'నారాయ‌ణ‌'కు 10 ల‌క్ష‌ల జ‌రిమానా

Update: 2017-11-02 07:55 GMT
మారుతున్న కాలంలో పోటీత‌త్వం పెరిగి పిల్ల‌ల్ని మార్కుల మిషన్లుగా, ర్యాంకుల యంత్రాలుగా మార్చేస్తున్నారు. ముఖ్యంగా కార్పొరేట్ క‌ళాశాల‌ల్లో వారిపై తీవ్ర ఒత్తిడి ఉంటోంది. ఆడుతూపాడుతూ సాగాల్సిన చ‌దువు నిర్బంధంగా సాగుతోంది. నిద్రాహారాల‌కు సైతం మొహంవాచిపోయేలా విద్యార్థుల‌పై ప‌లు కార్పొరేట్ క‌ళాశాల‌లు ఒత్తిడితో విద్య‌నందిస్తున్నాయి. ఇక ర్యాంకులు - మార్కులే కొల‌మానమ‌ని తల్లిదండ్రులు సైతం భావించ‌డంతో చాలా మంది విద్యార్థులు మాన‌సిక వేద‌న‌కు గుర‌వుతున్నారు. ఒత్తిడి భ‌రించ‌లేక ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతున్నారు. ఇటీవ‌ల కాలంలో రాష్ట్రంలో పేరొందిన కార్పొరేట్ క‌ళాశాల‌ల్లో విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌ల ఘ‌ట‌న‌లు క‌ల‌క‌లం రేపాయి.

ఈ నేప‌థ్యంలో ఇటీవ‌ల క‌డ‌ప నారాయ‌ణ క‌ళాశాల‌లో విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన ఘ‌ట‌న‌పై ప్ర‌భుత్వం విచార‌ణ జ‌రిపింది. ఈ సంద‌ర్భంగా యాజ‌మాన్యం నిర్ల‌క్ష్యం, సిబ్బంది వైఫ‌ల్యం వ‌ల్లే విద్యార్థి ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు అధికారులు గుర్తించారు. దీంతో కడపలోని నారాయణ కళాశాలకు రూ.10 లక్షలు జరిమానా విధించినట్లు ఆర్‌ ఐఓ రవి  పేర్కొన్నారు. బుధవారం ఆయన వైఎస్సార్‌ జిల్లా రాయచోటిలో పలు కళాశాలలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కడపలోని నారాయణ కళాశాలలో ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై సమగ్ర విచారణ నిర్వహించామన్నారు.ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలలు విద్యార్థులపై ఒత్తిడి పెంచితే చర్యలు తప్పవని ఆర్‌ఐఓ పేర్కొన్నారు.

అయితే ఏదైనా దుర్ఘ‌ట‌న జ‌రిగిన త‌ర్వాత విచార‌ణ జ‌రిపి జ‌రిమానా విధించేకంటే.. ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావ‌ృతం కాకుండా చూడాల‌ని ప‌లువురు కోరుతున్నారు. యాజ‌మాన్యాలు, త‌ల్లిదండ్రులు విద్యార్థుల‌ను ర్యాంకులు సాధించే యంత్రాలుగా కాకుండా స్వేచ్ఛ‌గా చ‌దువుకునే వాతావ‌ర‌ణం క‌ల్పించాల‌ని మాన‌సిక నిపుణులు సూచిస్తున్నారు.​
Tags:    

Similar News