గుజరాత్ సీఎం అభ్యర్థిని ప్రకటించేసిన ఆప్.. అచ్చం పంజాబ్ లోలాగే

Update: 2022-11-04 11:35 GMT
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజకీయాలే వేరు. ఆ పార్టీ ఎక్కడున్నా తన విధానాలతో ప్రముఖంగా నిలుస్తుంది. అసలు సాధ్యమే కాదనుకున్న ఢిల్లీ సీఎం పీఠాన్ని వరుసగా రెండోసారి దక్కించుకుంది. అది కూడా.. వరుసగా మూడుసార్లు కాంగ్రెస్ గెలిచిన చోట.. కేంద్రంలో నరేంద్ర మోదీ వంటి వ్యక్తి ప్రధానిగా ఉన్న సమయంలో బీజేపీని ఓడించి మరీ ఢిల్లీ గద్దెనెక్కింది.దీనంతటి వెనుక ఉన్నది అర్వింద్ కేజ్రీవాల్. ఆయన నమ్ముకున్న విద్యావంతులైన నాయకులు. మోదీ సర్కారు ఎంత ఇబ్బంది పెట్టినా.. లెఫ్టినెంట్ గవర్నర్ ఎంత చిరాకు రేపినా.. తట్టుకుని నిలిచింది ఆప్ సర్కారు.

పంజాబ్ లో ప్రజల చేత సీఎం అభ్యర్థిని నిర్ణయించి ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత సంచలనం పంజాబ్. అధికారంలోని కాంగ్రెస్ ను మట్టికరిపిస్తూ.. అధికారం కోసం వెంపర్లాడుతున్న బీజేపీని కంగుతినిపిస్తూ ఆప్ విజయబావుటా ఎగురవేసింది. సీఎం అభ్యర్థి ఎంపికపై టెలిఫోన్ సర్వే నిర్వహించి భగవంత్ సింగ్ మాన్ ను అభ్యర్థిగా ప్రకటించింది.

ఆయనపై వ్యక్తిగతంగా ఎన్ని ఆరోపణలున్నా వాటిని ఖాతరు చేయకుండా ఎన్నికలకు వెళ్లి విజయం సాధించింది. ఈ తరహాలోనే గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని చూస్తోంది. తమ పార్టీ సీఎం అభ్యర్థిగా టీవీ యాంకర్‌గా పనిచేసినఇసుదాన్‌ గఢ్వీని ఎంపిక చేసింది. ఈ విషయాన్ని కేజ్రీవాల్‌ శుక్రవారం ప్రకటించారు.

అక్కడ యాంకరే.. ఇక్కడా యాంకరే..మాన్ కూడా గతంలో టీవీ షోలలో పనిచేశారు. టెలిఫోన్ సర్వేలో సీఎం అభ్యర్థిగా ఎంపికయ్యారు. గఢ్వీ కూడా ఇదే తరహాలో టీవీ యాంకరే కావడం గమనార్హం. ఆప్‌ నిర్వహించిన పోల్‌లో 40 ఏళ్ల గఢ్వీకి 73 శాతం ఓట్లు వచ్చాయని కేజ్రీవాల్‌ వెల్లడించారు. ఈ రేసులో పాటిదార్ కమ్యూనిటీ ఆందోళనలో కీలక పాత్ర పోషించిన ఆప్‌ గుజరాత్‌ ఇన్‌ఛార్జి గోపాల్ ఇటాలియా కూడా
ఉన్నప్పటికీ.. గుజరాతీలు గఢ్వీ వైపే మొగ్గు చూపారు. గఢ్వీ ద్వారకా జిల్లా పిపాలియా గ్రామంలోని ఓ రైతు కుటుంబంలో జన్మించారు.

అలాగే, గుజరాత్‌ జనాభాలో 48శాతంగా ఉన్న ఓబీసీ వర్గానికి చెందిన వ్యక్తి కావడం గమనార్హం. అయితే, పంజాబ్‌లో భగవంత్‌ మాన్‌ను సీఎం అభ్యర్థిగా ఎంచుకున్న చందంగానే గుజరాత్‌లోనూ ఆప్‌ ఓ ఫోన్‌ నంబర్‌ను ఏర్పాటు చేసి ప్రజల నుంచి అభిప్రాయాలను కోరింది. గఢ్వీ గుజరాత్‌లో అత్యంత ప్రజాదరణ కలిగిన టీవీ జర్నలిస్టు, యాంకర్లలో ఒకరుగా ఉన్నారు.

40 ఏళ్లే.. రైతు కుటుంబం..గఢ్వీ వయసు 40 మాత్రమే. గతేడాదే ఆప్ లో చేరారు. రైతు కుటుంబానికి చెందినవారు. తాజాగా సీఎం అభ్యర్థిగా ప్రకటించడంతో ఉద్వేగానికి లోనయ్యారు. ‘‘నాలాంటి రైతు బిడ్డకు కేజ్రీవాల్‌ ఇంత పెద్ద బాధ్యత అప్పగించారు. నేను చేయగలిగనంత మంచి చేస్తాను. భగవంతుడు నాకు అన్నీ ఇచ్చాడు. ఇప్పుడు నా తోటి గుజరాతీలకు అవసరమైనవి
ఇవ్వాలనుకుంటున్నా. తుది శ్వాస దాకా ప్రజలకు సేవ చేస్తా'' అని వ్యాఖ్యానించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News