పనిమనిషి కొడుకు టీడీపీలో తిరుగుతున్నాడని వైసీపీ ఎమ్మెల్యే అలా చేశారట
మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న వేళ.. పోలీసులు దిద్దుబాటు చర్యలకు తెర తీసినట్లుగా తెలుస్తోంది.
తమ ఇంట్లో పని చేసే పనిమనిషి కొడుకు తమ ప్రత్యర్థి పార్టీకి చెందిన వారితో తిరుగుతున్నారన్న కోపంతో ఏపీ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు వ్యవహరించిన తీరు ఇప్పుడు రాజకీయంగా సంచలనంగా మారింది. గుంటూరు పట్టణ రాజకీయాల్లో కలకలంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే.. గుంటూరు ఈస్ట్ నియోజకవర్గానికి వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా వ్యవహరిస్తున్నారు. ఆయన ఇంట్లో ఆషా అనే మహిళ పని చేస్తున్నారు.
దాదాపు పదిహేనేళ్లుగా ఆమె వారింట్లో పని చేస్తోంది. అతయితే.. ఇటీవల కాలంలో ఆషా కుమారుడు తెలుగుదేశం పార్టీతోనూ.. ఆ పార్టీ నేతలతోనూ కలిసి తిరుగుతున్నాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా ఆషా మీద దొంగతనం కేసు నమోదైంది. తమ ఇంట్లో బంగారు నగలు పోయాయంటూ ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల కంప్లైంట్ నేపథ్యంలో ఆమెను పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. తనకేం తెలియదని చెప్పినా ఆమెపై దాడి చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి.
ఇటీవల ఆషాను వైసీపీ ఎమ్మెల్యే కుమార్తె.. ఆమె భర్త పిలిపించుకొని.. చోరీ అంశాన్ని ఆమెతో చెప్పారు. తనకేమీ తెలీదని చెప్పినా వినిపించకుండా తనపై దాడికి పాల్పడ్డారని.. పోలీసులతో కొట్టించినట్లుగా ఆషా చెబుతోంది. తనపై జరిగిన దాడి మీద కంప్లైంట్ ఇచ్చేందుకు పెదకాకాని పోలీస్ స్టేషన్ కు వెళ్లిన ఆమెను.. ఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లటం చర్చనీయాంశంగా మారింది. ఒక కేసుకు సంబంధించి ఫిర్యాదుకు స్టేషన్ కు వెళితే.. ఎస్పీ ఆఫీసుకు తీసుకెళ్లటం ఏమిటన్న విమర్శ పెరిగింది.
మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న వేళ.. పోలీసులు దిద్దుబాటు చర్యలకు తెర తీసినట్లుగా తెలుస్తోంది. అసలు చోరీ జరిగిందా? లేదా? ఆషాను పోలీసులు కొట్టారా? ఆ ఆరోపణల్లో నిజం ఎంత? లాంటి అన్ని వివరాలతో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఎస్పీ కార్యాలయం నుంచి డీఎస్పీకి ఆదేశాలు జారీ అయినట్లుగా చెబుతున్నారు. ఎన్నికల వేళ.. ఇలాంటి సున్నిత అంశాలపై వైసీపీ నేతలు ఆచితూచి స్పందించాల్సిన అవసరం ఉందన్న మాట వినిపిస్తోంది.