రాజ్య‌స‌భ‌లో అత్యంత సంప‌న్న ఎంపీలు వీరే!

Update: 2018-03-25 08:00 GMT
సంప‌ద‌ను పెంచుకోవ‌టానికి ఏ రంగంలో మ‌దుపు చేస్తే బాగుంటుంది? అంటే.. చాలామంది చాలా చెబుతారు కానీ.. కాస్త తెలివి.. అంత‌కు మించిన ఓపిక‌.. కండ‌బ‌లం.. ఉంటే రాజ‌కీయ రంగానికి మించింది మ‌రొక‌టి ఉండ‌దేమో?  తాజాగా రాజ్య‌స‌భ‌కు ఎన్నికైన ఎంపీల ఆస్తుల్ని లెక్కిస్తున్న వారు ఆశ్చ‌ర్యానికి గురి అవుతున్నారు.

రాజ్య‌స‌భ ఎంపీల ఆస్తులు ఏడాదికేడాదికి అమాంతంగా పెరిగిపోతున్న విష‌యాన్ని అసోసియేష‌న్ ఫ‌ర్ డెమొక్రాటిక్ రిఫార్మ్స్ తాజాగా విడుద‌ల చేసిన నివేదిక స్ప‌ష్టం చేస్తోంది. రాజ్య‌స‌భ‌లో ఉన్న మొత్తం ఎంపీల్లో 90 శాతం మంది కోటీశ్వ‌రులేన‌ని తేల్చింది.

దీంతో.. పెద్ద‌ల స‌భ సంప‌న్న స‌భ‌గా చెప్పాలి. రాజ్య‌స‌భలోని స‌భ్యుల ఆస్తుల మొత్తాన్ని తీసుకొని ఒక్కో స‌భ్యుడిది స‌రాస‌రి చేస్తే.. రూ.55 కోట్లుగా తేలిన‌ట్లు చెబుతున్నారు. మొత్తం 233 మంది సిట్టింగ్ ఎంపీల్లో 229 మంది త‌మ‌కు తాముగా దాఖ‌లు చేసిన అధికారిక అఫిడ‌విట్ల ఆధారంగా డేటాను రూపొందించారు.

దీని ప్ర‌కారం ఎంపీల్లోజ‌నతాద‌ళ్‌ కు చెందిన‌ మ‌హేంద్ర ప్ర‌సాద్ రూ.4078.41 కోట్ల‌తో మొద‌టి స్థానంలో నిల‌వ‌గా.. రెండో స్థానంలో న‌టి జ‌యాబ‌చ్చ‌న్ రూ.1001.64 కోట్ల‌తో నిలిచారు. ఇక‌.. మూడోస్థానంలో బీజేపీకి చెందిన రవీంద్ర కిశోర్ రూ.857.11 కోట్ల‌తో నిలిచారు.

ఇక‌.. పార్టీల వారీగా చూస్తే.. అధికార బీజేపీ క‌న్నా.. విప‌క్ష కాంగ్రెస్ క‌న్నా..14 మంది ఎంపీలున్న స‌మాజ్ వాదీ పార్టీ ఎంపీలు అత్యంత సంప‌న్నులుగా తేలారు. ఆ పార్టీ ఎంపీల స‌రాస‌రి ఆస్తులు చూస్తే.. ఒక్కొక్క‌రిది స‌గ‌టున రూ.92 కోట్ల‌కు పైనే ఉంది.  వీరి త‌ర్వాత స్థానం కాంగ్రెస్ ఎంపీలుగా నిలిచారు. మొత్తం 50 మంది ఎంపీల్లో స‌గ‌టు ఆస్తి రూ.40.9 కోట్లుగా తేలితే.. 64 మంది ఎంపీలున్న బీజేపీ నేత‌ల స‌రాస‌రి ఆస్తి రూ.27.8 కోట్లుగా తేలింది.

ఇక‌.. కేసుల విష‌యానికి వ‌స్తే పెద్ద‌ల స‌భ‌లోని 20 మంది ఎంపీల‌పై తీవ్ర ఆరోప‌ణ‌ల‌పై కేసులు న‌మోద‌య్యాయి. ఆస్తులే కాదు.. బ్యాంకుల‌కు అప్పులున్న ఎంపీల‌కు కొద‌వ లేదు. మొత్తం 154 మంది ఎంపీలు ప‌లు సంస్థ‌ల‌కు లోన్ పేమెంట్ క‌ట్టాల్సి ఉంది. వారిలో సంజ‌య్ ద‌త్తాత్రేయ క‌ఖ‌డే అధికంగా రూ.304.6 కోట్లు చెల్లించాల్సి ఉంద‌ని తేలింది.
Tags:    

Similar News