వైసీపీ వర్సెస్ టీడీపీ : ఎమ్మెల్సీ మూట...హామీల పంట...!
అటు టీడీపీ కానీ ఇటు వైసీపీ కానీ సీటు రాని వారికి ఇస్తున్న హామీ ఒక్కటే. అదే ఎమ్మెల్సీ పదవి. ఎమ్మెల్సీ ఇస్తాం, తగ్గిపోండి అని అంటున్నారు
అటు టీడీపీ కానీ ఇటు వైసీపీ కానీ సీటు రాని వారికి ఇస్తున్న హామీ ఒక్కటే. అదే ఎమ్మెల్సీ పదవి. ఎమ్మెల్సీ ఇస్తాం, తగ్గిపోండి అని అంటున్నారు. ఈసారి చూస్తే ఏపీలో హోరా హోరీ పోరు ఉండబోతోంది. అధికార వైసీపీ వైనాట్ 175 అని అంటున్నా గెలిస్తే బొటా బొటీగా సీట్లు వస్తాయని అంటున్నారు అంటే 110 దాకా సీట్లు అని.
అదే టీడీపీ కూటమికి కూడా అంతే నంబర్ తో సీట్లు రావచ్చు అని వారి సర్వేలు చెబుతున్నాయి. ఇక ఏపీలో శాసనమండలి లో ప్రతీ రెండేళ్ళకు ఎన్నికలు జరుగుతాయి. అందులో ఉన్నవి 58 సీట్లు. ఇందులో పట్టభధ్రులు ఉపాధ్యాయ సీట్లు పోతే మిగిలిన వాటికి రెండేళ్ళకు ఒకమారు ఎన్నికలు జరుగుతాయి.
ఇక ఎమ్మెల్సీలో సీట్ల కూర్పు చూస్తే ఎమ్మెల్యే కోటాలో ఇరవై మందిని ఎన్నుకుంటారు. మరో ఇరవై మందిని లోకల్ బాడీస్ ద్వారా ఎన్నుకుంటారు. అయిదు పట్టభద్రులు అయిదు ఉపాధ్యాయుల ఖాళీలను ఎన్నిక ద్వారానే తీసుకుంటారు. మరో ఎనిమిది గవర్నర్ కోటాలో నమినేట్ చేస్తారు.
ఏపీలో 2024లో వైసీపీ గెలిచినా లేక టీడీపీ గెలిచినా వెంటనే ఖాళీలు అంటే ఇపుడు రెండో మూడో ఉంటాయి. అవి జనసేనలోకి వెళ్ళిన వంశీ, అలాగే టీడీపీలోకి వెళ్ళిన సి రామచంద్రయ్య సీట్లు ఉన్నాయి. ఇవి కాకుండా చూస్తే 2025 మార్చిలో మరో నాలుగు ఖాళీలు ఉంటాయి. అంటే టోటల్ గా అరడజన్ మందినే భర్తీ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇక బొటాబొటీ మెజారిటీ వస్తే విపక్షం బలంగా ఉంటుంది. టోటల్ గా మొత్తం ఒకే పార్టీ వారికి ఎమ్మెల్సీ దక్కదు. కాబట్టి సగం సగం పంచుకోవడమే. అలా చూస్తే ఏపీలో బీజేపీకి జనసేనకు ఇచ్చిన సీట్లలో ముప్పయి కి పైగా ఆశావహులు టీడీపీకి ఉన్నారు. మరి కొన్ని చోట్ల సీట్లు ఆశించి దక్కని వారూ ఉన్నారు. వీరంతా చూస్తే యాభైకి తక్కువ లేకుండా ఉన్నారు. వైసీపీలో కూడా ఆశావహులు పెద్ద ఎత్తున ఉన్నారు.
ఇపుడు వీరందరికీ ఎమ్మెల్సీ అని చెబుతున్నా తీరా అధికారంలోకి వస్తే మొత్తం టెర్మ్ లో కనీసం పది లోపు కూడా ఏ ఒక్క పార్టీ అయినా ఇవ్వలేరు అని అంటున్నారు. కానీ బుజ్జగించేటపుడు జగన్ అయినా చంద్రబాబు అయినా కూడా ఎమ్మెల్సీ సీట్లు ఆఫర్ ఇస్తున్నారు. మరి వాటిని నమ్మి తగ్గిన వారు ఓకే అనుకోవాలి. ఇక గెలిచిన తరువాత బోడె మల్లన్న అన్న సామెత ఎటూ ఉంది.
అందుకే ఈసారి చావో రేవో అన్నట్లున్న రాజకీయంలో తాము ఇందిపెండెంట్ గా అయినా పోటీ చేస్తామని చాలా మంది నేతలు ఎమ్మెల్సీ ఆఫర్లను తిరస్కరిస్తున్నారు అని అంటున్నారు. మొత్తానికి ఎమ్మెల్సీ మూట ఎంతో ఉందని అనుకున్నా అవి చాలా పరిమితం అని లెక్కలు అయితే చెబుతున్నాయి.