జగన్ ఎవరో తెలియదు...!?

జగన్ అంటే తెలియని వారు ఉన్నారా. ఆయనది ఏపీలో పదిహేనేళ్ళ రాజకీయ జీవితం.

Update: 2024-04-03 04:07 GMT

జగన్ అంటే తెలియని వారు ఉన్నారా. ఆయనది ఏపీలో పదిహేనేళ్ళ రాజకీయ జీవితం. రెండు సార్లు ఎంపీగా రెండు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ప్రతిపక్ష నేతగా ప్రస్తుతం ముఖ్యమంత్రిగా. ఇదీ వైఎస్ జగన్ రాజకీయ ప్రస్థానం.

ఇక ఆయన విజయాలతో పాటు ప్రత్యర్ధులను కూడా ఎక్కువగా చేసుకుని కూడా రాజకీయంగా అందరి నోళ్ళలో అను నిత్యం నానుతూ ఉంటారు. అటువంటి జగన్ ఎవరో నాకు తెలియదు అంటున్నారు ఆమె. ఆమె ఎవరో కాదు జగన్ కి స్వయానా చెల్లెలు. ఆయన రక్తం పంచుకుని పుట్టిన సోదరి.

ఆమె కూడా మామూలు మనిషి కాదు. ఏపీ కాంగ్రెస్ కి అధ్యక్షురాలు. మరి రాజకీయాల్లో ఉంటూ జగన్ ఎవరో తెలియదు అంటే ఎట్లా కుదురుతుంది అంటే. అదే అసలైన సెటైర్ అన్న మాట. నాకు నా అన్న జగన్ తెలుసు. ఈ సీఎం జగన్ ఎవరో తెలియదు. ఇది మరో రకం సెటైర్. సెటైర్లకే పీక్స్ అన్నమాట.

నాకు ఈ జగన్ తో అంటే సీఎం జగన్ తో అసలు పరిచయమే లేదు అని స్టేట్మెంట్ ఇచ్చారు షర్మిల. ఆమె కడప నుంచి కాంగ్రెస్ తరఫున ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ జగన్ మీద విమర్శలు ఎక్కుపెట్టారు. సీఎం కాక ముందు ఎంతో బాగున్న జగన్ సీఎం అయిన మరు క్షణం నుంచే బాగా మారిపోయారు అని షర్మిల అంటున్నారు.

ఆమె ఈ మాట గతంలోనూ అన్నారు. ఇపుడు మరో సారి అంటున్నారు. ఆయన ఏమి మారారు ఎలా మారారు అన్నది మాత్రం ఆమె చెప్పలేదు. కానీ ఆ జగన్ ఈ జగన్ ఒక్కటి కాదు అని అంటున్నారు. మరి జగన్ లో అంత మార్పు ఎలా వచ్చింది అన్నది ప్రశ్న.

అది అధికారం తెచ్చిన మార్పా లేక ఎవరైనా ఆయన వెనకన ఉండి ప్రభావితం చేస్తూ తెచ్చిన మార్పా అన్నది ఆమె అయితే చెప్పలేదు. ఎవరి ఊహలకు వారికే జవాబు చెప్పుకోవాలి. విశ్లేషించుకోవాలి. జగన్ విషయంలో షర్మిల అయితే బాగా కోపంగా ఉన్నారు.

ఆయన సీఎం గా దిగిపోవాలని బలంగా కోరుకుంటున్నారు. తాను కడపలో పోటీ చేయడం అంటే వైఎస్సార్ కుటుంబాన్ని నిలువునా చీల్చేయడమే అని ఆమె అన్నారు. ఇది కఠినమైన నిర్ణయం. కానీ తీసుకో తప్పింది కాదు అని ఆమె అంటున్నారు. దానికి కారణం మారిన తన అన్న వైఖరి అని ఆమె ఆరోపిస్తున్నారు.

మొత్తానికి చూస్తే అన్నా చెల్లెలు సొంత గడ్డ మీద తలపడుతున్నారు. ఈ రకమైన సన్నివేశం చూస్తారని ఎవరూ అయిదేళ్ల క్రితం అనుకోలేదు. బై బై బాబూ అని నాడు ఏపీ మొత్తాన్ని హోరెత్తించిన షర్మిల ఇపుడు బై బై జగన్ అంటున్నారు. ఇంతలో ఎంత మార్పు అని ఎవరైనా బుగ్గలు నొక్కుకోవచ్చు. కానీ రాజకీయం అంటే ఇదే.

ఇక్కడ ఎవరు ఏమిటి అన్నది ఉండదు, రాజకీయం అలా చేస్తుంది. చేయిస్తుంది. అదే ఇపుడు జరుగుతోంది. ఇక జగన్ ని ఓడించాలన్న షర్మిల పంతం ఆమెకు ఎంత వరకూ ఉపయోగపడుతుందో ఆమె వల్ల ఎవరికి ఉపయోగపడుతుందో అసలు ఆమె లక్ష్యం నెరవేర్తుందా లేదా ఇవన్నీ ప్రశ్నలు. జవాబుల కోసం జూన్ 4 వరకూ వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News