ఉత్తర కొరియాలో అంతే.. 11 రోజులు ఏడవనూకూడదు

Update: 2021-12-17 11:36 GMT
మిగతా దేశాలతో సంబంధం ఉండదు.. విదేశీయులు ఆ దేశానికి అంత తేలిగ్గా వెళ్లలేరు.. అక్కడేం జరుగుతోందో ఎవరూ చెప్పలేరు.. ప్రపంచమంతా కరోనాతో కుదేలైతే.. తమ దేశంలో మాత్రం ఒక్క కేసూ రాలేదంటారు.. సరిహద్దుల్లో కందకాలు తవ్వి మూసివేస్తారు.. అదే ఉత్తర కొరియా.. దాయాదా దక్షిణ కొరియా అద్భుత ప్రగతితో దూసుకెళ్తోంటే, ఉత్తర కొరియాది మాత్రం ఎప్పుడూ తిరోగమనమే. నియంత పాలకుడు కిమ్ జోంగ్ ఉన్ పోకడలైతే ప్రపంచాన్ని నివ్వెరపరుస్తుంటాయి.

తాజాగా ఆయన తీసుకున్న మరో నిర్ణయం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. ఉన్ తండ్రి కిమ్ జోంగ్ ఇల్ 2011లో చనిపోయారు. ఈయన కూడా నియంతే. కాకపోతే కుమారుడు ఉన్ అంత దుర్మార్గుడు కాదని చెబుతారు. అసలు విషయానికొ్స్తే.. ఇల్ మరణించి పదేళ్లవుతున్న సందర్భంలో ఉత్తర కొరియాలో ఆయన సంస్మరణార్థం 11 రోజులు సంతాప దినాలు జరుపుతున్నారు.

ఈ సందర్భంగా 11 రోజులు ప్రజలు నవ్వకూడదు. మద్యం తాగకూడదు. ఎలాంటి వేడుకల జరుపుకోకూడదు. ఈ మేరకు అక్కడి మీడియాలో ప్రకటన ఇచ్చారు. మరో విచిత్రమేమంటే.. శుక్రవారం (డిసెంబరు 17) ఆ దేశ ప్రజలు ఎవరూ నిత్యావసరాలు కొనేందుకు దుకాణాలకు వెళ్లకూడదు. ఈ సమయంలో ఎవరైనా మరణిస్తే.. మృతుడి కుటుంబ సభ్యులు బిగ్గరగా రోదించకూడదు. ఆఖరుకు పుట్టిన రోజులు జరుపుకోవడానికి వీలు లేదు.

నిబంధనలు మీరారో.. శాల్తీలు గల్లంతే

ఏదేమైనా కానీ, ఉత్తర కొరియాలో రూల్సంటే రూల్సే. ఇలాంటి ఆంక్షలనే గతంలో ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సంతాపదినాల సమయంలో ఆదేశాలకు విరుద్ధంగా కొందరు తాగుతూ పట్టుబడ్డారు. వారిని నేరస్థుల్లా పరిగణిస్తూ.. శిక్షలు వేశారు. ఆ తర్వాత వారి జాడ లేదు.
అది యమ ‘కిమ్’కరుల రాజ్యం

ఇక కిమ్ కుటుంబ పాలన అంటేనే యమకింకరుల రాజ్యం. ఇల్ 1994 నుంచి 2011 వరకు నియంతృత్వ వైఖరితో ప్రజలకు నరకం చూపారు. అకస్మాత్తుగా 2011, డిసెంబరు 17న గుండెపోటుతో మరణించారు. ఆయన 3వ కుమారుడు ఉన్.

ఇల్ వర్థంతి రోజున ఏటా 10 రోజుల పాటు సంతాప దినాలు జరుగుతాయి. ఈసారి 10వ వర్థంతి కావడంతో ఆ సంఖ్యను 11 రోజులకు పెంచారు. వీరి పాలనలో ఉత్తర కొరియా ప్రజలకు ఆంక్షలు కొత్తేం కాదు.దేశంలో కరవు తాండవిస్తుండటంతో సరిగ్గా తిండితినే పరిస్థితి లేదు. ఆహార కొరత తీవ్రమైంది.

కరోనా ఆంక్షలు, సరిహద్దుల మూసివేత, గతేడాది తుపానులు కారణంగా దేశంలో ఆహార లభ్యత తగ్గి, ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. ఈ సమయంలో 2025 వరకు పౌరులంతా తక్కువ మొత్తంలో ఆహారం తీసుకోవాల్సిందిగా అధ్యక్షుడు కిమ్ పిలుపునిచ్చాడు.
Tags:    

Similar News