బైడెన్ ఎగరేస్తున్న‌ అగ్ర‌బావుటా!

Update: 2021-05-20 00:30 GMT
ఆధిప‌త్యం మెజారిటీ ల‌క్ష‌ణం. దాన్ని కాపాడుకునేందుకు ఎన్నో ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. మ‌రెన్నో ఎత్తులు వేస్తుంటారు. మ‌నుషుల మ‌ధ్య‌నే ఈ ప‌రిస్థితి ఉన్న‌ప్పుడు.. దేశాల మ‌ధ్య ఇంకెలా ఉంటుందనేది ఊహించ‌డం పెద్ద క‌ష్ట‌మేమీ కాదు. ఎలా ఎదిగింది అన్న చారిత్ర‌క కార‌ణాల‌ను ప‌క్క‌న‌బెడితే.. ప్ర‌పంచంలో అగ్ర‌రాజ్యంగా ఎదిగింది అమెరికా. దాదాపు ద‌శాబ్ద కాలం క్రితం వ‌ర‌కూ దాని హ‌వా కొన‌సాగింది. ప్ర‌పంచంలో చాలా చోట్ల ఆ దేశం ప్ర‌యోజ‌నాలు నెర‌వేరే విధంగానే నిర్ణ‌యాలు జ‌రిగేవి అన్న‌ది స‌త్య‌దూర‌మేమీ కాదు.

అయితే.. కాలం ఎప్పుడూ ఒకేలా సాగ‌దు. అమెరికాకు ధీటుగా చైనా స‌ర్రున‌ దూసుకొచ్చింది. ప్ర‌పంచాన్ని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తూ అనిత‌ర‌సాధ్య‌మైన‌ జీడీపీని న‌మోదు చూస్తూ అమెరికాకు స‌వాల్ గా నిలిచింది. నిలుస్తోంది. దీంతో.. పెద్ద‌న్న త‌న పీఠాన్ని కాపాడుకోవాల్సిన అవ‌సరం వ‌చ్చేసింది. అయితే.. ట్రంప్ కొనసాగిన కాలమంతా కాస్త భిన్నంగా సాగింది. సొంత దేశానికి మాత్ర‌మే మేలు చేసే నిర్ణ‌యాలు తీసుకుంటూ.. లౌక్యాన్ని ప్ర‌ద‌ర్శించ‌లేద‌ని చెప్పొచ్చు. లౌక్యం లేక‌పోవ‌డంతో ప్ర‌జ‌ల ప్రేమ‌కూడా పొంద‌లేక‌పోయాడ‌న్న‌ది వేరే సంగ‌తి.

ఇప్పుడు బైడెన్ వ‌చ్చాక మ‌ళ్లీ పాత అమెరికాను ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేయ‌డానికి త‌హ‌త‌హ‌లాడుతున్నారు. పాత అధ్య‌క్షుల మాదిరిగానే ప్ర‌పంచం ముందు లౌక్యాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నారు. త‌ద్వారా.. అగ్ర‌దేశం నేమ్ ప్లేట్ పై పేరుకుపోయిన దుమ్మును దులిపేందుకు ట్రై చేస్తున్నారు. ఇటీవ‌ల తీసుకున్న రెండు నిర్ణ‌యాల‌నే ఇందుకు సాక్ష్యాలుగా తీసుకోవ‌చ్చు.

క‌రోనా నేప‌థ్యంలో 8 కోట్ల వ్యాక్సిన్ డోసుల‌ను ప‌లు దేశాల‌కు పంపిణీ చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు బైడెన్‌. చిన్న‌వాళ్ల‌కు స‌హాయం చేసిన‌ప్పుడే క‌దా.. పెద్ద‌న్న అనే గుర్తింపు వ‌చ్చేది? కాబట్టి.. ఈ దిశ‌గా వ్యాక్సిన్ స‌ర‌ఫ‌రాను ఎంచుకున్నారు. 33 మూడు కోట్ల జ‌నాభా ఉన్న అమెరికాలో ఇప్ప‌టికే 180 మిలియ‌న్ల మందికిపైగా వ్యాక్సిన్ వేసేశారు. ఇక‌, మిగిలింది కొద్ది మంది మాత్ర‌మే. కాబ‌ట్టి.. వ్యాక్సిన్ స‌ర‌ఫ‌రాకు అంతగా ఇబ్బందులు ఎదుర‌య్యే అవ‌కాశం లేదు. మొత్తానికి వ్యాక్సిన్ అందిస్తామ‌ని చెప్పి.. ప్ర‌పంచం మ‌న‌సు గెలుచుకునే ప్ర‌య‌త్నం చేశారు.

అదే స‌మ‌యంలో.. త‌నలోని అస‌లైన కోణాన్ని కూడా చూపించారు. ఇజ్రాయిల్ - పాలస్తీనా మధ్య దాదాపు ఏడేళ్ల త‌ర్వాత భీక‌ర యుద్ధం సాగుతోంది. ద‌శాబ్దాలుగా ఎడ‌తెగ‌కుండా ఈ పోరాటం సాగుతూనే ఉంది. యాస‌ర్ అరాఫత్ మ‌ర‌ణం త‌ర్వాత పాల‌స్తీనా వాణిని అంత‌ర్జాతీయ వేదిక‌ల మీద వినిపించే స‌మ‌ర్థ నేత క‌రువ‌య్యారు. ఇక‌, ఇజ్రాయిల్ బ‌లం ముందు పాల‌స్తీనా నామ‌మాత్ర‌మేన‌న్న‌ది బ‌హిరంగ ర‌హ‌స్య‌మే. ఈ పంచాయితీకి పెద్ద మ‌నిషిలా వ్య‌వ‌హ‌రించేందుకు ముందుకు వ‌చ్చిన బైడెన్‌.. త్రాసులో ఇజ్రాయిల్ వైపే కాస్త మొగ్గు చూపే ప్ర‌య‌త్నం చేశారు.

అంతేకాదు.. ఇరు దేశాల మ‌ధ్య శాంతి నెల‌కొనాల‌ని చెబుతూనే.. ఇజ్రాయిల్ కు ఏకంగా 735 మిలియ‌న్ల విలువైన ఆయుధాల‌ను స‌ర‌ఫ‌రా చేస్తామ‌ని ప్ర‌క‌టించ‌డం ఇక్క‌డ గ‌మ‌నించాల్సిన అంశం. ఈ మేర‌కు సంత‌కాలు కూడా అయిపోయాయ‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఈ విధంగా.. రెండు విధానాల‌ను కొనసాగిస్తూ.. ప్ర‌పంచ య‌వ‌నిక‌పై మ‌రోసారి అగ్ర‌బావుటా ఎగ‌రేసేందుకు అమెరికా సిద్ధ‌మ‌వుతోందనే అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు విశ్లేష‌కులు. మ‌రి, ముందు ముందు ఇంకెలాంటి అడుగులు వేస్తుందో చూడాల్సి ఉంద‌ని అంటున్నారు.
Tags:    

Similar News