వైఎస్ వివేకా హత్యపై కీలక పరిణామం

Update: 2021-12-16 04:07 GMT
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇవాళ కీలక వ్యక్తి అయిన భరత్ కుమార్ యాదవ్ ను సీబీఐ విచారించడం చర్చనీయాంశమైంది. పులివెందుల జర్నలిస్టు భరత్ కుమార్ యాదవ్ గత నెల 21న సీబీఐ డైరెక్టర్ కు లేఖ రాయడంతోపాటు మీడియా సమావేశంలో సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడు వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి అని భరత్ సంచలన ఆరోపణలు చేశారు. ఆస్తి గొడవలే ఈ హత్యకు దారితీశాయనేది భరత్ ప్రధాన ఆరోపణ. అలాగే తన బంధువు సునీల్ యాదవ్ పాత్రపై కూడా కీలక వ్యాఖ్యలు చేశాడు.

ఈ నేపథ్యంలోనే భరత్ కుమార్ యాదవ్ ను సీబీఐ అధికారులు విచారించడం ప్రాధాన్యం సంతరించుకుంది. నెలన్నర తర్వాత వివేకా హత్య కేసుపై సీబీఐ విచారణ జరపడం సర్వత్రా ఆసక్తి కలిగిస్తోంది. కడప కేంద్ర కారాగారంలోని అతిథిగృహంలో భరత్ కుమార్ యాదవ్ ను పోలీసులు ప్రస్తుతం విచారిస్తున్నారు.

వివేకా హత్య కేసుకు సంబంధించి తనకు కీలక విషయాలు తెలుసునని భరత్ కుమార్ బహిరంగంగా ప్రకటించడంతోపాటు సీబీఐ డైరెక్టర్ కు లేఖ రాసిన నేపథ్యంలో కేసు ఏ మలుపు తిరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది.

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇటీవల కీలక పరిణామం చోటుచేసుకుంది.. ఈ కేసులో ఒకరి తర్వాత ఒకరు బయటకు వస్తూ సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా వైఎస్ వివేకా పీఏ కృష్ణారెడ్డి తనకు ప్రాణహాని ఉందని కడప ఎస్పీ అన్బురాజన్ కు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది.

వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డితోపాటు బామ్మర్ధి శివప్రకాష్ రెడ్డిల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో పీఏ కృష్ణారెడ్డి పేర్కొనడం సంచలనమైంది.

వైఎస్ వివేకా హత్య కేసులో కొందరు తనపై ఒత్తిడి తెస్తున్నారని.. ఈ నేపథ్యంలోనే వాళ్ల ముగ్గురి పేర్లు ప్రస్తావిస్తూ ఎస్పీకి ఫిర్యాదు చేయడం సంచలనమైంది. వీళ్ల వల్ల తనకు ప్రాణహాని ఉందని.. రక్షణ కల్పించాలని ఎస్పీని పీఏ కోరారు.

వైఎస్ వివేకాకు కృష్ణారెడ్డి మంచి నమ్మకస్తుడైన పీఏగా గుర్తింపు పొందారు. 30 ఏళ్ల పాటు వివేకా వెంట ఉన్నారు. వివేకా తుదిశ్వాస విడిచేవరకూ పీఏగా కొనసాగారు. ఇప్పుడు ఆయన కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేయడం వెనుక ఎవరో పెద్దల హస్తం ఉందనే చర్చ సాగుతోంది.


Tags:    

Similar News