బీటెక్ చదివి.. టీ కొట్టు పెట్టి.. యువతి స్టార్టప్ వైరల్

Update: 2022-10-14 15:33 GMT
ఏదైనా మొదలయ్యేది చిన్న ఐడియాతోనే.. ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుందన్నది ఓ మొబైల్ ఫోన్ స్లోగన్. కానీ నిజంగానే చిన్నగా మొదలుపెట్టిన సంస్థలు ఇప్పుడు వేల కోట్లతో సామ్రాజ్యాన్ని ఏలుతున్నాయి. అందుకే ఎవరినీ తక్కువ అంచనా వేయడానికి లేదు. ఇప్పటికే ఎంతో మంది నిరూపించుకొని తమ సత్తాను ప్రపంచానికి చాటిచెప్పారు.

బీటెక్ లు, ఎంటెక్ లు చదివి అమెరికా వెళ్లి సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేయాలనేది అందరి కల. కానీ ఈ యువత బీటెక్ చదువుతూ కూడా అటువైపు పోకుండా కేవలం సామాన్యపేదలు పెట్టుకొని ఒక టీ కొట్టు పెట్టి తన దారి ‘చాయ్ వాలా’ దారి అని చూపించింది. చదువు అనేది కేవలం ఉద్యోగం చేయడానికి మాత్రమే కాదని ఈ యువతి నిరూపిస్తోంది. తన కలలను నిజం చేసుకుంది.

బీహార్ కు చెందిన వార్తికా సింగ్.. చదువుతూనే తన కల వైపు మొదటి అడుగువేసింది.  ‘బీటెక్ చాయ్ వాలి’ అనే పేరుతో ఓ టీ షాప్ ఓపెన్ చేసిన ఈ యువతి ఇప్పుడు వైరల్ అవుతోంది.

వార్తికా సింగ్ ది బీహార్. తన డిగ్రీ నిమిత్తం హర్యానాలోని ఫరీదాబాద్ కు వచ్చింది. అక్కడ ఇంజనీరింగ్  విద్యను అభ్యసిస్తోంది. సొంతంగా వ్యాపారం చేయడమే ఆమె లక్ష్యం. తన డిగ్రీ చేతికి వచ్చేసరికి నాలుగు సంవత్సరాలు పడుతుంది. నా బీటెక్ పూర్తయ్యే వరకూ వేచి ఉండడంలో అర్థం లేదు. అప్పటివరకూ సమయం వృథా చేయడం సరికాదు అని ఆ వీడియోలో మాట్లాడింది. ఈ మాటలు ఆమెకు లక్ష్యం పట్ల ఉన్న స్పష్టతను తెలియజేస్తున్నాయి. ఆలస్యం చేయకుండా ఆ దిశగా అడుగు వేసింది.

ఫరీదాబాద్ లోని గ్రీన్ ఫీల్డ్ వద్ద టీస్టాల్ ను ఏర్పాటు చేసింది. దానికి ‘బీటెక్ చాయ్ వాలీ’ అంటూ పేరు పెట్టుకుంది. తన లక్ష్యాన్ని ఎప్పుడూ గుర్తు చేసేలా ‘ఆత్మ విశ్వాసం, కృషి ఎప్పుడూ విజయాన్నే ఇస్తాయి’ అని స్టాల్ దగ్గర ఓ బ్యానర్ ను పెట్టుకుంది.

కాలేజీ పూర్తయిన తర్వాత సాయంత్రం 5.30 గంటల నుంచి 9 గంటల వరకూ టీ విక్రయిస్తోంది. ఆమె దగ్గర లెమన్, మసాలా చాయ్ కూడా అందుబాటులో ఉన్నాయి. చివరగా ఈ వీడియో ఆమె ఒక అభ్యర్థన కూడా చేసింది. ఈ వీడియోను షేర్ చేసి తనకు ప్రోత్సహించాలని.. టీ తాగి నచ్చకపోతే మళ్లీ రావద్దు అంటూ తన పనిలో నిమగ్నమైంది. ఇంత చదువుకున్న వయసులోనే ఈమె పట్టుదలకు ప్రశంసలు కురుస్తున్నాయి.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News