వివేకా కోసం ఎందుకు ధర్నా చేయలేదు... జగన్ కు షర్మిళ సూటి ప్రశ్న!
ఇదే సమయంలో ఢిల్లీలో ధర్నా చేస్తానని చెబుతున్న జగన్... ప్రత్యేక హోదా కోసం ధర్నాలు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హత్యారాజకీయాలు పెరిగిపోతున్నాయని.. అల్లరి మూకలు పెట్రేగిపోతున్నాయంటూ వైసీపీ అధినేత జగన్ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇక వినుకోండలో రషీద్ అనే వైసీపీ కార్యకర్త దారుణ హత్య అనంతరం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 24న ఢిల్లీలో ధర్నాకు పిలుపునిచ్చారు జగన్. ఈ సమయంలో వైఎస్ షర్మిళ రియాక్ట్ అయ్యారు.
అవును... ఏపీలో హత్యారాజకీయాలు పెరిగిపోతున్నాయంటూ ఫైరవుతున్న వైఎస్ జగన్... ఢిల్లీలో ధర్నా చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో.. వైఎస్ షర్మిళ ఎంట్రీ ఇచ్చారు. ఇందులో భాగంగా... సొంత చెల్లెళ్లకు ఆయన వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. ఇదే సమయంలో.. ఐదుకోట్ల మంది ఆంధ్రరాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడుస్తూ.. బీజేపీకి ప్రత్యేకహోదాను తాకట్టు పెట్టారని అన్నారు!
ఇదే సమయంలో ఢిల్లీలో ధర్నా చేస్తానని చెబుతున్న జగన్... ప్రత్యేక హోదా కోసం ధర్నాలు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఐదేళ్లు అధికారంలో ఉండి ప్రత్యేక హోదాను పూర్తిగా విస్మరించారని.. పోలవారన్నీ ఏనాడూ పట్టించుకోలేదని.. ఆఖరికి కడప స్టీల్ ప్లాం ను కూడా పట్టించుకోలేదని.. రాజధాని అంటే మూడు రాజధానులు అంటూ కన్ ఫ్యూజ్ చేశారని షర్మిల ఫైర్ అయ్యారు.
ఇక మన రాష్ట్రానికే తలమానికం అయిన విశాఖ స్టీల్ ని అమ్మేస్తామన్నా కూడా పట్టించుకోలేదని షర్మిల విమర్శించారు. ఈ రోజు మాత్రం మీ కార్యకర్తను చంపేశారని ఢిల్లీకి వెళ్లి ధర్నా చేస్తానంటున్నారు.. మరి మీ సొంత చిన్నాన్నను చంపేసినప్పుడు ఢిల్లీ వెళ్లి ఎందుకు ధర్నా చేయలేదు అని షర్మిల ప్రశ్నించారు. దీనికి జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా... ప్రస్తుతం ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాపుడు వాటికి హాజరయ్యే ధైర్యం మీకు లేక, ఇలా సాకులు వెతుక్కుని ఢిల్లీ వెళ్తామంటున్నారని ఎద్దేవా చేశారు! ఇప్పుడు అసెంబ్లీలో ఏ బిల్లు ప్రవేశపెట్టినా, అది ప్రజలకు వ్యతిరేకమైనా ఆ బిల్లు పాసయిపోవాల్సిందేనా.. దానిపై చర్చ అవసరం లేదా అని షర్మిళ ప్రశ్నించారు. అసలు జగన్ ఏమి ఆలోచిస్తున్నారని ఆమె నిలదీశారు.
ఇక వినుకోండలో జరిగింది పొలిటికల్ మర్డర్ కాదు.. వ్యక్తిగత హత్య అని.. మొన్నటి వరకూ నిందితుడు, మృతుడూ ఇద్దరూ వైసీపీతోనే ఉన్నారని.. అలాంటప్పుడు ఇది రాజకీయ హత్య ఎలా అవుతుందని షర్మిళ ప్రశ్నించారు. ఈ వ్యవహారాన్ని అడ్డుపెట్టుకుని మనుగడ కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్నారా అని అడిగారు!
ఒకపక్క ఏపీలో వరదలు వస్తుంటే... అక్కడకు వెళ్లి బాధితులను పరామర్శించాలని మీకు లేదు కానీ... వ్యక్తిగత కక్షలతో ఇద్దరు కొట్టుకుని చచ్చిపోతే మాత్రం ఢిల్లీకి వెళ్లి ధర్నా చేస్తారా.. ప్రజల కోసం మీరు ఎందుకు ఆలోచించరు అని షర్మిళ నిలదీశారు.