ఆ పెద్దాయ‌న మోడీపై మ‌ళ్లీ ఫైర‌య్యారు

Update: 2017-01-01 07:59 GMT
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీపై ఆర్థికశాస్త్రంలో నోబెల్‌ గ్రహీత అమర్త్యసేన్ మ‌రోమారు అసంతృప్తి వ్య‌క్తం చేశారు. పాత పెద్ద నోట్ల రద్దు నిర్ణయం అన్ని కోణాల నుంచీ ఆలోచించి తీసుకున్న నిర్ణయంగా కనిపించడంలేదని పెద‌వి విరిచారు. ఈ నిర్ణ‌యం తొందరపాటు చర్య అంటూ అమర్త్యసేన్‌ మరోసారి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. నిర్ణయం తర్వాత ఉత్పన్నమయ్యే పరిస్థితుల పట్ల ముందస్తుగా కసరత్తు చేయకపోవడం వల్ల దేశ ప్రజలు కఠినమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని సేన్‌ గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ అతిపెద్ద నిర్ణయంపై ఏం మాట్లాడినా అది మరో విధంగా వెళ్తుందని ఆయన అన్నారు.

"ఎవరైనా ఒకరిని పెద్ద నోట్ల రద్దును మీరు వ్యతిరేకిస్తున్నారా? సమర్థిస్తున్నారా? అని అడిగారనుకోండి..వారు వ్యతిరేకిస్తున్నామని చెబితే, అవతలి వ్యక్తి వెంటనే మీరు అవినీతిని సమర్థిస్తున్నారా? అంటూ మరో ప్రశ్న వేస్తారు. అవినీతిని సమర్థించనని చెబితే..అయితే, మీరు పెద్ద నోట్ల రద్దును సమర్థించాలి కదా అంటారు. ఇదంతా అర్థరహితమైన చర్చకు దారితీస్తుంది" అంటూ అమర్త్యసేన్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్థికంగా ముందు వరుసలో ఉన్న దేశాలేవీ పూర్తిగా నగదు రహితం కాలేదంటూ..అమెరికా - ఫ్రాన్స్‌ - ఇంగ్లాండ్‌-  రష్యా - చైనా - జపాన్‌ దేశాలను ఆయన ఉదహరించారు. అయితే, మన దేశానికి సంబంధించి నగదు రహితం ఎంత శాతం వరకు ఆచరణలో సాధ్యమనేది ఇప్పుడే చెప్పడం సరైంది కాదని భావిస్తున్నానన్నారు. తన జీవితమంతా ఆర్థిక విషయాలపై పరిశోధనల కోసం కృషి చేసిన 83 ఏళ్ల‌ సేన్‌ ఇంగ్లాండ్‌ - అమెరికాల్లోని ప్రముఖ విశ్వ విద్యాలయాల్లో బోధించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News