టీ కాంగ్రెస్‌లో ఆ పంచాయితీ తెంచిన రాహుల్ మీటింగ్‌..!

Update: 2022-05-09 10:43 GMT
వ‌రంగ‌ల్ ప‌శ్చిమ ఏమిటీ.. రాహుల్ మీటింగ్ తెంచ‌డం ఏంట‌ని అనుకుంటున్నారా..? ఇందులో మ‌త‌ల‌బు ఏంటంటే రాహుల్ స‌భ వ‌ల్ల వ‌రంగ‌ల్ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం గొడ‌వ స‌ద్దుమ‌ణిగింది. టీపీసీసీ పెద్ద‌లు ప‌శ్చిమ పంచాయ‌తీని తెగ్గొట్టారు. నియోజ‌క‌వ‌ర్గాల‌ను పంచారు. దీంతో రాహుల్ స‌భ విజ‌య‌వంతం అయింది. ఈ స‌భ స‌క్సెస్ కావ‌డానికి కార‌ణం ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా కాంగ్రెస్ నేత‌లు ఐక్యంగా ప‌నిచేయ‌డ‌మే.

రాహుల్ స‌భ‌కు ముందు తెలంగాణ కాంగ్రెస్ నేత‌ల్లో పెద్ద సందేహం ఉండేది. వ‌రంగ‌ల్ లో ఉన్న గ్రూపు త‌గాదాలు పార్టీకి ఎక్క‌డ మ‌చ్చ తీసుకొస్తాయో.. రాహుల్ స‌భ ఎక్క‌డ విఫ‌లం అవుతుందో అనే భ‌యం ఉండేది. అయితే పార్టీ పెద్ద‌లు సీనియ‌ర్ల‌తో చ‌ర్చ‌లు జ‌రిపి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించార‌ట‌. ఇరు వ‌ర్గాల‌ను కూర్చోబెట్టి గొడ‌వ‌ను స‌ద్దుమ‌ణిగేలా చేశార‌ట‌. నియోజ‌క‌వ‌ర్గాల‌ను పంచి రేవంత్ నేత‌ల‌కు మార్గ‌నిర్దేశం చేశార‌ట‌.  

వ‌రంగ‌ల్ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో గ్రూపు త‌గాదాల‌కు తొలుత‌ ఆద్యం పోసింది పార్టీ సీనియ‌ర్ నేత జంగా రాఘ‌వ‌రెడ్డి అని పార్టీ నేత‌లు చ‌ర్చించుకుంటున్నారు. బ‌ల‌మైన నేత‌గా ముద్ర‌ప‌డిన జంగా క్రితం ఎన్నిక‌ల్లో పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు చేతిలో ఓడిపోయారు.

జంగా ఈసారి నియోజ‌క‌వ‌ర్గం మారాల‌ని నిర్ణ‌యించుకున్నారు. వ‌రంగ‌ల్ ప‌శ్చిమపై క‌న్నేసి అక్క‌డ ప‌ని చేసుకోవ‌డం మొద‌లుపెట్టారు. ప‌శ్చిమ నుంచే పోటీచేస్తాన‌ని ఇటీవ‌ల బ‌హిరంగంగా ప్ర‌క‌టించారు కూడా.

దీంతో పార్టీలో ముస‌లం మొద‌లైంది. ఎందుకంటే ఇక్క‌డి నుంచి టికెట్ ఆశిస్తున్న వారిలో మ‌రో బ‌ల‌మైన నేత ఉండ‌డ‌మే కార‌ణం. ఆయ‌న ఎవ‌రో కాదు.. పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు నాయిని రాజేంద‌ర్ రెడ్డి. గ‌త రెండు ప‌ర్యాయాలు పొత్తులు, ఇత‌ర కార‌ణాల వ‌ల్ల టికెట్ ద‌క్కించుకోలేక‌పోయిన నాయిని ఈసారి ఎలాగైనా బ‌రిలో నిల‌వాల‌ని భావిస్తున్నారు. ఇపుడు జంగా వ‌చ్చి మంట పెట్ట‌డంతో నాయిని ఉడికిపోతున్నారు. అదీగాకుండా ఈ సీటుపై రేవంత్ స‌న్నిహితుడు వేం న‌రేంద‌ర్ రెడ్డి కూడా ఆశ‌లు పెట్టుకున్నారు.

దీంతో రాహుల్ మీటింగ్ నేప‌థ్యంలో ఈ వ‌ర్గ పోరుకు పార్టీ పెద్ద‌లు మంగ‌ళం పాడారు. ఇరువ‌ర్గాల‌తో చ‌ర్చించి జంగాను మ‌ళ్లీ పాల‌కుర్తిలోనే ప‌నిచేసుకోవాల‌ని సూచించార‌ట‌. నాయినికి ప‌శ్చిమం నుంచి అవ‌కాశం క‌ల్పిస్తామ‌ని హామీ ఇచ్చార‌ట‌. జంగా త‌ప్పుకుంటే పాల‌కుర్తి నుంచి పోటీ చేయాల‌ని భావిస్తున్న కొండా సురేఖ భ‌ర్త ముర‌ళి, ప‌శ్చిమం నుంచి టికెట్ ఆశిస్తున్న వేం న‌రేంద‌ర్ రెడ్డి ఆశ‌ల‌కు ప్ర‌స్తుతం గండిప‌డిన‌ట్లే. చూడాలి మ‌రి ముందు ముందు ఏం జ‌రుగుతుందో..!
Tags:    

Similar News