కాంగ్రెస్ - షర్మిల మధ్య ఎం.వో.యూ.లో అంశాలివే!?

ఆ సంగతి అలా ఉంటే... కాంగ్రెస్ - షర్మిల మధ్య ఉన్న ఎం.వో.యూ లోని కొన్ని అంశాలు తెరపైకి వస్తున్నాయి

Update: 2024-01-02 06:50 GMT

గతకొన్ని రోజులుగా "కాంగ్రెస్ లోకి వైఎస్ షర్మిల".. "ఏపీ రాజకీయాల్లోకి వైఎస్ షర్మిల".. "ఏపీసీసీ చీఫ్ గా షర్మిల" వంటి శీర్షికలతో కథనాలు హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ప్రధానంగా వైఎస్సార్టీపీ విలీనం తర్వాత షర్మిలను గ్రాండ్ గా ఏపీ కాంగ్రెస్ లోకి వెల్ కం చెప్పబోతున్నారని.. ఇదే క్రమంలో వరుసగా భారీ బహిరంగ సభలు నిర్వహించబోతున్నారని కథనాలొచ్చాయి. ఆ సంగతి అలా ఉంటే... కాంగ్రెస్ - షర్మిల మధ్య ఉన్న ఎం.వో.యూ లోని కొన్ని అంశాలు తెరపైకి వస్తున్నాయి.

అవును... షర్మిల ఎంట్రీతో ఏపీ రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంచనాలు వినిపిస్తున్న నేపథ్యంలో.. తెలంగాణలో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఆచి తూచి అడుగులువేస్తున్నట్లు కనిపిస్తున్న షర్మిల... కాంగ్రెస్ లో తన పార్టీ విలీనం, పార్టీ ఇవ్వబోయే బాధ్యతలు, పదవులు, హామీల విషయంలో పలు షరతులు పెట్టినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో కాంగ్రెస్ నుంచి కూడా ఆమెకు కొన్ని కండిషన్స్ వచ్చాయని అంటున్నారు.

ఇందులో ప్రధానంగా... తెలంగాణ లేదా కర్ణాటక నుంచి రాజ్యసభకు నామినేట్ చేయడం అనేది షర్మిల నుంచి ప్రధానంగా వినిపించిన కండిషన్ కాగా.. అలా నామినేట్ చేసిన అనంతరమే వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసే దిశగా అడుగులువేస్తున్నట్లు తెలుస్తుంది. మరోపక్క రాజ్యసభకు నామినేట్ అయిన అనంతరం ఏపీసీసీ పగ్గాలు అందుకోవాలని, ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్తి బాధ్యతను తీసుకోవాలని కాంగ్రెస్ నుంచి కండిషన్ వచ్చిందని తెలుస్తుంది!

ఇందులో భాగంగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కడప ఎంపీ స్థానం నుంచి వైఎస్ షర్మిళ బరిలోకి దిగబోతున్నారనే కామెంట్లు వినిపిస్తున్న నేపథ్యంలో... ఏపీసీసీ బాధ్యతలు స్వీకరించిన తర్వాతే ఆ దిశగా ఆలోచన చేసే అవకాశాలున్నాయని అంటున్నారు. ఈ సమయంలో ఢిల్లీ ఢిల్లీలో బ్రదర్ అనీల్ తో కాంగ్రెస్ పెద్దలు జరిపిన చర్చల్లో మూడు అంశాలు ప్రతిపాదించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం వాటిచుట్టూ షర్మిల & కో ఆలోచిస్తున్నారని అంటున్నారు.

ఇందులో ప్రధానంగా... షర్మిలను రాజ్యసభకు నామినేట్ చేసి అనంతరం వైఎస్సార్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం.. అనంతరం ఏపీ బాధ్యతలు తీసుకోవడం కాగా.. రెండవది.. ఏపీలో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టి ఈసారికి కడప ఎంపీ సీటు నుంచి బరిలోకి దిగడం అయితే... ఇక మూడొవదిగా... కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవితోపాటు ఏపీసీసీ పగ్గాలు ఇచ్చి రాజ్యసభకు ఎంపీగా పంపడాన్ని ప్రతిపాదించినట్లు తెలుస్తుంది.

ఇదే సమయంలో తాను ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరిస్తే... అభ్యర్థుల ఎంపికలో తనమాటకు విలువ ఇవ్వాలని.. వైఎస్సార్ హయాంలో జరిగినట్లుగా అభ్యర్థుల ఎంపికలో తన జాబితాను అధిష్టాణం పరిగణలోకి తీసుకోవాలని కండిషన్ పెట్టినట్లు చెబుతున్నారు!

కాగా... వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకుంటే ఆమెవెంట నడవడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి బహిరంగ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. దీంతో... షర్మిల అధికారిక ఎంట్రీ కన్ ఫాం అయిపోతే ఇలాంటి ప్రకటనలు మరిన్ని రావొచ్చనేది కాంగ్రెస్ పార్టీ నమ్మకంగా చెబుతున్నారు!

Tags:    

Similar News