పీవీఆర్ సినిమాస్..బుక్ మై షోలకు ఫైన్ వేసిన ఫోరం

Update: 2021-03-16 05:45 GMT
ప్రముఖ మూవీ బుకింగ్ యాప్ బుక్ మై షోకు.. ప్రముఖ మల్టీఫ్లెక్స్ సంస్థ పీవీఆర్ కు హైదరాబాద్ జిల్లావినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ లో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆన్ లైన్ లో టికెట్లు కొనుగోలు సమయంలో ఇంటర్నెట్ హ్యాండిలింగ్ ఛార్జీల పేరుతో ప్రేక్షకుల నుంచి డబ్బులు వసూలు చేయటంపై కమిషన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఆన్ లైన్ లో సినిమా టికెట్లను బుక్ చేస్తుంటే.. అదనపు ఛార్జీల్ని వసూలు చేయటాన్ని తప్పుపడుతూ వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు హైదరాబాద్ కు చెందిన సామాజిక కార్యకర్త విజయ్ గోపాల్.

సికింద్రాబాద్ కు చెందిన విజయగోపాల్ పంజాగుట్టలోని పీవీఆర్ సినిమాస్ లో సినిమా చూసేందుకు బుక్ మై షో ద్వారా టికెట్ బుక్ చేశారు. ఇంటర్నెట్ హ్యాండిలింగ్ ఛార్జీలు రూ.41.78తో కలిపి మొత్తం రూ.341.78 చెల్లించారు. టికెట్ ధరపై 18 శాతం వసూలు చేయటం ఏమిటంటే 2019 జనవరి 18న ఆన్ లైన్ లో కంప్లైంట్ చేశారు. అనంతరం జిల్లా వినియోగదారుల కమిషన్ ను ఆశ్రయించారు.

దీనిపై ప్రతివాదులుగా ఉన్న బుక్ మై షో.. ఫిర్యాదుదారు చేసిన ఫిర్యాదులో వాస్తవం లేదని.. కేసు కొట్టేయాలని కోరారు. దీంతో.. విచారణ జరిపి తీర్పును వెల్లడించారు.  ఫోరంను ఆశ్రయించిన 25 నెలల తర్వాత ఈ కేసుకు సంబంధించి తీర్పు వెలువడింది. టికెట్ ధరకు అదనంగా రూ.6 వసూలు చేసుకోమని ప్రతివాదులకు చెప్పిన ఫోరం.. ఫిర్యాదుదారు విజయ్ గోపాల్ కు రూ.25వేల పరిహారం చెల్లించాలని.. కేసు ఖర్చుల కింద రూ.వెయ్యి చెల్లించాలన్న తీర్పును ఇచ్చింది. అంతేకాదు రూ.5వేలు లీగల్ ఎయిడ్ కింద కోర్టుకు చెల్లించాలని చెప్పింది.

ఫోరం ఇచ్చిన తీర్పు వెలువడిన వెంటనే ఆ మొత్తాన్ని చెల్లించాలని లేని పక్షంలో తీర్పు వెలువడిన నాటి నుంచి 18 శాతం వడ్డీతో పరిహారాన్ని చెల్లించాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది. కంప్లైంట్ చేయటానికి దాదాపు ఏడాది పాటు ఈ అంశంపై పరిశోధన చేయటంతో పాటు.. ఆర్బీఐ.. మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తదితర ప్రభుత్వ విభాగాలకు ఆర్టీఐలో దరఖాస్తు చేసి పూర్తి సమాచారం తీసుకన్న తర్వాతే తాను కమిషన్ ను ఆశ్రయించినట్లు చెప్పారు.మరి.. ఆన్ లైన్ లో టికెట్ కు రూ.6 మాత్రమే వసూలు చేయాలన్న ఫోరం తీర్పును బుక్ మై షో.. పీవీఆర్ సంస్థలు ఓకే చేస్తాయా? లేదా? అన్నది చూడాలి.
Tags:    

Similar News