పవన్ తోనే పోటీ...అలీ మాటల వెనక ....?

Update: 2023-01-17 14:37 GMT
టాలీవుడ్ స్టార్ కమెడియన్ అలీ వివాదరహితుడు అన్నది తెలిసిందే. ఆయన చిన్న వయసులోనే నటుడు అయ్యారు. నాలుగున్నర దశాబ్దాల  నటనానుభవం అలీ సొంతం. ఆయన హీరో నుంచి  కమెడియన్  గా ,  క్యారక్టర్ ఆరిస్టుగా చాలా పాత్రలు చేశారు. టీవీ షోలలో కూడా సూపర్ హిట్ అనిపించుకున్నారు. రాజకీయంగా తెలుగుదేశం పార్టీలో చేరి తన లక్ ని పరీక్షించుకున్నారు,  కానీ ఆయన ఎమ్మెల్యే కోరిక మాత్రం తీరలేదు.

అలా 2019లో వైసీపీలో చేరారు. అప్పట్లోనే పోటీ చేస్తారు అని అనుకున్నారు. కానీ టికెట్ ఆయనకు ఇవ్వలేకపోయారు. ఇక 2024లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అలీ అనుకుంటున్నారు. జగన్ అయితే ఆయన్ని ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. అలీకి ఈ పదవి దక్కడంతో ఆయన వైసీపీ నుంచే తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తారు అని అంతా అనుకుంటున్నారు.

అలీ సైతం జగన్ మళ్లీ సీఎం అంటున్నారు. తాజాగా చిత్తూరు జిల్లా నగరిలో అలీ మంత్రి రోజాతో కలసి ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేసారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ఆదేశిస్తే తాను జనసేనాని పవన్ కళ్యాణ్ మీద పోటీ చేస్తాను అని ప్రకటించి సంచలనం రేపారు. నిజానికి సినిమాల వరకూ చూస్తే అలీ పవన్ మంచి మిత్రులు.

పవన్ నటించిన ప్రతీ సినిమాలో అలీ ఉన్నారు. అలాంటిది ఇద్దరి మధ్య రాజకీయం చేరి దూరం చేసింది అని అంటున్నారు. ఇక అలీ కూతురు పెళ్ళికి కూడా పవన్ రాలేదు. దాంతో ఏదో ఉందని అనుకున్నారు. ఇపుడు అలీ పవన్ మీదనే పోటీ అంటున్నారు అంటే ఇక ఆ దూరం అలాగే కంటిన్యూ అవుతోంది అని అంటున్నారు. పవన్ మీద అలీ పోటీ అంటే అది నిజంగా సీరియస్ విషయమే.

అలీకి అంటూ ఒక సెక్షన్ ఆఫ్ ఫ్యాన్స్ ఉన్నారు. దానికి తోడు ఆయన సామాజికవర్గం, వైసీపీ ఓటు బ్యాంక్ దన్నూ ప్లస్ అవుతాయి. అదే టైం లో జనసేనానితో పోటీ అంటే బిగ్ టాస్క్ అని అంటున్నారు. ఇక్కడ గెలుపు ఎవరిది అన్నది ముఖ్యం కాదు కానీ ఇద్దరు మిత్రుల మధ్య పోటీ అన్నదే అంతా ఆలోచిస్తారు. కానీ అలీ చెప్పినట్లుగా ప్రతీ ఇంట్లోనే ఒకరు ఒక పార్టీలో ఉంటే మరొకరు మరో పార్టీలో ఉన్నారు.

అలా సినిమా నటుల మధ్య కూడా రాజకీయ పరంగా భేదాలు ఉంటాయి. సరే అలీ మీడియా అడిగిన దానికే జవాబు చెప్పారు కానీ జగన్ ఆదేశిస్తే పోటీకి రెడీ అని చెప్పారు అంటే దీని వెనక ఎవరున్నారు, ఎందుకు అలీ ఈ మాటలు అన్నారు అన్నది చర్చకు వస్తోంది. నిజంగా వైసీపీ హై కమాండ్ కి ఆ ఆలోచన ఉందా అని కూడా ఆలోచించే వారు ఉన్నారు.

అయితే వైసీపీలో అలీ ఉండడాన్ని ఇప్పటికే జీర్ణించుకోలేకపోతున్న జనసేన నేతలు కానీ క్యాడర్ కానీ తాజాగా అలీ వ్యాఖ్యల పట్ల ఎలా రియాక్ట్ అవుతుంది అన్నది చూడాలి. మరో వైపు ఎన్నికల్లో పోటీ చేయడానికి అలీ ఈ తరహా కామెంట్స్ చేయడం ద్వారా అధినాయకత్వం ముందు తన కోరిక వెల్లబుచ్చారు అని అంటున్నారు. సో అలీకి ఎన్నికల్లో టికెట్ ఇచ్చే ఆలోచన ఉందా ఉంటే అది పవన్ పోటీ చేస్తే ఆయన మీదకు పోటీకి ఉపయోగిస్తారా వంటి ప్రశ్నలను అలీ ప్రకటనలే కలుగచేశాయని అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News