‘సోనియమ్మ’ ఫోటో ఒకరిని చంపేసింది

Update: 2016-06-17 07:49 GMT
వ్యంగం హద్దులు దాటుతోంది. నచ్చిన వారిని ఆకాశానికి ఎత్తేయటం.. నచ్చని వారిని పాతాళానికి తొక్కేసినట్లుగా వ్యాఖ్యలు చేయటం.. అభ్యంతరకర ఫోటోల్ని తయారు చేయటం ఈ మధ్యన ఎక్కువైంది. దీనికి తోడు తమకున్న పైత్యాన్ని పది మందితో పంచుకోవటానికి.. వాటిని వైరల్ గా చేయటానికి సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నారు. ఎవరూ దేన్ని ఆపలేని పరిస్థితి. ఇది ఒకందుకు మంచిదైనా.. చెడు త్వరగా వ్యాప్తి చెందటానికి.. భావోద్వేగాలు త్వరగా తట్టి లేపే ఇలాంటి ఘటనలతో లేనిపోని సమస్యలు ఎదురవుతున్నాయి.

ఇందుకు తాజా నిదర్శనం మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో చోటు చేసుకున్న ఘటనగా చెప్పొచ్చు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి సంబంధించిన ఒక అభ్యంతరకర ఫోటో ఒకరి ప్రాణాలు తీయటమే కాదు.. జబల్ పూర్ లో తీవ్ర ఘర్షణలకు కారమైంది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ ఫోటో కారణంగా రెండు వర్గాల మధ్య గొడవలు చోటు చేసుకుంది. ఇది శృతి మించి ఒకరి ప్రాణాలు తీయటంతో పాటు. తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది.

ఇంత రచ్చ చేసిన ఈ ఉదంతంలోకి వెళితే..  కాంగ్రెస్ పార్టీకి చెందిన జతిన్ రాజ్ అనే కార్పొరేటర్ విజయ్ నగర్ ఫ్రెండ్స్ పేరుతో ఒక వాట్సప్ గ్రూప్ ను ఏర్పాటు చేశారు. ఇందులో సోనియాగాంధీ వంటపాత్రలు కడుగుతున్న ఒక మార్ఫింగ్ చిత్రాన్ని ప్రశాంత్ అనే వ్యక్తి పెట్టినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఫోటో పక్కన క్యాప్షన్ ఒకటి ఏర్పాటు చేసి.. ప్రధాని మోడీ.. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని ఈ స్థితికి తీసుకొచ్చారని పేర్కొన్నారు.

దీంతో.. ఫోటో పెట్టిన వారికి.. ఫోటోకుఅభ్యంతరం వ్యక్తం చేసిన వారి మధ్య మాటామాటా పెరిగింది. ఈ గొడవ గురించి తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని..రెండు వర్గాల వారిని పోలీస్ స్టేషన్ వద్దకు రావాలని చెప్పారు. ఈరెండు వర్గాల వారు పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్న వెంటనే వారి మధ్య ఘర్షణ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇరు వర్గాల మధ్య జరిగిన దాడులతో పలువురు గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన ఉమేశ్ శర్మ అనే యువకుడు ఈ దాడుల్లో మృతి చెందాడు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫోటోల విషయంలో ఆచితూచి అడుగు వేయటంతో పాటు.. ఒకరిని నొప్పించే అంశాల్ని స్పృశించకపోవటమే మేలన్న విషయాన్ని మర్చిపోకూడదు.
Tags:    

Similar News