2021 జనవరిలో కరోనా టీకా... మొదటగా ఎవరికంటే ?

Update: 2020-10-02 17:30 GMT
కరోనా వైరస్ కట్టడి చేసే వ్యాక్సిన్ కోసం ప్రపంచమంతా వేయి కళ్లతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. కొన్ని నెలల్లో వ్యాక్సిన్ రావొచ్చన్న అభిప్రాయం వైద్య నిపుణులు, శాస్త్రవేత్తల నుంచి వ్యక్తమవుతోంది. ఈ తరుణంలో ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా మన దేశంలో తయారవుతున్న కరోనా వ్యాక్సిన్ పై సంచలన ప్రకటన చేశారు. అన్ని పనులు అనుకున్న ప్రణాళిక ప్రకారం పూర్తయితే వచ్చే ఏడాది జనవరిలో భారత్ లో సమర్థమంతమైన కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని గులేరియా తెలిపారు.

వ్యాక్సిన్ సిద్ధం అయిన ప్రారంభ దశలో దేశ జనాభాకు సరిపడే సంఖ్యలో డోసులు అందుబాటులో ఉండవని స్పష్టం చేశారు. వ్యాక్సిన్ సిద్ధమైన అనంతరం దానిని భారీగా తయారు చేయడం, ఎక్కువ మందికి పంపిణీ చేయడం లాంటి సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఎక్కువ ముప్పు ఉన్న వారికి మొదటగా వాక్సిన్ పంపిణీ ఉంటుందన్నారు. వైరస్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉన్న ఆరోగ్య సిబ్బందికి, వైరస్ పై ముందుండి పోరాడుతున్న ఇతర వారియర్లకు ముందుగా వ్యాక్సిన్ పంపిణీ ఉంటుందన్నారు. వైరస్ సోకితే మరణించే అవకాశం ఎక్కువగా ఉన్న వారికి కూడా ముందుగా వ్యాక్సిన్ ఇస్తారన్నారు.

ఇలా ప్రాధాన్యత ప్రకారం వ్యవహరిస్తేనే వ్యాక్సిన్ పంపిణీ సజావుగా సాగుతుందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. లేక పోతే వైరస్ వ్యాప్తి పెరగడంతో పాటు, ఎక్కువగా మరణాలు చోటు చేసుకునే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ వచ్చే వరకు ప్రజలు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించాలని రణ్‌దీప్‌ గులేరియా తెలిపారు.

భారత్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 63,94,068కి చేరింది. కరోనాను జయించి 53,52,078 మంది పూర్తిగా కోలుకున్నారు. కరోనా వైరస్‌తో పోరాడుతూ 99,773 మంది ప్రాణాలు కోల్పోయారు.ప్రస్తుతం మనదేశంలో 9,42,217కరోనా యాక్టివ్ కేసులున్నాయి. టెస్ట్‌ల విషయానికొస్తే.. గడిచిన 24 గంటల్లో మనదేశంలో 10,97,947 శాంపిల్స్ పరీక్షించారు. భారత్‌లో ఇప్పటి వరకు 7 కోట్ల 67 లక్షల 17,728 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ తెలిపింది.
Tags:    

Similar News