులు.