అంబేద్కర్ ను వెలివాడలో పెడుతున్న చంద్రబాబు?

Update: 2017-09-20 04:27 GMT
దళితులను అనాదిగా సమాజం వెలివాడల్లోనే ఉంచుతోంది. పల్లెల్లో దళితవాడలు ఊరికి దూరంగా సెపరేటుగానే ఉంటుంటాయి. ప్రభుత్వాలు కూడా వారికి పక్కాఇళ్లు కట్టినా.. మరొకటి చేసినా.. అదే వాడ దాటి వారిని రానివ్వకుండా చేస్తుంటుందే తప్ప.. సమాజంలో భాగంగా కలిసిపోనివ్వదు. అంటరానితనం రూపుమాసిపోవాలని ఎన్ని కలలు కంటున్నా, ఎన్ని మాటలు చెబుతున్నా.. మన సమాజంలో వెలివాడల సంస్కృతి అలాగే కొనసాగుతోంది. ప్రధానమైన ఊరికి దూరంగానే వారిని ఉంచడం జరుగుతోంది. ఇప్పుడు అమరావతి నగరం విషయంలోనూ చంద్రబాబు అదే పని చేస్తున్నట్లున్నారు. ఏకంగా అంబేద్కర్ నే ఆయన వెలివాడలో ఉంచినట్లుగా అమరావతి నగరానికి వెలుపల.. స్మృతివనం నిర్మించి అక్కడ ప్రతిష్టించాలన్నట్లుగా ప్లాన్ చేయడం దళిత వర్గాల్లో అసంతృప్తికి కారణమవుతోంది.

ఒకవైపు విద్యా వైద్య సంస్థలకు వందల వందల ఎకరాలను అమరావతి రాజధాని నగర పరిధిలోనే చంద్రబాబునాయుడు కట్టబెట్టేస్తున్నారు. అదే అంబేద్కర్ స్మృతివనం, విగ్రహం ఏర్పాటు విషయానికి వచ్చేనరికి అమరావతి నగరంలో స్థలం దొరకకుండా పోయిందా అనే విమర్శలు వస్తున్నాయి. అంబేద్కర్ స్మృతివనాన్ని 20 ఎకరాల్లోనిర్మించడానికి, 125 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్టించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ పనులను అన్నింటినీ ఏడాదిలోగా పూర్తిచేసేస్తాం అని మంత్రి అంటున్నారు. అయితే అంబేద్కర్ కోసం కేటాయించిన స్థలం విషయంలోనే కొత్త వివాదం రేగుతోంది.

విభజన తర్వాత.. రెండు తెలుగు రాష్ట్రాలు ఒకరిని చూసి ఒకరు నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్న సంగతి చాలా అంశాల్లో రూఢి అయింది. తెలంగాణలో కేసీఆర్ ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపించడానికి సంకల్పించారు. దాన్ని అనుసరించిన చంద్రబాబు తాము కూడా అతిపెద్దదైన 125 అడుగుల విగ్రహం పెడతాం అని ప్రకటించారు. దీనికి 100 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు కూడా చెప్పారు. ఇప్పుడు దీనిపై ఒక సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో స్థల ఎంపిక పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

చంద్రబాబునాయుడు చాలా ఆర్భాటంగా అంబేద్కర్ విగ్రహ ఏర్పాటును ప్రకటించి.. తనే విమర్శలను ఆహ్వానించుకున్నట్లుగా పరిస్థితి తయారవుతున్నదేమో అని పలువురు అనుకుంటున్నారు.
Tags:    

Similar News