బాబూ మరీ ఇంత దుర్మార్గమా... ప్రమాణానికి వైవీ సవాల్
తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల లడ్డూ ప్రసాదం మీద చేసిన హాట్ కామెంట్స్ ఏపీలో డిస్కషన్ గా మారాయి.
తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల లడ్డూ ప్రసాదం మీద చేసిన హాట్ కామెంట్స్ ఏపీలో డిస్కషన్ గా మారాయి. తిరుమల తిరుపతి దేవస్థానం కి రెండు పర్యాయాలు మొత్తం నాలుగేళ్ల పాటు చైర్మన్ గా ఉన్న ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి అయితే బాబూ మరీ ఇంత దుర్మార్గమా అని ఖండించారు.
చంద్రబాబు నాయుడు తన రాజకీయం కోసం ఎంతటి నీచానికి అయినా దిగజారడానికి వెనుదీయరని అర్ధం అయిందని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. తిరుమల ప్రసాదం మీద బాబు చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గమని ఆయన మండిపడ్డారు.
కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బ తీసి చంద్రబాబు అతి పెద్ద పాపమే చేశారని కూడా వైవీ సుబ్బారెడ్డి అన్నారు. బాబుకు రాజకీయ లబ్ది మాత్రమే కావాలని కూడా ఆయన ఫైర్ అయ్యారు. ఈ విషయంలో ఆ దేవదేవుడి సాక్షిగా కుటుంబంతో కలసి ప్రమాణం చేయడానికి తాను సిద్ధమని కూడా వైవీ సుబ్బారెడ్డి సవాల్ చేశారు. దానికి చంద్రబాబు సిద్ధమా అని ఆయన ప్రశ్నించారు.
మనిషి పుట్టుక పుట్టిన వారు ఎవరూ ఇలాంటి మాటలు మాట్లాడరు అని కూడా అన్నారు. తాను భక్తుల విశ్వాసాన్ని బలపరచేందుకు తిరుమలలో ప్రమాణానికి వస్తాను అని ఆ ధైర్యం బాబుకు ఉందా అని ఆయన నిగ్గదీశారు.
చంద్రబాబు ఈ విషయంలో ప్రమాణం చేయడానికి తన సవాల్ స్వీకరించాలని వైవీ అంటున్నారు. ఇదిలా ఉంటే రాజకీయాల్లోకి శ్రీవారికి తేవడం పట్ల కూడా చర్చ సాగుతోంది. శ్రీవారి విషయంలో కోట్లాది భక్తుల మనోభావాలు ముడిపడి ఉన్నాయి. దాంతో ఆధ్యాత్మిక పరులు కూడా ఈ వివాదం మీద ఇపుడు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏమి జరుగుతుందో చూడాల్సి ఉంది.