జగన్ రాజీనామా : వైవీ సుబ్బారెడ్డి షాకింగ్ కామెంట్స్ !

ఇదే తీరుగా స్తబ్దతగా వ్యవహరిస్తే రానున్న కాలంలో ఇబ్బందులు తప్పవని అంటున్నారు.

Update: 2024-07-10 10:32 GMT

ఏపీలో గత కొన్ని రోజులుగా ఒక రకమైన ప్రచారం సాగుతోంది. మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ పులివెందుల ఎమ్మెల్యే సీటుకు రాజీనామా చేస్తారని కడప ఎంపీ సీటుకు ఉప ఎన్నికలు పెట్టించి పోటీ చేస్తారు అని వార్తలు పుంఖానుపుంఖాలుగా వస్తున్నాయి. దీని మీద తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి కూడా కడపకు ఉప ఎన్నికలు వస్తే తాను ప్రతీ గడపకు తిరుగుతానని ఊరూరా తిరిగి కాంగ్రెస్ ని గెలిపిస్తాను అని కూడా ఏపీలో జరిగిన వైఎస్సార్ జయంతి సభలో ప్రకటించారు.

దాంతో మరింతగా ఈ అంశం జనంలోకి వెళ్లిపోయింది. ఇంకో వైపు వైసీపీ నుంచి సరైన ఖండన కానీ వివరణ కానీ రాకపోవడంతో ఈ ఇష్యూ సోషల్ మీడియాను తెగ ఊపేస్తోంది. దానికి తోడు అన్నట్లుగా జగన్ పార్టీ కేవలం 11 ఎమ్మెల్యే సీట్లే గెలవడం స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు ఎంపిక అయిన కార్యక్రమానికి జగన్ ఆయన ఎమ్మెల్యేలు గైర్ హాజర్ కావడంతో ఇక జగన్ అసెంబ్లీకి గుడ్ బై చెబుతారు అని కూడా ప్రచారం ఉవ్వెత్తిన సాగింది.

ఈ పరిణామాలు అన్నీ చూసిన వారు జగన్ ఇక అసెంబ్లీకి వెళ్లరని ఆయన రాజీనామా చేస్తారు అని కూడా అనుకునేలా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారం ఒక రేంజిలో సాగుతూ జనాలు సైతం నమ్మేలా ఉండడంతో వైసీపీ చివరికి రంగంలోకి దిగి ఖండించాల్సి వచ్చింది.

ముందుగా కడప జిల్లా వైసీపీ ప్రెసిడెంట్ సురేష్ బాబు అయితే ఇది తప్పు ప్రచారం అని అన్నారు. ఎల్లో మీడియాలో వస్తున్న రాతలను పట్టుకుని విష ప్రచారం చేస్తున్నారు అని అన్నారు. ఇక వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి కూడా ఈ అంశం మీద ఖండించారు.

ఆయన జగన్ ఎందుకు రాజీనామా చేస్తారు అని ప్రశ్నించారు. అటువంటి పరిస్థితి ఎందుకు వస్తుందని కూడా ఆయన అంటున్నారు. జగన్ పులివెందులకు రాజీనామా చేసేది లేదని అలాగే కడప ఎంపీ సీటుకు అవినాష్ రెడ్డితో రాజీనామా చేయించి తాను పోటీ చేస్తారు అన్నది కూడా ఉత్తిదే అని కూడా స్పష్టం చేశారు. అలాంటి పరిస్థితి ఉత్పన్నం కానే కాదని అన్నారు.

ఇవన్నీ టీడీపీ చేస్తున్న దుష్ప్రచారంగా కొట్టి పారేశారు. అయితే ఈ రకంగా ప్రచారం గత వారం రోజులుగా సాగుతున్నా వైసీపీ మౌనంగా ఉండడమే కొంప ముంచింది అని అంటున్నారు. వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి రాజకీయ జీవితం గురించి ఆయన ఫ్యూచర్ గురించి ఎలాంటి ఆధారాలు లేకుండా పెద్ద ఎత్తున ప్రచారం సోషల్ మీడియాలో సాగుతున్నా వైసీపీ పట్టనట్లుగా మౌనంగా ఉండటం వల్లనే డ్యామేజ్ జరిగింది అని అంటున్నారు.

ఇపుడు చూస్తే ఇంతా అయ్యాక ఖండించినట్లుగా ఉందని అంటున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నపుడు కూడా ప్రభుత్వం మీద వచ్చే విమర్శలను గట్టిగా ఖండించ లేకపోయింది. దాని వల్ల వచ్చే చేదు ఫలితాన్ని ఆ పార్టీ ఎన్నికలో ఘోరమైన ఓటమి రూపంలో అనుభవించింది. ఇపుడు చూస్తే విపక్షంలో ఉంటున్నా అధికార పక్షం టార్గెట్ చేసినా లేక ఆ పార్టీ అభిమానులు విమర్శలు చేసినా ఎప్పటికప్పుడు స్పష్టమైన ప్రకటన చేస్తూ విష ప్రచారాన్ని మొగ్గలోనే తుంచే విధంగా ఒక మెకానిజాన్ని పార్టీ తయారు చేసుకోలేకపోయింది అని అంటున్నారు. ఇదే తీరుగా స్తబ్దతగా వ్యవహరిస్తే రానున్న కాలంలో ఇబ్బందులు తప్పవని అంటున్నారు.

Tags:    

Similar News