వైసీపీ సోలోగా కాదుట...కొత్త వ్యూహం !

వైసీపీ అన్న పార్టీ ఏర్పాటు అయ్యాక ఇప్పటిదాకా మరో పార్టీతో కలసినదే లేదు. రాజకీయాలలో అన్నీ చూడాలి

Update: 2024-07-21 15:30 GMT

వైసీపీ అన్న పార్టీ ఏర్పాటు అయ్యాక ఇప్పటిదాకా మరో పార్టీతో కలసినదే లేదు. రాజకీయాలలో అన్నీ చూడాలి. అందరినీ కలుపుకోవాలి. ఈ మౌలిక సూత్రాన్ని వైసీపీ విస్మరించింది. దేశంలో ఇలా ఒంటరి తనంతో బాధపడుతున్న పార్టీ బహుశా వైసీపీ తప్ప మరోటి ఉండకపోవచ్చేమో అని కూడా అంటారు.

ఎందుకంటే ప్రతీ రాజకీయ పార్టీ పోరాటాలు ఉద్యమాలు సొంత బలంతో చేయలేదు. కలసి వచ్చిన వారితో జత కడుతుంది. ఆ విధంగా చూస్తే వైసీపీ ఆవిర్భావం తరువాత కుడి ఎడమలుగా చెప్పుకునే బీజేపీ కామ్రేడ్స్ కలసి వచ్చేందుకు యత్నించాయని టాక్ ఉంది.

అయితే వైసీపీయే ఎవరితోనూ వద్దు అనుకుంది. సింహం సింగిల్ అంటూ చెప్పుకుంటూ పోయింది. కాలం కలిసి వచ్చి వైసీపీ ఒంటరి పోరు సక్సెస్ అయింది. భారీ ఆధిక్యతతో 2019 ఎన్నికల్లో గెలిచింది. అయితే అధికారంలో ఉన్నప్పుడు అయినా కొన్ని పార్టీలను దగ్గరకు తీయాలని ఆలోచన చేయలేకపోయింది.

ఫలితంగా 2024 ఎన్నికల్లో ఒంటరిగా వెళ్లి చతికిలపడింది. ఈ నేపధ్యంలో వైసీపీ కొత్త రాజకీయాన్ని అనుసరిస్తోందా అన్న చర్చ మొదలైంది. ఓటమి ఎన్నో పాఠాలను నేర్పిస్తుంది అని అంటారు. అలా తాము ఒక్కరమే కాదు మరి కొందరితో జట్టు కడితేనే బలంగా ఉంటామన్న సత్యాన్ని గ్రహించిందా అన్నది కూడా చర్చకు వస్తోంది.

దానికి సంకేతం అన్నట్లుగా ఈ నెల 24న ఢిల్లీలో వైసీపీ చేయబోతున్న ధర్నాకు అన్ని పార్టీలను పిలవాలని వైసీపీ నిర్ణయించుకుందని అంటున్నారు. మరి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని పిలిస్తే మిగిలిన పార్టీలు రావు.

అయినా ఏపీలో కూటమి ప్రభుత్వం మీద ఆందోళన చేస్తూ వారిని ఎలా పిలుస్తారు, పిలిచినా వారు ఎలా వస్తారు అన్నది కదా చూడాల్సింది. ఇక కూటమి పార్టీలను పక్కన పెట్టేస్తే వామపక్షాలు ఉన్నాయి. అలాగే జాతీయ స్థాయిలో తృణమూల్ కాంగ్రెస్ సరద్ పవార్ ఎన్సీపీ డీఎంకే ఎస్పీ వంటి అనేక పార్టీలు ఉన్నాయి. ఈ పార్టీలు అన్నీ కూడా ఇండియా కూటమిలో ఉన్నాయి. మరి ఈ పార్టీలను పిలిచి జగన్ ఆందోళన చేస్తే ఏపీ రాజకీయాల్లోనే కాదు దేశ రాజకీయాల్లోనూ అది సంచలనం అవుతుందని అంటున్నారు.

ఇప్పటిదాకా న్యూట్రల్ విధానం అనుసరించిన వైసీపీ ఇక మీదట ఎన్డీయేకు వ్యతిరేకంగా వెళ్తుంది అన్న చర్చ కూడా వస్తుంది. ఏపీలో చూస్తే వైసీపీ మీద జరుగుతున్న అరాచకాలను సీపీఐ ఖండించింది. ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ అయితే మిధున్ రెడ్డిని చిత్తూరులో అడ్డుకోవడం మీద ఫైర్ అయ్యారు. ఒక ఎంపీనే ఆయన సొంత నియోజకవర్గంలోకి వెళ్లనీయరా అని ప్రశ్నించారు.

ఏపీలో శాంతి భద్రతలు దిగజారుతున్నాయని హెచ్చరించారు. చంద్రబాబు సరిచేయాలని కూడా కోరారు. దాంతో కామ్రేడ్స్ వైసీపీకి అనుకూలంగా ఉన్నారా అన్న చర్చకు తెర లేస్తొంది. వారిని కలుపుకుని పోయే ఆలోచన ఏమైనా వైసీపీకి ఉందా అని కూడా ఆలోచిస్తున్నారు.

ఏపీ రాజకీయాల్లో కామ్రేడ్స్ ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్నారు. అదే సమయంలో వైసీపీతో కూడా కలసి వచ్చేందుకు అభ్యంతరాలు ఏమీ లేవు. టీడీపీ బీజేపీ జనసేన కూటమిగా ఉన్నారు కాబట్టి విపక్షం బలంగా ఉండాలీ అంటే కామ్రేడ్స్ తో కలసి వైసీపీ ఆందోళనలను చేస్తుందా అన్న చర్చ కూడా ఉంది. ఏది ఏమైనా ఈ నెల 24న జరిగే వైసీపీ ఢిల్లీ ధర్నాకు ఏ ఏ రాజకీయ పార్టీలు వస్తాయన్న దానిని బట్టే వైసీపీ వ్యూహం ఏపీలో మారే రాజకీయం తేటతెల్లంగా అర్ధం అవుతాయని అంటున్నారు.

Tags:    

Similar News