అమెరికా కుబేరుల్లో మనోళ్లు ఐదుగురు

Update: 2016-10-10 17:30 GMT
ప్రపంచానికి పెద్దన్న అయిన అమెరికాలోని సంపద గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఉండదు. అలా అని.. అమెరికా అంతట సంపదతో కళకళలాడుతుందనుకుంటే తప్పులో కాలేసినట్లే. కుబేరుల్లాంటోళ్లు ఎంతమంది ఉంటారో.. పేదరికంగా మగ్గేవారూ కనిపిస్తారు. ఇలాంటి తారతమ్యాలు.. వీటికి కారణాలు లాంటి అంశాల్ని కాసేపు పక్కన పెడితే.. అమెరికా లాంటి అగ్రరాజ్యంలో సంపద సృష్టించే మొనగాళ్లలో మనోళ్లు కూడా ఉండటం ఆసక్తికర అంశంగా చెప్పక తప్పదు. తాజాగా ఆ దేశంలో అత్యంత సంపన్నులైన టాప్ 400 మందికి సంబంధించిన ఒక జాబితాను ప్రఖ్యాత ఫోర్బ్స్  మ్యాగ్ జైన్ విడుదల చేసింది. ఈ జాబితాలో మైక్రోసాఫ్ట్ అధినేత.. ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్ గేట్స్ వరుసగా 23వ ఏడాదీ అగ్రస్థానంలో నిలిచారు. ఇలా.. భారీ సంపద ఉన్న అమెరికన్లలో ఐదుగురు భారత సంతతికి చెందిన అమెరికన్లు జాబితాలో చోటు సాధించటం విశేషంగా చెప్పక తప్పదు.

భారత సంతతికి చెందిన రోమేష్ వద్వానీ 3 బిలియన్ డాలర్లతో 222వ స్థానంలో నిలిచారు. సింఫనీ టెక్నాలజీ వ్యవస్థాపకులుగా సుపరిచితులైన ఆయన.. భారత మూలాలున్న అమెరికన్లలో మొదటి స్థానంలో నిలిచినట్లుగా చెప్పాలి. ఆయన తర్వాత 274వ స్థానంలో రొమేష్ దేశాయ్ 2.5బిలియన్ డాలర్ల సంపదతో నిలిచారు.

 మిగిలిన ముగ్గురు విషయానికి వస్తే.. 2.2 బిలియన్ డాలర్ల సంపదతో 321వ స్థానంలో నిలిచారు గంగ్వాల్. ఇక.. నాలుగో స్థానంలో 2.1 బిలియన్ డాలర్లతో కపూర్ 335వ స్థానంలో నిలవగా.. ఐదో స్థానంలో శ్రీరామ్ 1.9బిలియన్ డాలర్ల సంపదతో 361వ స్థానాన్ని సొంతం చేసుకున్నారు. అమెరికా లాంటి అగ్రరాజ్యంలో అక్కడి టాప్ 400 మంది కుబేరుల్లో మనోళ్లు ఐదుగురు నిలవటం నిజంగానే గొప్పని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News