కరోనా సెకండ్ వేవ్తో పెను ప్రమాదం.. జాగ్రత్తలు తప్పనిసరి!

Update: 2021-04-05 03:46 GMT
కరోనా మహమ్మారి కేసులు నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి. ఏడాది కాలంగా దేశంలో రోజూ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మార్చి నెల నుంచి బాధితుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం దేశం సెకండ్ వేవ్ గుప్పిట్లో ఉందని వైద్యాధికారులు, నిపుణులు చెబుతున్నారు. ఈ దశ చాలా ప్రమాదకరమని, జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని అంటున్నారు.

దేశంలో కరోనా మరోసారి పంజా విసరడంపై ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్దీప్ గులేరియా స్పందించారు. ఈ దశ చాలా ప్రమాదకరమని ఆయన అన్నారు. చాలా త్వరగా వైరస్ వ్యాప్తి చెందుతుందని తెలిపారు. తొలి దశలో 70వేల కేసులు నమోదుకావడానికి చాలా సమయం పట్టిందని ఆయన గుర్తు చేశారు. కానీ ఈసారి త్వరగా ఆ మార్క్ను చేరుతుందని అంచనా వేశారు. ఇకపోతే అనవసర ప్రయాణాలు తగ్గించుకోవాలని.. అవసరమైతేనే బయటకు వెళ్లాలని హెచ్చరించారు.

సెకండ్ వేవ్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది కాబట్టి ప్రభుత్వాలు, అధికార యంత్రాంగ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. అవసరమైతే మినీ లాక్డౌన్ విధించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. వైరస్ కేసులు విపరీతంగా పెరగడం ఆందోళన కలిగించే అంశమేనని ఆయన ఓ వీడియో సందేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే దిల్లీలో పరిస్థితి ప్రమాదకరంగా మారిందని ఆయన వివరించారు.

కేసులు ఎక్కువ సంఖ్యలో పెరుగుతున్నా ప్రజలు మాస్కులు పెట్టుకోవడం లేదని.. భౌతిక దూరం పాటించడం లేదని అన్నారు. ప్రయాణాలకు ప్రజలు దూరంగా ఉండాలని హెచ్చరించారు. విమాన, రోడ్డు ప్రయాణాలు చేయకపోవడమే మంచిదని గులేరియా అభిప్రాయపడ్డారు. ఈ రెండో దశలో కేసులు త్వరగా పెరిగే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు తప్పనిసరి అని... నిర్లక్ష్యం వహిస్తే పెను ముప్పు సంభవిస్తుందని ఆయన నొక్కి చెప్పారు. ప్రజలు ఇంకా కొన్నాళ్లు కొవిడ్ నిబంధనలు సీరియస్గా పాటించాలని హెచ్చరించారు.
Tags:    

Similar News