పొత్తుల మాధమెటిక్స్ : 40 ప్లస్ 6 ప్లస్ 6 ప్లస్ ఈజ్  ఈక్వల్ టూ 52

Update: 2023-01-16 04:31 GMT
రాజకీయ గణితం నేర్చుకోవడం కష్టం. అసలు అవగాహన చేసుకోవడం బహు కష్టం. మామూలు మాధమెటిక్స్ లో రెండు రెండు కలిస్తే నాలుగు అని కచ్చితంగా చెప్పవచ్చు. కానీ పొత్తుల విషయంలో మాత్రం నాలుగు ఆరు కూడా కావచ్చు. లేదా ఒకటికి పడిపోవచ్చు. దేశమంతా ఇపుడు పొత్తుల కధ సాగుతోంది. అందులో కొన్ని సక్సెస్ అవుతున్నాయి, మరి కొన్ని ఫెయిల్ అవుతున్నాయి.

ఇటీవల ఉత్తరప్రదేశ్ లో పొత్తులు పెట్టుకున్న పార్టీలు చిత్తు అయ్యాయి. బీజేపీ రెండవసారి గెలిచింది. ఏపీలో చూస్తే విపక్షాల ఓట్లు 2019లో చీలిపోయినా జనాలు ముందే డిసైడ్ కావడంతో జగన్ కే గురి చూసి మరీ ఓటేసి పట్టం కట్టారు. దాని కంటే ముందు 2018లో తెలంగాణాలో జరిగిన ఎన్నికల్లో టీయారెస్ ఒక వైపు ఉంటే కాంగ్రెస్ కామ్రేడ్స్, తెలుగుదేశం అన్నీ కలసి మరో వైపు నిలబడ్డాయి.

కానీ చివరికి ఫలితం టీయారెస్ కే అనుకూలంగా వచ్చింది. పొత్తు పార్టీలన్నీ చిత్తు అయ్యాయి. ఇక ఇంకాస్తా ముందుకు వెళ్తే 2009లో మహాకూటమి పేరిట  ఉమ్మడి ఏపీలో తెలుగుదేశం పెద్దన్నగా ఏర్పాటు చేసిన వేదిక కానీ ప్రయోగం కానీ విఫలం అయ్యాయి. దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు విపక్షాలు అన్నీ కూటములు కట్టినా ఒకటి రెండు సార్లు తప్ప చాలా సార్లు ఫెయిల్ అయ్యాయి.

ఇపుడు దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలు కూటమి కట్టాలని అనుకుంటున్నాయి. కానీ అది ఎంతమేర సక్సెస్ సాధిస్తుందో తెలియాలి. ఇంతకీ పొత్తులు ఎపుడు సక్సెస్ అవుతాయి అంటే అధికార పార్టీ మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నపుడు. అదే టైం లో విపక్ష కూటమి మీద విశ్వాసం ఉన్నపుడు. అవకాశవాద పొత్తులను జనాలు ఎపుడూ సమర్ధించిన దాఖలాలు లేవు.

అదే సందర్భంలో పెట్టుకున్న పొత్తులకు ఒక సార్ధకత ఉండాలి. ఒక అజెండా ఉమ్మడిగా ఉండాలి. వర్తమాన ప్రభుత్వం కంటే గొప్పగా తాము పాలిస్తామని జనాలకు నమ్మకం కలిగించాలి. అపుడే పొత్తులు హిట్ అవుతాయి. ఆలాగే పొత్తు పార్టీల మధ్య కూడా పరస్పర విశ్వాసం ఉండాలి. ఒకరి ఓట్లు మరొకరికి బదిలీ అవాలి. ఇలా చాలా అంశాలు పొత్తుల విషయంలో పనిచేస్తాయి.

అందుకే రెండు రెళ్ళు నాలుగు అని గణితంలో చెప్పినంత సులువు కాదు రాజకీయ గణితంలో లెక్కలు కూర్చడం. ఇకపోతే ఏపీలో మహా కూటమి టైపులో ఒక వేదికను ఏర్పాటు చేయడానికి తెలుగుదేశం చూస్తోంది. లెక్కలు పక్కగా వేసుకునే బరిలోకి దిగుతోంది. ఎలా అంటే 2019లో వైసీపీకి 50 శాతం ఓట్ల షేర్ వచ్చింది. దాని అధిగమించాలి అంటే పొత్తులే శరణ్యం అని అన్ని పార్టీలూ భావిస్తున్నాయి.

అదెలా అంటే 2019లో తెలుగుదేశానికి 40 శాతం ఓట్ల షేర్ వచ్చింది. జనసేనకు 6 శాతం వచ్చింది. ఇక అయితే బీజేపీతో లేకపోతే కామ్రేడ్స్ తో వెళ్లాలని చూస్తున్నారు. వారికి ఒకటి రెండు శాతం ఓట్లు కలుస్తాయి. ఇక నాలుగైదు శాతం ప్రస్తుత ప్రభుత్వం మీద యాంటీ ఇంకెంబెన్సీ ఉంటుంది అని అంచనా అంటే టోటల్ గా 52 శాతం పై దాటి ఓట్ల షేర్ తాము సాధిస్తామని వైసీపీ ఏ  45 శాతం వద్దనో ఆగిపోతుందని పొత్తుల మాధమెటిక్స్ చెబుతోంది అంటున్నారు.

ఇదంతా బాగానే ఉన్నా కలవకముందు ఓట్ల శాతం ఒకలా ఉంటుంది. కలిసిన తరువాత మరోలా మారవచ్చు. అలాగే 2019 నుంచి 2024 మధ్యలో మారిన పరిణామాల వల్ల యాంటీ ఇంకెంబెన్సీ విపక్షానికీ ఎంతో కొంత ఉండొచ్చు. ఓట్ల బదిలీ వ్యవహారం కూడా చూడాలి అన్నింటికీ మించి ఒక బహు చక్కని ఉమ్మడి అజెండాతో విపక్ష కూటమి రావాలి. దానికంటే ముందు అధికార పక్షం మీద బీభత్సమైన వ్యతిరేకత ఉండాలి. మరి ఇవన్నీ కలిస్తే ఏపీలో 2024లో ప్రభుత్వం మారడం తధ్యం.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News