ఈ సారి వినూత్నంగా, విభిన్నంగా అమ‌రావ‌తి రైతులు మ‌హా పాద‌యాత్ర 2.0!

Update: 2022-08-19 05:40 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధానిగా అమ‌రావ‌తినే కొన‌సాగించాల‌ని కోరుతూ అమ‌రావ‌తి ప్రాంత రాజ‌ధాని రైతులు 975 రోజుల నుంచి వివిధ రూపాల్లో నిర‌స‌న‌లు, ఆందోళ‌న‌లు, ఉద్య‌మాలు కొన‌సాగిస్తున్న తెలిసిందే. ఏపీ రాజ‌ధానిగా అమ‌రావ‌తి మాత్ర‌మే ఉండాలంటూ.. ఇప్ప‌టికే న్యాయ‌స్థానం నుంచి దేవ‌స్థానం వ‌ర‌కు అంటూ అమ‌రావ‌తి రైతులు హైకోర్టు నుంచి తిరుప‌తి వ‌ర‌కు పాద‌యాత్ర చేశారు.

ఈ  యాత్ర‌కు ప్ర‌తిప‌క్ష పార్టీలు టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ కూడా మ‌ద్ద‌తివ్వ‌డంతోపాటు ఆ యాత్ర‌లో కూడా పాల్గొన్న సంగ‌తి తెలిసిందే. అయినా జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో ఉలుకుప‌లుకు లేక‌పోవ‌డంతో మ‌రోమారు భారీ పాద‌యాత్ర‌కు అమ‌రావ‌తి రైతులు శ్రీకారం చుట్టాల‌ని నిర్ణ‌యించారు.

ఈసారి అసెంబ్లీ నుంచి అర‌స‌వ‌ల్లి వ‌ర‌కు భారీ పాద‌యాత్ర చేప‌ట్ట‌నున్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండ‌లంలో ఉన్న శాస‌న‌స‌భ నుంచి శ్రీకాకుళం జిల్లాలో ప్ర‌ముఖ సూర్య దేవాల‌యం అర‌స‌వ‌ల్లి వ‌ర‌కు భారీ పాద‌యాత్ర చేప‌ట్టి త‌మ నిర‌స‌న‌ను జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి తెలియ‌జేయాల‌నే ఉద్దేశంతో ఉన్నారు.ఇందుకు సెప్టెంబర్ 12ను ముహూర్తంగా నిర్ణ‌యించుకున్నారు. సెప్టెంబ‌ర్ 12 నాటికి అమరావతి రైతుల  ఉద్యమానికి వెయ్యి రోజులు పూర్తవుతుంది.

ఈ నేప‌థ్యంలో రాజ‌ధానికి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ శంకుస్థాప‌న చేసిన‌ మందడంలో యజ్ఞం చేసి రైతులు త‌మ పాదయాత్రను ప్రారంభించ‌నున్నారు. అసెంబ్లీ నుంచి అర‌స‌వ‌ల్లి వ‌ర‌కు జ‌రిగే పాద‌యాత్ర‌ సుమారు 60 రోజులు.. అంటే రెండు నెల‌లు కొన‌సాగుతుంద‌ని స‌మాచారం. ఇంత‌కు ముందు చేప‌ట్టిన న్యాయ‌స్థానం నుంచి దేవ‌స్థానం వ‌ర‌కు పాద‌యాత్ర‌ను 44 రోజుల‌పాటు రైతులు చేశారు.  

అమ‌రావ‌తి రైతుల మ‌హా పాద‌యాత్ర 2.0 ఆరు జిల్లాల గుండా 65 రోజుల పాటు సాగుతుందని అమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణ స‌మితి ప్రకటించింది. పాదయాత్ర రూట్‌మ్యాప్‌ను త్వరలో ఖరారు చేస్తామని, దీనిని డీజీపీ కార్యాలయంలో సమర్పించి అనుమతి కోరతామని నేత‌లు తెలిపారు. ప్రభుత్వ స్పందనను బట్టి హైకోర్టును ఆశ్రయించాలో, లేదో నిర్ణయిస్తామన్నారు.

కాగా మ‌హా పాద‌యాత్ర‌కు అమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణ స‌మితి డిజిట‌ల్ ప‌ద్ధ‌తుల‌ను ఎంచుకుంటోంది. క్యూఆర్‌ కోడ్‌ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకునే ప్రక్రియను తెస్తోంది. ఈ క్యూఆర్ కోడ్‌ను మొబైల్‌తో స్కాన్‌ చేస్తే.. రాజ‌ధాని ఐక్య‌కార్యాచ‌ర‌ణ స‌మితి వెబ్‌సైట్‌లోకి వెళ్తుంద‌ని చెబుతున్నారు. పాద‌యాత్ర‌లో పాల్గొనాల‌నుకునేవారు ఆ వెబ్‌సైటులో ఉన్న రిజిస్ట్రేషన్‌ ఫారంలో వివరాలను నింపాల్సి ఉంటుంది. ఎప్పుడు, ఎన్నిరోజులు పాదయాత్రలో పాల్గొంటారన్న వివరాలు నమోదు చేస్తే.. దీని ఆధారంగా ఐక్య‌కార్యాచ‌ర‌ణ స‌మితి ప్ర‌తినిధులు ఆయా రోజుల్లో వారికి వసతి సౌకర్యాలు కల్పిస్తార‌ని చెబుతున్నారు.
Tags:    

Similar News