యోగికి పెళ్లాం, పిల్ల‌లు ఉంటే... వాళ్ల క‌ష్టాలు తెలిసేవి

Update: 2022-02-11 02:30 GMT
ఉత్త‌ర‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నిక‌లు దేశ‌వ్యాప్తంగా ఆస‌క్తిని రేకెత్తిస్తున్న సంగ‌తి తెలిసిందే. అధికార బీజేపీ వ‌ర్సెస్ ఎస్పీ అన్న‌ట్లుగా సాగుతున్న ఈ ఎన్నిక‌ల్లో విమ‌ర్శ‌లు - ప్ర‌తి విమ‌ర్శ‌లు సైతం అదే రీతిలో ఉన్నాయి. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాద‌వ్ వార‌స‌త్వ రాజ‌కీయాల‌కు పెట్టింది పేరు అంటూ యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్ ఆరోపించారు. అయితే, వ్యాఖ్య‌ల‌ను ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాద‌వ్ తిప్పికొట్టారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

త‌న‌కు కుటుంబం ఉండ‌టం ప‌ట్ల గ‌ర్విస్తున్నాన‌ని, కుటుంబాన్ని వ‌దిలివేసి సంచీ త‌గిలించుకుని వెళ్లిపోయే వారం కాద‌ని యోగిని ఉద్దేశించి అఖిలేష్ ఎద్దేవా చేశారు. క‌రోనా లాక్‌డౌన్ స‌మ‌యంలో సీఎం యోగికి కుటుంబం ఉంటే వ‌ల‌స కూలీల క‌ష్టాలు తెలిసేవ‌ని అన్నారు. స్వ‌స్ధ‌లాల‌కు చేరుకునేందుకు కూలీలు కాలిన‌డ‌క‌న ప్ర‌యాణిస్తూ క‌ష్ట‌న‌ష్టాల‌కు గుర‌యిన విష‌యం గుర్తుచేశారు. యోగి సర్కార్ హ‌యాంలో అవినీతి రాజ్య‌మేలుతోంద‌ని అఖిలేష్ ఆరోపించారు. ల‌ఖింపూర్ ఖేరి ఘ‌ట‌న‌లో కేంద్ర మంత్రి కుమారుడు అజ‌య్‌ మిశ్రాకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయ‌డంపై అఖిలేష్ స్పందిస్తూ రైతుల మ‌ర‌ణాల‌కు కాషాయ పార్టీయే బాధ్య‌త వ‌హించాల‌ని అన్నారు. ల‌ఖింపూర్ ఖేరి ఘ‌ట‌న‌లో దోషుల‌ను శిక్షించ‌డంలో యోగి ఆదిత్యానాధ్ ప్ర‌భుత్వం ఘోరంగా విఫ‌ల‌మైంద‌ని ఆరోపించారు.

ఇదిలాఉండ‌గా, నేడు జ‌రిగిన తొలి ద‌శ పోలింగ్‌లో అక్క‌డక్క‌డ ఘ‌ర్ష‌ణ‌లు చోటుచేసుకున్నాయి. బోగ‌స్ ఓటింగ్ జ‌రుగుతోంద‌నే ఆరోప‌ణ‌ల‌తో ష‌మ్లి జిల్లాలో బీజేపీ, ఆర్జేడీ కార్య‌క‌ర్త‌లు బాహాబాహీకి దిగారు. పోలీసులు రంగంలోకి దిగి ఇరు పార్టీల కార్య‌క‌ర్త‌లను చెద‌రగొట్టారు. ఇక కొన్ని పోలింగ్ బూత్‌ల్లో ఈవీఎంలు మొరాయించ‌డంతో గంద‌ర‌గోళం నెల‌కొంది. ఈసీ అధికారులు స‌త్వ‌ర‌మే రంగంలోకి దిగి ప‌నిచేయ‌ని ఈవీఎంల స్ధానంలో కొత్త ఈవీఎంల‌ను అందుబాటులోకి తీసుకువ‌చ్చారు.
Tags:    

Similar News