సీఎం కాదు...పోటీ చేసే సీటు ఎక్కడ చెల్లెమ్మా...!?

సొంత నియోజకవర్గం పులివెందులలో కాంగ్రెస్ నుంచి ఆమె పోటీ చేసి అన్న, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని ఢీ కొడతారా అన్నది కూడా టాక్ నడుస్తోంది.

Update: 2024-03-17 08:50 GMT

సీఎం పదవిలో షర్మిలను కూర్చోబెట్టేవరకూ అండగా ఉంటాను అని తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విశాఖ సభలో ప్రకటించారు. ఆయన ప్రకటనతో షర్మిల మొహంలో ఆనందం కనిపించింది. కానీ సీఎం పదవి అంత సులువుగా వస్తుందా అన్నదే చర్చ. ఆ పదవి కోసం షర్మిల సోదరుడు జగన్ పదేళ్ల పాటు నానా రకాలైన కష్టాలు పడ్డారు.

ప్రజలకు చేరువ కావడానికి ఆయన ఎన్నో రకాలైన కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన ఎన్నికలలో పోటీ చేసి రెండు సార్లు ఎంపీగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక వైఎస్సార్ అయితే మూడు దశాబ్దాల పాటు వేచి చూస్తే తప్ప సీఎం పదవి ఆయనకు దక్కలేదు. దాని కోసం ఆయన మండుటెండలో చేవెళ్ళ నుంచి ఇచ్చాపురం దాకా భారీ పాదయాత్రను నిర్వహించారు.

ఇదిలా ఉంటే వైఎస్ షర్మిల రాజకీయంగా ఇంకా నిరూపించుకోవాల్సి ఉంది అని అంటున్నారు. ఆమె తెలంగాణాలో పార్టీ పెట్టారు. అది మూడేళ్ల లోపే కాంగ్రెస్ లో విలీనం చేశారు. తెలంగాణాలో 2023లో జరిగిన ఎన్నికల్లో ఆమె పోటీ చేయలేదు. ఆమె ఇపుడు ఏపీసీసీ ప్రెసిడెంట్ అయ్యారు. మే 13న ఏపీలో ఎన్నికలు ఉన్నాయి.

షర్మిల ఎంపీగా పోటీ చేస్తారా లేక ఎమ్మెల్యేగా చేస్తారా అన్నది ఇంతవరకూ తెలియలేదు. ఆమె ఓటు హైదరాబాద్ లో ఉంది అని అంటున్నారు. ఆమె పోటీ చేయాలంటే ఓటు మార్పించుకోవాలా అన్నది కూడా చర్చగా ఉంది. ఇక ఆమె పోటీ చేస్తే ఏ సీటులో అన్నది మరో చర్చగా ఉంది.

సొంత నియోజకవర్గం పులివెందులలో కాంగ్రెస్ నుంచి ఆమె పోటీ చేసి అన్న, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని ఢీ కొడతారా అన్నది కూడా టాక్ నడుస్తోంది. అలా కాదు అనుకుంటే కడప ఎంపీ సీటుకు పోటీ పడతారా అన్నది మరో ప్రశ్నగా ఉంది. అక్కడ సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డిని ఓడించాలీ అంటే షర్మిల అయినా సునీత అయినా పోటీలో ఉండాల్సి ఉంది.

ఏపీలో కాంగ్రెస్ తీరు చూస్తే నోటా కంటే ఓట్లు తక్కువగా ఆ పార్టీకి వచ్చాయి. ఈసారి ఏమైనా పెరుగుతాయా అన్నది చూడాలి తప్ప సీట్లు ఎన్ని గెలుస్తుంది అన్నది లెక్క వేయకూడదు అనే వారూ ఉన్నారు. రేవంత్ రెడ్డి తన స్పీచ్ లో పాతిక ఎమ్మెల్యే సీట్లు ఇస్తే చాలు అన్నట్లుగా మాట్లాడారు.

అంటే ఏపీలో కాంగ్రెస్ కి అధికారం మీద ఆశ లేదు తమకు ఆ సీన్ లేదని చెప్పేశారా అన్న చర్చ సాగుతోంది. మరి అధికారం కావాలని మొత్తం 175 సీట్లకు పోటీ చేస్తే జనాలు కనీసం ఈ వైపు అయినా చూస్తారు తప్ప పాతిక సీట్లకు కాంగ్రెస్ పెద్దలే తగ్గిపోతే జనాలు ఎలా ఆలోచిస్తారు అన్నది కూడా చర్చగానే ఉంది.

ఇక సీఎం షర్మిల అని రేవంత్ రెడ్డి అంటున్నారు. పాతిక సీట్లు వస్తే ఆమె ఎలా సీఎం అవుతుందని ప్రత్యర్ధులు అంటున్నారు. ఇంతకీ షర్మిల ఈ ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అన్నదే అతి పెద్ద ప్రశ్న. పోటీ చేస్తే కచ్చితంగా గెలవాలి. అది ఆమె రాజకీయ జీవితానికి పెద్ద సవాల్ అని అంటున్నారు.

మొత్తం 175 సీట్లలో షర్మిల అయినా గెలిస్తేనే కాంగ్రెస్ కి ఆ ఊపు ఉంటుంది. లేకపోతే వైఎస్సార్ వారసురాలు వచ్చినా కాంగ్రెస్ లేవలేదు బతికి బట్టకట్టలేదు అన్న విమర్శలు వస్తాయి. అంతే కాదు ఆమె పీసీసీ చీఫ్ పదవికి కూడా అవి ముప్పుగా మారుతాయని అంటున్నారు. ఏది ఏమైనా మంచి ఎమ్మెల్యే సీటు చూసుకుని పోటీ చేయాలి చెల్లెమ్మ అని సూచనలు వస్తున్నాయి.

Tags:    

Similar News