రోజులో దిగ్గజ మీడియా సంస్థ షేరు అంతలా ఢమాల్ ఎందుకు?
ఒక్క ప్రకటనతో దిగ్గజ మీడియా సంస్థగా పేరున్న జీ సంస్థకు భారీ నష్టాన్ని కట్టబెట్టింది
ఒక్క ప్రకటనతో దిగ్గజ మీడియా సంస్థగా పేరున్న జీ సంస్థకు భారీ నష్టాన్ని కట్టబెట్టింది. అంతేకాదు.. జీ కంపెనీ భవిష్యత్తు మీదా కొత్త సందేహాలు వ్యక్తమయ్యేలా చేసింది. దిగ్గజ మీడియా సంస్థ జీ ఎంటర్ టైన్ మెంట్ ఎంటర్ ప్రైజస్ షేరు మంగళవారం కుప్పకూలింది. ఒక్కరోజులో షేరు విలువ ఏకంగా 30 శాతం పతనం కావటం గమనార్హం. దీంతో.. 52 వారాల కనిష్ఠ విలువకు షేరు ధర పడిపోయింది. ఎందుకిలా జరిగింది? అంటే.. మరో దిగ్గజ సంస్థ అయిన సోనీ పిక్చర్స్ నెట్ వర్క్స్ తో చేసుకున్న అతి పెద్ద డీల్ ను రద్దు చేసుకున్నట్లుగా సదరు సంస్థ పేర్కొనటంతో ఇలాంటి పరిస్థితి నెలకొంది.
సుమారు రూ.83 వేల కోట్లకు సంబంధించిన డీల్ ను సోనీ సంస్థ రద్దు చేసుకున్నట్లుగా ప్రకటించటంతో ఇన్వెస్టర్లలో ఒక్కసారిగా భయాందోళనలు కమ్ముకున్నాయి. జీ సంస్థ ఫ్యూచర్ మీద నీలి నీడలు కమ్ముకున్న వేళ.. దాని ప్రభావం షేరు ధర మీద పడింది. జనవరి 20న (21 ఆదివారం, 22న అయోధ్య రామ విగ్రహా ప్రాణప్రతిష్ఠ సందర్భంగా మార్కెట్లకు సెలవు) జరిగిన సెషన్ లో ఈ స్టాక్ ధర రూ.231.40 ఉండగా.. మంగళవారం 10 శాతం నష్టంతో మొదలైన ఈ స్టాక్.. కాసేపటికే దారుణంగా పడిపోయింది. పది నుంచి పదిహేను శాతం.. చూస్తుండగానే 20 శాతానికి పడిపోయిన షేరు ధర 25 శాతానికి వెళ్లి.. చివరకు 30 శాతం పతనంతో రూ.162.25 వద్ద జీవనకాల కనిష్ఠానికి చేరుకుంది.
చివరకు 34 శాతం నష్టంతో రూ.155.95 వద్ద మంగళవారం మార్కెట్ క్లోజ్ అయ్యింది. ఒక్కరోజులోనే షేరు ధర 30 శాతం పతనం కావటంతో కంపెనీ విలువ భారీగా నష్టపోయింది. అంతకు ముగింపు సమయానికి రూ.22,260 కోట్ల వద్ద ఉన్న ఎం క్యాప్ మంగళవారం క్లోజింగ్ సమయానికి దగ్గర దగ్గర రూ.15వేల కోట్లకు తగ్గినట్లుగా చెబుతున్నారు. దాదాపు రూ.7వేల కోట్లకు పైగా మార్కెట్ క్యాప్ ను కోల్పోయినట్లుగా మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. జీ సంస్థతో డీల్ రద్దు చేసుకున్న సోనీ సంస్థ.. విలీన ఒప్పంద నిబంధన ఉల్లంఘన కింద బ్రేక్ అప్ రుసుముల కింద రూ.750 కోట్లు చెల్లించాలని నోటీసులు జారీ చేసింది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. పలు బ్రోకరేజ్ సంస్థలు సైతం జీ స్టాక్ కు రేటింగ్ మార్చాయి.
జీ షేరు మరో 20 శాతం తగ్గుతుందని యూబీఎస్ సెక్యూరిటీస్ అంచనా వేయగా.. అంతకు ముందు కొనాలన్న ట్యాగ్ ఇచ్చిన సీఎల్ఎస్ఏ తర్వాత అమ్మేయాలన్న రేటింగ్ ఇచ్చింది. సిఐటీఐ కూడా షేరును అమ్మేయాలన్న రేటింగ్ ఇచ్చింది. మోతీలాల్ ఓస్వాల్ మాత్రం కొనాలన్న ట్యాగ్ నుంచి న్యూట్రల్ ట్యాగ్ ను చేర్చింది. ఇదిలా ఉంటే.. మంగళవారం పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు మార్కెట్ పతనానికి కారణమైంది. దీంతో.. దలాల్ స్ట్రీట్ లో మంగళవారం అమ్మకాల మోత మోగింది.
అధిక వెయిటేజీ షేర్లుగా పేర్కొనే హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ షేరు మంగళవారం సైతం 3 శాతం నష్టానికి గురైతే.. రిలయన్స్ ఇండస్ట్రీ 2 శాతం.. ఎస్ బీఐ 4 శాతం షేర్ల పతనం సాగింది. మంగళవారం ట్రేడింగ్ ను చూస్తే.. మొత్తంగా సెన్సెక్స్ 1053 పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ 330పాయింట్లు పతనమైంది. జనవరి 17 తర్వాత సూచీలకు ఇది భారీ ఫతనంగా చెప్పొచ్చు.ఫార్మా రంగ షేర్లు మినహా ప్రధాన రంగాలకు చెందిన షేర్లు నేల చూపులు చూశాయి.
గడిచిన కొద్ది రోజులుగా కిందకే తప్పించి పైకి చూడని హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు షేరు పతనం ఆగటం లేదు. డిసెంబరు క్వార్టర్ ఆర్థిక ఫలితాలు నిరాశపర్చటంతో ఈ ప్రైవేటు రంగ బ్యాంకు షేరు వరుసగా ఐదో రోజు క్షీణించింది. మంగళవారం 3.5 శాతం పతనమైంది. దీంతో రూ.1425 ఏడాది కనిష్ఠాన్ని నమోదు చేసింది. మొత్తంగా ఐదు రోజుల వ్యవధిలో ఈ షేరు దర 13 శాతానికి క్షీణించటం గమనార్హం.