పోలీస్ బాస్ క్లీన్ చిట్ అక్బరుద్దీన్ కు వర్క్ వుట్ కాలేదే!

Update: 2019-08-01 04:41 GMT
పావుగంట పేరుతో మజ్లిస్ అధినేత అసద్ సోదరుడు కమ్ చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ చేసే వివాదాస్పద వ్యాఖ్యలు క్రియేట్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. గతంలో తాను చేసిన పావు గంట మాటలు హిందువుల్ని కట్టడి చేశాయంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఆయన తీరు ఉందన్న మాట పలువురు నోట వినిపిస్తోంది.

ఇటీవల జరిగిన కరీంనగర్ సభలో మాట్లాడిన అక్బరుద్దీన్.. తమకు ఓటు వేయకున్నా ఫర్లేదు కానీ బీజేపీకి మాత్రం ఓటు వేయొద్దంటూ పలు వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా బీజేపీ అభ్యర్థి గెలుపొందిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ సందర్భంగా ఆయన నోటి నుంచి వివాదాస్పద వ్యాఖ్యలు వచ్చాయి. వీటికి సంబంధించిన క్లిప్పింగులు వైరల్ గా మారాయి. దీనిపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది.

అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై ఆగ్రహం చెందుతున్న పలువురు ఆయనపై పోలీసులకు కంప్లైంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే కరీంనగర్ సీపీ రియాక్ట్ అవుతూ.. కరీంనగర్ సభను తాము రికార్డు చేశామని.. దానిని నిపుణులైన అనువాదకులు చేత తెలుగులో అనువాదం చేయించామని.. చట్టవిరుద్ధంగా అక్బరుద్దీన్ వ్యాఖ్యలు లేవని.. ఆయనపై కేసులు నమోదు చేయాల్సిన అవసరం లేదంటూ తీర్పు ఇచ్చేశారు. కరీంనగర్ సీపీ కమలహాసన్ రెడ్డి వ్యాఖ్యలపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.

తాజా పరిణామాల నేపథ్యంలో అక్బరుద్దీన్ ఓవైసీ పై కేసు నమోదు చేయాలని.. ఆయన మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడారంటూ కరీంనగర్ బీజేపీ అధ్యక్షుడు బేతి మహేందర్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను పరిశీలించిన కోర్టు.. అక్బరుద్దీన్ మీద కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. కోర్టు తాజా ఆదేశాల నేపథ్యంలో రానున్న రోజుల్లో మరిన్ని కేసులు నమోదు అయ్యే అవకాశం ఉందంటున్నారు. మాట జారి.. లేని తిప్పలు తెచ్చుకోవటం ఎలానో అక్బరుద్దీన్ ను చూస్తే అర్థం కాక మానదు.
Tags:    

Similar News