పిచ్చెక్కే పిల్లల్ని కనమంటున్నారట..

Update: 2015-01-20 17:29 GMT
పిల్లల్ని కనండంటూ కొత్త పిలుపునిచ్చిన చంద్రబాబు విమర్శలనెదుర్కొంటున్నారు. ఒకరు ముద్ద ఇద్దరు హద్దు నినాదానికి ముగింపు పలకమని... హద్దులు చెరిపేయమని చంద్రబాబు పిలుపునిచ్చిన సంగతి తెలసిందే. దీనిపై ఇప్పటికే అన్ని వర్గాల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. తాజాగా వైసీపీ మాటల పెట్టె అంబటి రాంబాబు తనదైన స్టైల్లో పదునైన విమర్శలు కురిపించారు. సురభి నాటక కళాకారుల్లా మంచి డ్రామాతో మాట్లాడే అంబటి రాంబాబు యువ దంపతుల భవిష్యత్తులను చిందరవందర చేయడానికే చంద్రబాబు ఇలా ఎక్కువ మంది పిల్లలను కనమంటున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. అంతేకాదు, సీఎంకు మతి భ్రమించిందని కూడా అనేశారు.

    సీఎం పదవిలో ఉన్న చంద్రబాబు ఇలా జాతీయ కార్యక్రమమైన కుటుంబ నియంత్రణకు వ్యతిరేకంగా మాట్లాడడం తగదని అంబటి సూచనలు చేస్తున్నారు. ఏపీని అధోగతి పాలుజేయడానికే చంద్రబాబు కంకణం కట్టుకున్నట్లుగా కనిపిస్తుందని అంటున్నారు. చంద్రబాబు యథాలాపంగా అన్నారో ఆలోచించే అన్నారో కానీ ఆయన వ్యాఖ్యలపై సొంత పార్టీ నుంచి కూడా విమర్శలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలుంటే ఎన్నికల్లో పోటీ విషయంలో ఇబ్బందులున్న విషయం తెలిసిందే. దీంతో యువ రాజకీయ నేతలు ఎలా స్పందిస్తారో... అసలు దీనిపై చంద్రబాబు విధానమేమిటో కూడా పూర్తిగా స్పష్టం కావాల్సి ఉంది.
Tags:    

Similar News