పది తలల నరకాసురుడు మీద బాణం గురిపెట్టిన జగన్ !

ఇదిలా ఉంటే దీపావళి సందర్భంగా వైసీపీ ఒక ఫోటోను ట్విట్టర్ ద్వారా వదిలింది. అందులో ఒకరు కాదు ఇద్దరు కాదు అనేకమంది కనిపిస్తున్నారు.

Update: 2023-11-12 12:36 GMT

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన బాణాన్ని గురి పెట్టారు. ఏపీ రాజకీయాల్లో దుష్ట చతుష్టయం అని పేరు పెట్టి మరీ మీటింగులలో విమర్శలు చేస్తూ ఉంటారు. ఆ పేర్లు కూడా ఆయన చదువుతూ ఉంటారు. చంద్రబాబుతో పాటు టీడీపీ అనుకూల మీడియా అధినేతలను దత్తపుత్రుడు అని పవన్ కళ్యాణ్ ని కూడా జత చేరుస్తారు.


ఇదిలా ఉంటే దీపావళి సందర్భంగా వైసీపీ ఒక ఫోటోను ట్విట్టర్ ద్వారా వదిలింది. అందులో ఒకరు కాదు ఇద్దరు కాదు అనేకమంది కనిపిస్తున్నారు. నరకాసురుడికి చంద్రబాబు, పవన్, లోకేష్, నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు, దేవినేని ఉమా, అయ్యన్నపాత్రుడు, రామోజీరావు, రాధాక్రిష్ణ, బీయార్ నాయుడుల తలలను పెట్టారు.

ఇక ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ తన బాణాన్ని తెచ్చి ఆ పది తలల నరకాసురుడి మీదకు ప్రయోగిస్తున్నట్లుగా వైసీపీ డిజైన్ చేసింది. దుష్టశక్తులను ప్రజలు రానున్న ఎన్నికల్లో రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని కోరుకుంటూ దీపావళి శుభాకాంక్షలు అంటూ క్యాప్షన్ కూడా వైసీపీ పెట్టింది.

ఇదిలా ఉంటే దీపావళి కోసం ప్రత్యేకంగా వదిలిన ఈ ఫోటో క్యాప్షన్ ఇపుడు ఏపీ రాజకీయాల్లో చర్చకు వస్తోంది. ఇప్పటికే జనసేన పవన్ కళ్యాణ్ దీపావళి శుభాకాంక్షలు చెబుతూ ఆధునిక నరకాసురుడు అని పదం వాడారు. ఆయన పేరు మాత్రం చెప్పలేదు. టీడీపీ సైతం వైసీపీ మీద విమర్శలు చేస్తూనే శుభాకాంక్షలు చెబుతోంది.

ఇపుడు దాన్ని మించి అన్నట్లుగా అధికార వైసీపీ విపక్షాల తలలు మొత్తం పెట్టి అత్యాధునిక నరకాసురుడిని తయారు చేసింది. అందులో ఏపీలో వైసీపీని ఇబ్బంది పెడుతున్నారు అన్న వారి ఫోటోలను అమర్చి జగన్ బాణం వారి మీదకు వేయడం విశేషం. జగన్ వెనకాల ఎంతో మంది ప్రజలు ఉన్నట్లుగా కూడా ఫోటోలో చూపించారు.

వారి పక్షాన జగన్ పోరాడుతున్నారని ఈ ఫోటో అర్ధంగా ఉంది. గతంలో పెత్తందారులు పేదలు అంటూ ఒక పోస్టర్ ని వైసీపీ క్రియేట్ చేసి వదిలింది. అది ఫ్లెక్సీలకు కూడా ఎక్కి రాజకీయంగా కూడా వేడిని రాజేసింది. పేదలంతా జగన్ వెనకాల ఉన్నట్లుగా నాటి పోస్టర్ ఉంటే ఇపుడు ప్రజలందరి తరఫునా జగన్ పది తలల నరకాసురుడితో పోరాడుతున్నట్లుగా డిజైన్ చేశారు.

మరి దీని మీద విపక్షాలు ఏ విధంగా రియాక్ట్ అవుతాయన్నది చూడాల్సిందే. ఏది ఏమైనా పండుగ అంటే చెడు మీద మంచి సాధించే విజయం. మరి ప్రతీ రాజకీయ పార్టీ తాను మంచి అని అవతల పక్షం చెడు అని చెప్పుకుంటుంది. అసలైన నిర్ణేతలు ప్రజలే. వారి తీర్పు కూడా 2024లో వస్తుంది. అపుడు ఏమవుతుందో చూడాలి.

Tags:    

Similar News