అవినీతికి ఆధార్‌ కార్డు చంద్రబాబు

Update: 2017-07-10 08:07 GMT
వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీపై అధికార తెలుగుదేశం పార్టీ నేత‌లు - మంత్రులు విమ‌ర్శ‌లు చేయ‌డంపై ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ధీటుగా తిప్పికొట్టారు. గుంటూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అంబటి మీడియాతో మాట్లాడుతూ...ప్లీనరీ విజయవంతం అవ‌డంపై టీడీపీ నేతలు చేసిన ఆరోపణలపై ఆయన మండిపడ్డారు. త‌మ‌పై అవినీతి ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని అయితే  తెలుగుదేశం పార్టీ నాయ‌కుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతికి ఆధార్‌ కార్డు లాంటి వాడని అంబ‌టి ఎద్దేవా చేశారు. వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీ విజయవంతాన్ని తట్టుకోలేక చంద్రబాబు - ఆయన మంత్రుల వెన్నులో వణుకుపుట్టిందన్నారు.

ప్లీనరీకి వచ్చిన జనసంద్రాన్ని చూసి తెలుగుదేశం పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని, బాబు భవిష్యత్తు ఏమవుతుందోనని గాబరాపడుతున్నారని అంబ‌టి ఎద్దేవా చేశారు. మంత్రులు యనమల - పరిటాల సునీత - దేవినేని ఉమ - జవహర్ - సోమిరెడ్డి - ప్రత్తిపాటి పుల్లారావులు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ 9 కార్యక్రమాలు - ఇతరత్రా ప్రకటనలు చూసిన తరువాత తెలుగుదేశం పార్టీ మహానాడు గురించి ప్రజలు మాట్లాడుకోవడం లేదని అంబ‌టి రాంబాబు అన్నారు. టీడీపీ మహానాడులో పాకశాస్త్ర యోధులను తీసుకొచ్చి పంచభక్ష పరమాన్నాలు వండి పెడితే భోజనం చేసి ఎవరి దారిన వారు వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. తాము కూడా భోజనాలు ఏర్పాటు చేశామ‌ని.... కష్టపడి ప్లీనరీకి వచ్చిన కార్యకర్తలకు ఆకలి తీర్చేందుకు అన్నం వండిపెట్టామన్నారు. సాదారణ భోజనం పెడితేనే విజయం సాధించారని టీడీపీ నేతలు అక్కసు వెల్లగక్కుతున్నారని మండిప‌డ్డారు.

అవినీతి గురించి ఏపీ మంత్రుల వ్యాఖ్య‌లు చూస్తే న‌వ్వు వ‌స్తోంద‌ని అంబ‌టి అన్నారు. తెలుగుదేశం పార్టీ అవినీతిని నిరూపించండి అని ఉప ముఖ్య‌మంత్రి కేఈ కృష్ణమూర్తి మాట్లాడడం విడ్డూరంగా ఉందని అంబటి అన్నారు. ఆధారాలతో సహా చంద్రబాబు అవినీతి చక్రవర్తి పుస్తకంలో పొందుపర్చామని, వీటిపై చర్చకు వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సిద్ధంగా ఉందని అంబటి స్పష్టం చేశారు. జ్యుడీషియల్‌ ఎంక్వైరీ వేసే మీకుందా అని కేఈని ప్రశ్నించారు. మీరెంత అవినీతికి పాల్పడ్డారో అర్థం కాకపోతే ఈ పుసక్తం పంపిస్తాం.. చర్చకు సిద్ధమా అని సవాలు విసిరారు. లేదంటే ఎంక్వైరీ వేయండి నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. అవినీతి సొమ్ముతో కార్యక్రమాలు చేసేది చంద్రబాబు తప్ప మరెవరూ కాదన్నారు. చంద్రబాబు అవినీతిపై ఎడిషన్ల వారిగా చంద్రబాబు అవినీతి చక్రవర్తి అనే పేరుతో పుస్తకాలు విడుదల చేయడం జరిగిందన్నారు. మొదటగా రూ. 1,49,549 కోట్ల అవినీతి - తరువాత మూడేళ్ల పరిపాలనపై మరో ఎడిషన్‌ రూ. 3,75,008 కోట్ల అవినీతికి పాల్పడినట్లు ఆధారాలతో సహా పుస్తకం ముద్రించామన్నారు. చంద్రబాబు అవినీతి చక్రవర్తిగా పేరు పొందడమే కాకుండా ఎన్‌సీఏఈఆర్‌ అనే సంస్థ సర్వే చేస్తే దేశంలో ఏపీ నెంబర్‌ వన్‌ అవినీతి రాష్ట్రమని చెప్పారన్నారు. అయిన‌ప్ప‌టికీ త‌మ‌పై విమ‌ర్శ‌లు చేయ‌డం చిత్రంగా ఉంద‌ని అంబ‌టి అన్నారు.

వైఎస్‌ జగన్‌ జైలుకుపోతే కానీ మనకు మనుగడ లేదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారన్నారని అంబ‌టి ఆరోపించారు. వైఎస్‌ జగన్‌ జనం మధ్య ఉంటే టీడీపీ నామరూపాలు లేకుండా పోతుందనే భయం పట్టుకుందన్నారు. అందుకే వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్లీనరీలో ప్రకటించిన 9 హామీలు చూసి తెలుగుదేశం పార్టీ నేతలు వణికిపోతున్నారని అంబటి విమర్శించారు. రాష్ట్రం మొత్తం వైఎస్‌ జగన్‌ హామీలపై చర్చించుకుంటున్నారన్నారు. తండ్రిని మించిన తనయుడిలా.. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు వయా తిరుపతి వెంకన్నను దర్శించుకొని 3 వేల కిలోమీటర్ల పాదయాత్రకు శ్రీకారం చుట్టారన్నారు. పాదయాత్రతో తెలుగుదేశం కుసాలు కదిలే పరిస్థితి ఏర్పడిందన్నారు. ``ఇంటలిజెన్స్‌ రిపోర్టు చూసిన తరువాత చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ నేతలు కళ్లు బైర్లు కమ్మాయి. రైతుల భరోసా కోసం, మహిళల ఆసరా కోసం అనేక కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయిన తరువాత ఇవన్నీ చేసి చూపుతాం.. దివంగత మహానేత డాక్టర్ వైఎస్‌ రాజశేఖరరెడ్డి పరిపాలన మళ్లీ తీసుకొస్తాం` అని చెప్పిన మాటలు ఎక్కడ చూసినా చర్చించుకుంటున్నారని అంబ‌టి అన్నారు. రాష్ట్రంలో దశల వారిగా మద్యం నిషేధం అమ‌లు చేయడానికి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫు కంకణం కట్టుకున్నామని అంబ‌టి తెలిపారు. ఎన్టీఆర్‌ మద్యం నిషేదం తీసుకువస్తే చంద్రబాబు దానికి తూట్లు పొడిచి. గల్లీకో బాబు ఇంటికో బీరు సిద్ధాంతంతో మద్యాన్ని ఏరులై పారిస్తున్నాడని మండిపడ్డారు.
Tags:    

Similar News