15 పోలింగ్ స్టేషన్లలో సున్నా పోలింగ్.. ఎందుకంటే?

Update: 2019-04-12 05:01 GMT
ఎన్నికలు వస్తున్నాయంటే చాలు ఉత్సాహంతో ఓటేయటానికి బారులు తీరటం కొన్నిచోట్ల కనిపిస్తే.. ఓటు వేయటానికి ఏ మాత్రం ఆసక్తి చూపించని వైనాలు కనిపిస్తాయి. ఈ రెండింటికి భిన్నంగా ఒక్క ఓటు అంటే ఒక్క ఓటు కూడా వేయని ఉదంతాలు ఉంటాయా?  అంటే.. ఉంటాయన్న సమాధానం ఈ వార్తను చదివిన తర్వాత చెప్పటం ఖాయం. 15 పోలింగ్ కేంద్రాల్లో ఒక్కటంటే.. ఒక్క ఓటు పడని వైనం చోటు చేసుకుంది.

ఎక్కడ?  ఎందుకన్న ప్రశ్నలకు సమాధానం వెతికితే.. ఆసక్తికర అంశాలు బయటకు వస్తాయి. ఒడిశాలోని మాల్కన్ గిరి జిల్లాలోని చిత్రకొండ.. మథిలిల్లోని 15 పోలింగ్ కేంద్రాల్లో ఒక్క ఓటు కూడా నమోదు కాలేదు. మావోల భయమే దీనికి కారణంగా చెబుతున్నారు. మావోల పట్టు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతాల్లో పోలింగ్ లో పాల్గొనేందుకు ఓటర్లు ముందుకు రాలేదు.

ఒడిశాలో పోలింగ్ 66 శాతం నమోదైతే.. ఈ 15 కేంద్రాల్లో ఒక్క ఓటు పడలేదు. ఇదిలా ఉంటే.. ఆ రాష్ట్రంలో కొన్నిచోట్ల పోలింగ్ ను బహిష్కరించారు. రోడ్లు లేకపోవటం.. మౌలిక సదుపాయాలు కల్పించకపోవటం లాంటి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రయత్నించలేదన్న ఆగ్రహంతో వారు పోలింగ్ లో పాల్గొనలేదు. భయంతో కొన్నిచోట్ల ఒక్క ఓటు పడకపోతే.. కోపంతో మరికొన్ని చోట్ల ఒక్క ఓటు వేయకపోవటం ఒడిశాలో జరిగిన ఎన్నికల ప్రత్యేకతగా చెప్పాలి.


Tags:    

Similar News