ఎట్టకేలకు కేజ్రీకి బెయిల్.. కానీ ఇంకా జైల్లోనే.. మరి కవితకో?
మద్యం కుంభకోణం కేసులో ఏప్రిల్ 9న ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
దాదాపు రెండేళ్లు నడిచిన లిక్కర్ స్కాం కేసులో.. 9 సార్లు ఈడీ సమన్లు జారీ అయినా జవాబివ్వని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను మార్చి 21న ఈడీ అరెస్టు చేసింది. ఆ తర్వాత మే 11 వరకు ఆయన తిహాడ్ జైల్లో ఉన్నారు. 50 రోజుల అనంతరం లోక్ సభ ఎన్నికల ప్రచారం కోసం సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. గడువు ముగియడంతో జూన్ 2న కేజ్రీవాల్ తిరిగి లొంగిపోయారు. మరోవైపు జూన్ 20న రౌస్ అవెన్యూ కోర్టు సాధారణ బెయిల్ ఇచ్చింది. మరుసటి రోజు విడుదల కావాల్సి ఉండగా.. ఈడీ ఢిల్లీ హైకోర్టుకు వెళ్లింది. దీంతో బెయిల్ ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేసింది. జూన్ 25న బెయిల్‌పై స్టే ఇచ్చింది. అయితే, మద్యం స్కాంపై సీబీఐ కేసులోనూ కేజ్రీవాల్ అరెస్టయ్యారు. గత నెల 27 నుంచి సీబీఐ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.
బెయిలొచ్చింది..
మద్యం కుంభకోణం కేసులో ఏప్రిల్ 9న ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై ఈడీ, కేజ్రీ వాదనలు విన్న ద్విసభ్య ధర్మాసనం మే 17న తీర్పు రిజర్వ్ చేసింది. తాజాగా మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఈ కేసులో తన అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీ దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. కాగా, బెయిల్ లభించినా సీబీఐ కేసులో అరెస్టయినందున కేజ్రీ తిహాడ్ జైల్లోనే ఉండనున్నారు. వాస్తవానికి జూన్ 25న బెయిల్ వచ్చినప్పుడే బయటకు రావాల్సిన కేజ్రీ.. ఢిల్లీ హై కోర్టు తీర్పుతో ఆగిపోయారు. ఈడీ కేసులో కేజ్రీకి బెయిల్ వచ్చే సూచనలుఉన్నందునే సీబీఐ ఆయనను అరెస్టు చేసిందనే ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు అదే జరిగింది.
సీఎం బాధ్యతలపై ఆదేశాలివ్వట్లేదు..
కేజ్రీకి మధ్యంతర బెయిల్ మంజూరు సందర్భంగా సుప్రీం కోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. సీఎం బాధ్యతల నుంచి వైదొలిగే విషయంలో ఎలాంటి ఆదేశాలు ఇవ్వట్లేదని తెలిపింది. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధిగా ఆయన సీఎంగా ఉన్నారని.. అరెస్టు అయినందున.. పదవి నుంచి దిగిపోవాలా లేదా అన్నది ఆయన ఇష్టమని పేర్కొంది.
కవితకు బెయిలెప్పుడో?
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత కూడా అరెస్టయి తిహాడ్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. సీబీఐ దాఖలు చేసిన ఛార్జి షీట్ ను పరిగణనలోకి తీసుకునేందుకు, కవిత దాఖలు చేసిన డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ పై శుక్రవారం రౌస్ ఎవెన్యూ కోర్టు విచారణ చేపట్టనుంది. గత విచారణలో చార్జి షీట్ ను పరిగణనలోకి తీసుకోవాలో లేదో అన్నదానిపై గురువారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని జడ్జి కోరారు. సీబీఐ కేసులో డిఫాల్ట్ బెయిల్ కోరుతూ కవిత న్యాయవాది కోర్టుకు తన వాదనలు వినిపించారు. దీనిపై శుక్రవారం విచారణ జరగనుంది.