కవితకు బెయిల్ ఈసారి ఖాయంగా వస్తుందట

‘ఈడీ అయితే ఏమవుతుంది? చూసుకుంటాం. సిస్టం ప్రకారం వెళతాం.

Update: 2024-08-27 04:03 GMT

‘ఈడీ అయితే ఏమవుతుంది? చూసుకుంటాం. సిస్టం ప్రకారం వెళతాం. ఈడీకి మా నాన్న అంటేనే భయం’ ఇలా చాలానే మాటలు చెప్పిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టు కావటం.. తీహార్ జైల్లో నెలల తరబడి ఉండటం.. బెయిల్ కోసం ఆమె జరిపిన పోరు అంతా ఇంతా కాదు. ఈ రోజు (మంగళవారం, ఆగస్టు 27) సుప్రీంకోర్టులో ఆమె బెయిల్ మీద విచారణ జరగనుంది. జస్టిస్ బీఆర్ గవాయ్.. జస్టిస్ కేవీ విశ్వనాథన్ లతో కూడిన ధర్మాసనం విచారణ జరపనుంది. దీంతో.. ఈసారైనా ఆమెకు బెయిల్ లభిస్తుందా? అన్నది ప్రశ్నగా మారింది.

విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈసారి ఖాయంగా బెయిల్ లభిస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. బెయిల్ అంశం మీద కేసీఆర్ కుటుంబ సభ్యులు సైతం ఆశావాహ ధోరణిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వాదనకు బలం చేకూరేలా మాజీ మంత్రి కం కవిత సోదరుడు కేటీఆర్ తో పాటు.. మేన బావ హరీశ్ రావు మాత్రమే కాదు.. పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లటం చూస్తే.. ఈసారి బెయిల్ పక్కా అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

దీనికి తోడు.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు సైతం నెలల తరబడిన అనంతరం ఇటీవల బెయిల్ పొందిన సంగతి తెలిసిందే. ఆయనకు బెయిల్ మంజూరు చేసిన ధర్మాసనానికే తాజాగా కవిత కేసు విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో.. ఆమెకు ఈసారి బెయిల్ లభించటటం ఖాయమన్న మాటను చెబుతున్నారు.

ఢిల్లీ మద్యం కేసులో అరెస్టు అయిన కవిత.. దాదాపు ఐదు నెలలకు పైనే తీహార్ జైల్లో ఉండటం తెలిసిందే. తనపై ఈడీ.. సీబీఐ పెట్టిన కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలని ఆమె కోరుతున్నారు. ఇటీవల కాలంలో ఆమె ఆరోగ్యం తీవ్రంగా దెబ్బ తినటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈసారి బెయిల్ వచ్చే అవకాశాలే మొండుగా ఉన్నాయన్న నమ్మకాన్ని గులాబీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. అదే జరిగితే.. గులాబీ బాస్ కేసీఆర్ కు పెద్ద దిగులు తీరినట్లే అవుతుంది.

Tags:    

Similar News