ఎంపీ సీటుపై మాజీ డిప్యూటీ సీఎం కన్ను వేశారా?

Update: 2023-02-15 06:00 GMT
ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు, ఏలూరు ఎమ్మెల్యే అయిన ఆళ్ల నాని వచ్చే ఎన్నికల్లో ఏలూరు ఎంపీ స్థానం నుంచి పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారని టాక్‌ నడుస్తోంది. వైఎస్‌ జగన్‌ మొదటి విడత మంత్రివర్గ విస్తరణలో ఆళ్ల నాని డిప్యూటీ సీఎంగా పదవి దక్కించుకున్నారు. డిప్యూటీ సీఎం హోదాతో ఆయనకు కీలకమైన వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా అవకాశం దక్కింది. కోవిడ్‌ సమయంలో ఆళ్ల నాని బాగా పనిచేశారనే పేరు తెచ్చుకున్నారు. అయినా జగన్‌ రెండో విడత మంత్రివర్గ విస్తరణలో ఆళ్ల నానికి పదవి పోయింది. ఆళ్ల నాని స్థానంలో పశ్చిమ గోదావరి జిల్లాకే చెందిన కొట్టు సత్యనారాయణకు డిప్యూటీ సీఎం పదవి దక్కింది.

మరోవైపు తనకు మంత్రి పదవి పోయినప్పటి నుంచి ఆళ్ల నాని కూడా అసంతృప్తిగా ఉన్నారని వార్తలు వచ్చాయి. జనసేనాని పవన్‌ కల్యాణ్‌ పైన, ప్రతిపక్ష నేత చంద్రబాబుపైన ఆయన గతంలో విమర్శలు చేసేవారు. అయితే అది కూడా మిగతా వైసీపీ నేతల్లా కాకుండా మంచి భాషనే ఉపయోగించేవారు.

అయితే మంత్రి పదవి పోయిన దగ్గర నుంచి ఆళ్ల నాని అసలు వార్తల్లో కనిపించడం మానేశారు. మరోవైపు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సరిగా నిర్వహించిన ఎమ్మెల్యేల్లో ఆళ్ల నాని కూడా ఉన్నారని.. ఈ కార్యక్రమంలో తొలి నాళ్లలోనే సీఎం జగన్‌ హెచ్చరించినట్టు వార్తలు వచ్చాయి.

ఏది ఏమైతేనేం ఆళ్ల నాని గతంలో మాదిరిగా చురుకుగా లేరు. ఆయనకు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఇష్టం లేదని టాక్‌ నడుస్తోంది. ఏలూరు ఎంపీగా పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారని అంటున్నారు. మరోవైపు ఏలూరు ఎంపీగా వెలమ సామాజికవర్గానికి చెందిన కోటగిరి శ్రీధర్‌ ఉన్నారు. వాస్తవానికి ఏలూరు పార్లమెంటరీ పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో కాపు సామాజికవర్గానిదే ఆధిపత్యం. అయితే కులాల ఈక్వేషన్స్‌ లో భాగంగా గత ఎన్నికల్లో కోటగిరి శ్రీధర్‌ కు జగన్‌ సీటు ఇచ్చారు.

అయితే ఈసారి మాత్రం ఆళ్ల నాని ఏలూరు సీటును తనకు కేటాయించాలని పట్టుబడుతున్నట్టు సమాచారం. కోటగిరి శ్రీధర్‌ ఉంగుటూరు లేదా ఏలూరు నుంచి అసెంబ్లీకి పోటీ చేయించాలని నాని కోరినట్టు తెలుస్తోంది. మరోవైపు కోటగిరి శ్రీధర్‌ కూడా అసెంబ్లీకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు. వైసీపీ మరోమారు అధికారంలోకి వస్తే సామాజిక సమీకరణాల్లో భాగంగా మంత్రి పదవి దక్కించుకోవాలనేది శ్రీధర్‌ లక్ష్యమని అంటున్నారు.

మరోవైపు ఏలూరు నియోజకవర్గంలో టీడీపీ, జనసేన పార్టీల ప్రభావం కూడా గట్టిగానే ఉంది. ఈ నేపథ్యంలో తాను వైసీపీ తరఫున అసెంబ్లీకి నెగ్గడం కష్టమనే భావనలో ఆళ్ల నాని ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. 1999లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఓడిపోయిన ఆళ్ల నాని 2004లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. మరోమారు 2009లోనూ విజయం సాధించారు. 2014లో వైసీపీ తరఫున బరిలోకి దిగి టీడీపీ అభ్యర్థి బడేటి బుజ్జి చేతిలో ఓడిపోయారు. 2019లో మళ్లీ విజయ బావుటా ఎగురవేశారు. ఈ నేపథ్యంలో ఆళ్ల నాని ఏలూరు లోక్‌ సభ స్థానం నుంచి పోటీ చేయొచ్చని చెబుతున్నారు.

Similar News