బిగ్ బ్రేకింగ్.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను మార్చి 16న ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
హమ్మయ్య.. ఎట్టకేలకు బీఆర్ఎస్ కు ఊరట కలిగించే అంశం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి.. మేడిగడ్డతో కుంగిపోయి.. లోక్ సభ ఎన్నికల్లో జీరోకు పరిమితమై.. ఎమ్మెల్యేలను కోల్పోయి.. అధినేత కూతురు జైలుపాలైన పరిస్థితుల్లో.. కారు పార్టీని కాలం కనికరించింది. బీఆర్ఎస్ శ్రేణలకు కాస్త మనో ధైర్యం కలిగే పరిణామం చోటుచేసుకుంది. ఐదు నెలలుగా తిహాడ్ జైల్లో గడిపిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎట్టకేలకు బెయిల్ లభించింది.
మార్చి 16.. ఆగస్టు 27
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను మార్చి 16న ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆమెను తిహాడ్ జైలుకు తరలించారు. అప్పటినుంచి కేసు అనేక మలుపులు తిరిగింది. సీబీఐ కూడా మధ్యలో ఎంటరైంది. కాగా, జైలులో కవిత తొలి రోజుల్లో ధైర్యంగానే ఉన్నప్పటికీ బెయిల్ ఆలస్యం అయ్యేకొద్దీ మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పడినట్లు తెలిసింది. మొత్తమ్మీద ఆమె 11 కిలోల బరువు తగ్గినట్లుగా సోదరుడు కేటీఆర్ తెలిపారు. మరోవైపు ఆధ్యాత్మిక చింతనకు కవిత జపమాల తెప్పించుకున్నారు. కొన్ని పుస్తకాలను కూడా కోరారు. ఇక కవితకు గతం నుంచి ఉన్న ఆరోగ్య సమస్యలు జైలులో ఆమెను ఇబ్బంది పెట్టాయి. బీఆర్ఎస్ మాజీ మంత్రులు, మహిళా ఎమ్మెల్యేలు.. జైలుకు వెళ్లి ధైర్యం చెప్పారు.
వస్తుందనుకున్న బెయిల్..
కవితకు బెయిల్ వస్తుందని పలుసార్లు కోర్టు విచారణల సందర్భంగా భావించినా అది సాకారం కాలేదు. చివరి నిమిషంలో నిరాశే ఎదురైంది. అయితే మంగళవారం ఢిల్లీ మద్యం కేసులో ఈడీ నమోదు చేసిన కేసులో సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం బెయిల్ మంజూరు చేసింది. కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. కవిత తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ, ఈడీ తరఫున ఏఎస్‌జీ వాదనలు వినిపించారు. వాదనలు విన్న ద్విసభ్య ధర్మాసనం కవితకు బెయిల్ ఇచ్చింది.
సీబీఐ కేసులో ట్విస్టుందా?
కవితలాగే ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇటీవల బెయిల్ వచ్చినట్లే వచ్చి ఆగిపోయింది. ఈడీ కేసులో బెయిల్ వచ్చినా సీబీఐ ప్రవేశంతో బయటకు రాలేకపోయారు. మళ్లీ ఇప్పడు కవిత విషయంలో అదే జరుగుతుందా? అనేది చూడాలి. ఢిల్లీ మద్యం కుంభకోణాన్ని అటు ఈడీ, ఇటు సీబీఐ రెండూ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే.